యస్వీ రంగారావు స్ఫూర్తితో..

Sat,January 19, 2019 11:40 PM

ఐదారేళ్ల క్రితం మంచి హిట్ సినిమా కోసం తపించాను. దృశ్యం చిత్రం నుంచి విజయాలు ఊపందుకున్నాయి. 2018 నా కెరీర్‌లో ఉత్తమమైన సంవత్సరంగా భావిస్తున్నాను అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఒకప్పుడు కథానాయకుడిగా తనదైన శైలి వినోదంతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నేడు నరేష్ జన్మదినం. ఈ సందర్భంగా శనివారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

గత ఏడాది తెలుగు పరిశ్రమ మంచి విజయాల్ని సాధించింది. అందులో నేను నటించిన ఎనిమిది సినిమాలు భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. యస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకొని పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నాను. ఏదో ఒక మూసకు పరిమితమైపోకుండా పాత్రలపరంగా వైవిధ్యాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నాను. గత ఏడాది రంగస్థలం మహానటి ఛలో తొలిప్రేమ సమ్మోహనం అరవింద సమేత వీరరాఘవ చిత్రాలు మంచి సంతృప్తినిచ్చాయి. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కథల్ని రాసుకుంటున్నాం అని రచయితలు చెబుతున్నారు. ఆ మాటలకు మించిన అవార్డు లేదనుకుంటున్నాను.

చిన్న చిత్రాలకు ప్రాధాన్యత

నేను పారితోషికం గురించి ఆలోచించడం లేదు. కథ నచ్చితే చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలో ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటించబోతున్నాను. మాలో (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నేను ఎప్పుడూ పదవుల్ని ఆశించలేదు. నా కుటుంబం ద్వారా మాకు ఇప్పటివరకు 30లక్షల వరకు విరాళాన్ని అందించాను. జాయింట్ సెక్రటరీగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగేలా చూస్తున్నాను. ఈ దఫా మాలో కొన్ని వివాదాలు చోటుసుకున్న మాట వాస్తవమే. అందరూ కోరితే మాలో ధర్మాన్ని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

1271

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles