ఆ సన్నివేశాలతో సినిమాలు ఆడవు!


Sun,June 2, 2019 11:56 PM

hippi movie will release on 6th of this month

గత కొంత కాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా వుండటానికి ప్రధాన కారణం నన్ను ఆశ్చర్యానికి, ఉత్సుకతకు గురిచేసిన కథ నా వద్దకు రాలేదు. అదీ కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బిజీగా వుండటం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేకపోయాను అన్నారు జేడీ చక్రవర్తి. కొంత విరామం తరువాత ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం హిప్పీ. టీఎన్ కృష్ణ దర్శకుడు. కార్తికేయ కథానాయకుడు. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి ఆదివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

హిప్పీ స్క్రిప్ట్ నాకెంతగానో నచ్చింది. మలయాళంలో చేసిన మిఘాయిల్, తమిళంలో పట్టరై, ఇరువర్, కన్నడంలో గాంధీగిరి ఈ చిత్ర కథలు నన్నెంతగానే ఉత్సుకతకు గురిచేశాయి. అందుకే ఈ చిత్రాల్లో నటించాను. హిప్పీ కథ చెప్పినప్పుడే నాలో ఉత్సుకతను రేకెత్తించింది. అందుకే ఈ చిత్రంలో నటించాను. సాధారణంగా ఎవరు కథ చెప్పినా పాత్రని వినడానికి ప్రయత్నిస్తారు కానీ నేను మాత్రం కథ వినడానికే ప్రాధాన్యతనిస్తాను. హిప్పీ కథ విన్నప్పుడు ఈ కథకు బాగా కనెక్ట్ అయిపోయాను. నా పాత్ర కూడా కొత్తగా వుండటంతో వెంటనే అంగీకరించాను. నేటి యువత ఎలా ఆలోచిస్తున్నారో దాన్నే ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు టీఎన్ కృష్ణ. సినిమాలో ప్లేబాయ్‌గా కనిపిస్తాను. ఇది నా నిజజీవితానికి దగ్గరగా వుంటుందని అంతా అనుకుంటారు. ఆ స్థాయిలో నా పాత్ర చిత్రణ వుంటుంది. పెళ్లి చాలా మంచిది. మంచి వాళ్లు మాత్రమే చేసుకోవాలి అని చెబుతుంటాను.

తెలుగులో అన్నీ హీరో సెంట్రిక్ చిత్రాలే..

బాలీవుడ్‌లో పాత్రల ప్రధానంగా సాగే చిత్రాలే ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ స్టార్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్న తేడా కనిపించదు. ఆ సినిమాల్లో ప్రతీ పాత్రకూ ప్రాధాన్యత వుంటుంది. కానీ మన దగ్గర అలా కాదు. అది తప్పని నేను చెప్పను. మనదగ్గర అన్నీ హీరో ప్రధాన చిత్రాలే. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వలేం. అలా అని అది తప్పని చెప్పడం లేదు. అయితే ఈ పంథాలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా అటువైపుగా అడుగులు వేస్తోంది.

అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100..

శృంగార సన్నివేశాల వల్లే సినిమాలు ఆడవు. ఒక సినిమా విజయం సాధిస్తే తరువాత చాలా మంది వాళ్లకు అర్థమైనదాన్ని ప్రధానంగా తీసుకుని మితిమీరిన శృంగార అంశాలతో సినిమాలు తీస్తున్నారు. అలా తీసిన ఏ సినిమా ఆడటం లేదు. అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయంటే ఆ చిత్రాల్ల్లో వున్న బలమైన భావోద్వేగాలే. ఈ చిత్రాల్లో లస్ట్ అనేది చిన్న అంశం మాత్రమే. హిప్పీ కూడా అలాంటి చిత్రమే. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, ఇద్దరమ్మాయిల పాత్రలే ఈ సినిమాకు కీలకం. నాకు బాగా నచ్చింది. నాలాగే రేపు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఈ సినిమా చూస్తున్నపుడు చాలా మందికి ఇలా జరిగి వుంటుంది కదా. కొంత మంది ఇలా జరిగితే బాగుంటుంది కదా అనుకుంటారు. దర్శకుడు తను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా బోల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో..

చాలా రోజుల తరువాత మా గురువు రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రానికి వర్మ నిర్మాత మాత్రమే. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అతను ఎవరనేది త్వరలో తెలియజేస్తాను. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బిజీగా వుండటం వల్ల దర్శకత్వం వహించాలనే ఆలోచనను పక్కన పెట్టాను. అయితే అక్టోబర్‌లో మాత్రం తెలుగు, హిందీ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను.

2080

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles