సినిమానే నా రాజకీయం!


Fri,February 1, 2019 11:06 PM

i am already in politics for me says mammootty

కంప్లీట్ యాక్టర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మలయాళ కథానాయకుడు మమ్ముట్టి. ముప్ఫై ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో ఆయన చేయని పాత్ర లేదు.స్పృశించని కథాంశంలేదు. విలక్షణ అభినయంతో ఎన్నో అజరామరమైన పాత్రలకు ప్రాణంపోసి దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో నిజమైన సూపర్‌స్టార్‌గా నిలిచిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత యాత్ర సినిమాతో మమ్ముట్టి తెలుగులో పునరాగమనం చేస్తున్నారు. మహి.వి.రాఘవ్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదలకానుంది.ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో మమ్ముట్టి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...

సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమా చేయడం ఎలా ఉంది?

-యాత్ర చిత్రంతో తెలుగులో మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్లలో నాలో ఉత్సుకతను, ఆసక్తిని రేకెత్తించే కథలతో ఎవరూ సంప్రదించలేదు. అందుకే తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను.

స్వాతికిరణంలో నటిస్తున్న సమయంలో ఎలా ఉన్నారో ఇప్పడు అలాగే కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ ఏమిటి?

-ఆ రహస్యాన్ని మాటల్లో వర్ణించలేను. భగవంతుడి దయ వల్లే ఇప్పటికి అలాగే ఉన్నానని భావిస్తున్నాను (నవ్వుతూ).

ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?

-ఇది వై.ఎస్.ఆర్ జీవిత కథ కాదు. ఓ వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా రెండు గంటల్లో తెరపై ఆవిష్కరించడం అసాధ్యం. వైఎస్.ఆర్ జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని తీసుకొని మహి.వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. పాదయాత్ర నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకు ఆయన జీవితంలోని సంఘటనలకు దృశ్యరూపంగా ఈ సినిమా ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటూ వాటికి పరిష్కరాల్ని సూచిస్తూ రాజశేఖర్‌రెడ్డి ఎలా ముందు సాగాడన్నది భావోద్వేగభరితంగా ఉంటుంది.

వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్ర కోసం ఎలాంటి పరిశోధన చేశారు?

-సినిమా కోసం వై.ఎస్.ఆర్‌ను అనుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన వస్త్రధారణ, నడక, మాట్లాడేతీరును ఉన్నది ఉన్నట్లుగా చూపించడం వల్ల పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. పాత్ర ఆత్మకు అనుగుణంగా నా శైలిలో వై.ఎస్.ఆర్ పాత్రలో నటించే ప్రయత్నం చేశాను. ఈ కథ కోసం దర్శకుడు మహి.వి.రాఘవ్ ఎక్కువ కష్టపడటం వల్ల నా పని సులభమైంది.

రాజకీయ నేపథ్య ఇతివృత్తంతో సినిమా చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-గతంలో నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇదివరకు చారిత్రక ఇతివృత్తాలతో రూపొందిన అంబేద్కర్, బషీర్ జీవితకథల్లో నటించాను. రాజకీయ నాయకుడి జీవితంపై రూపొందిన సినిమాలో నటించడం ఇదే తొలిసారి.

రాజకీయాల పట్ల మీకు ఆసక్తి ఉందా?

-38 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాను.సినిమానే నా రాజకీయం. చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లను. ఇక్కడే ఉంటాను.

గత రెండుమూడేళ్లుగా విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాల్ని చేస్తున్నారు

-ప్లాన్ చేసి నేను ఏదీ చేయను. తమిళంలో నటించిన పెరంబు చిత్రం మూడేళ్ల క్రితం అంగీకరించాను. యాత్ర సినిమా గత ఏడాది ఒప్పుకున్నాను. వారం తేడాతో రెండు ఒకేసారి విడుదల అవుతున్నాయి. సినిమా వెనుక ఎంతో మంది కృషి, శ్రమ దాగి వుంటాయి.. ఒక్కరూ ప్లాన్ చేస్తే సరిపోదు.

మీ తనయుడు దుల్కర్ సల్మాన్ మీకు పోటీ అని అనుకుంటున్నారా?

-తన అమ్మపై ప్రేమను చూపించడంలో దుల్కర్ నాతో పోటీపడుతున్నాడు.

తెలుగు సినిమాలు చూస్తుంటారా?

-తరుచుగా చూస్తుంటాను. ఇటీవల రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు చూశాను.

డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమైనా ఉన్నాయా?

-డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమీ లేవు. చేసే ప్రతి సినిమాను డ్రీమ్‌రోల్‌గానే భావిస్తాను.

2346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles