ఈ సినిమాకు మీరే హీరో అంటున్నారు!


Sun,August 13, 2017 12:43 AM

His latest film is Jaya Janaki Nayaka. Bellamkonda srnivas is the hero

కథాబలమున్న చిత్రాలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. కథ డిమాండ్‌ని బట్టి ఏ మేరకు అవసరమో ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి వెనుకాడను. అలాగని అనవరంగా ఖర్చు చేయను. కథను నమ్ముకుని మాత్రమే సినిమాలు చేస్తాను అన్నారు యువ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. ఆయన నిర్మించిన తాజా చిత్రం జయ జానకి నాయక. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
director

జయ జానకి నాయక చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తున్నది?

సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీగా నిర్మించారని, నిర్మాణ విలువలు బాగున్నాయని. ఈ సినిమాకు మీరే హీరో అని చెబుతుంటే ఆనందంగా వుంది. శుక్రవారం రాత్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి సినిమాపై నమ్మకంతో అనుకున్న సమయానికి విడుదల చేసి మంచి చిత్రాన్ని అందించారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ మరిన్ని అత్యుత్తమమైన చిత్రాల్ని అందించాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అభిరుచిగల నిర్మాతగా నిలబడతారు అని అభినందించారు. ఈ సినిమా విషయంలో నాకు లభించిన తొలి ప్రశంస ఇది.

హీరో సాయి శ్రీనివాస్‌కు ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందించాను అనుకుంటున్నారు?

సాయిశ్రీనివాస్ స్థాయిని పెంచే సినిమా ఇది. నా కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా జయ జానకి నాయక నిలిచిపోతుందిఅని సాయిశ్రీనివాస్ గొప్పగా చెబుతుండటం మరింత సంతోషాన్ని కలిగిస్తున్నది.

ఒకే రోజు మూడు చిత్రాలు పోటీపడటం వల్ల నష్టం కలుగుతుందని అనిపించలేదా?

తొలి రోజు నుంచి సినిమాపై నమ్మకంతో వున్నాను. ఆత్మ విశ్వాసంతో ఏ పని తలపెట్టినా దానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. అయితే మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సినిమాపై మాకున్న నమ్మకం వల్లే ఎన్ని చిత్రాలు పోటీ వచ్చినా అనుకున్న తేదీనే చిత్రాన్ని విడుదల చేశాం. మేము ఊహించిన విధంగానే ప్రేక్షకులు మా చిత్రానికి అనూహ్య విజయాన్ని అందించి మా నమ్మకాన్ని నిజం చేశారు.

దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని మీరు అనుకున్న స్థాయిలో తెరకెక్కించారా?

బోయపాటి శ్రీనుకు సినిమానే ప్రాణం. ఆయన నుంచి సినిమా అంటే ఏ స్థాయిలో వుంటుందో అందరికి తెలిసిందే. ఆయన ఈ చిత్రాన్ని ప్రాణంపెట్టి రూపొందించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బోయపాటిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే హంసల దీవిలో ఆయన చిత్రీకరించిన పోరాట ఘట్టాల గురించి ఓ స్థాయిలో చెబుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ ఈ స్థాయి యాక్షన్ దృశ్యాల్ని చూడలేదని, రానున్న పదేళ్లల్లో ఈ స్థాయిలో పోరాట దృశ్యాల్ని ఎవరూ చూపించలేరేమో అని అంత అద్భుతంగా వున్నాయని అంతా అభినందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం 30 రోజులు శ్రమించాం.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కొత్త హీరో... అతని మార్కెట్‌ని మించి ఖర్చు చేయడం రిస్క్ అనిపించలేదా?

నేను ఒక సినిమా అనుకున్నప్పుడు నటీనటులను ఎంతగా నమ్ముతానో అంతకంటే ఎక్కువగా సాంకేతిక నిపుణుల్ని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే జయ జానకి నాయక చిత్రాన్ని నిర్మించాను. అలా నమ్మాను కాబట్టే హీరో కొత్త వాడైనా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. కొత్త హీరో, బడ్జెట్ అనే లెక్కలు వేసుకుంటే సినిమా చేయలేం.

నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?

బోయపాటి శ్రీను దర్శకుడనే భావనతో ఈ చిత్రాన్ని ఇంత భారీగా నిర్మించలేదు. కథాబలమున్న చిత్రాలకే నా తొలి ప్రాధాన్యత. కథ డిమాండ్‌ని బట్టి ఏ మేరకు అవసరమో ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనుకాడను. అలాగని అనవరంగా ఖర్చు చేయను. కథను నమ్ముకుని మాత్రమే సినిమాలు చేస్తాను.

బడ్జెట్ గురించి తెలిసి రిస్క్ చేస్తున్నారని మిమ్మల్ని భయపెట్టిన వాళ్లు ఎవరైనా వున్నారా?

ఓ పని చేస్తున్నాం అంటే చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అలా సలహాలు ఇచ్చివాళ్లంతా మన మంచి కోసం చెబుతున్నారనే భావించాలి. అందులో కొన్ని నెగెటీవ్‌గా వున్నా మనం మాత్రం వాటిని పాజిటీవ్‌గానే స్వీకరించాలి. రిస్క్ అనేది ప్రతి రంగంలోనూ వుంటుంది. రిస్క్ వుందికదా అని వెనకడుగు వేస్తే రాణించలేం.

తదుపరి చిత్రాల గురించి?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో తెలియజేస్తాను. ఈ సినిమాతో పాటు మరో ఇద్దరు దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చాను. ఆ చిత్రాలకు సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తికాగానే వాటి వివరాలు వెల్లడిస్తాను.

650

More News

VIRAL NEWS