సహజీవనం ఇష్టం ఉండదు!


Fri,June 7, 2019 11:23 PM

Hippi Heroine Digangana Suryavanshi Press Meet

తెలుగు పరిశ్రమ నా సొంత ఇల్లు అనే భావన కలుగుతున్నది. అభినయప్రధాన పాత్రల ద్వారా ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం అని చెప్పింది దిగాంగనా సూర్యవన్షీ. హిప్పీ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసిందీ సుందరి. కార్తికేయ కథానాయకుడిగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక దిగాంగనా సూర్యవన్షీ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన సంగతులివి...

బుల్లి తెరపై మంచి గుర్తింపు...

హిందీ బుల్లితెరపై నేను మంచి గుర్తింపును సంపాదించుకున్నాను. నటనతో పాటు నాకు రచనలో కూడా ప్రవేశం ఉంది. హిందీ బిగ్‌బాస్-9 సీజన్‌లో పాల్గొన్నాను. బిగ్‌బాస్ షోలో ప్రవేశం పొందిన చిన్న వయస్కురాలిని నేనే. హిందీలో మూడు చిత్రాల్లో నటించాను. హిప్పీ దక్షిణాదిలో నా తొలి చిత్రం. నేటి యువతీయువకుల మనోభావాలకు దర్పణంలా నిలిచే నవ్యమైన ప్రేమకథ ఇది. నా పాత్ర చిత్రణతో పాటు కథలోని భావోద్వేగాలు నచ్చడంతో సినిమాను అంగీకరించాను.

నాదీ అదే మనస్తత్వం..

హిప్పీ చిత్రంలో ఆధునిక భావాలు కలిగిన ఆమూక్త మాల్యద అనే అమ్మాయి పాత్రను పోషించాను. ప్రియుడిని తన ఆధీనంలో ఉంచుకోవాలని తపించే అమ్మాయిగా కనిపిస్తాను. వ్యక్తిగత జీవితంలో కూడా నాలో అలాంటి డామినెంట్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఆమూక్తమాల్యద పాత్రతో బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నటనాపరంగా భిన్న కోణాల్ని చూపించే అవకాశం దక్కింది. కథానాయకుడితో సమానమైన పాత్ర పోషించానని అందరూ ప్రశంసిస్తున్నారు.

అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది..

ప్రేమ పేరుతో సహజీవనం నాకు నచ్చదు. అయితే వ్యక్తుల మనస్తత్వాలు, వారు ఉండే పరిస్థితులను బట్టి సహజీవనంలోని నైతికత ఆధారపడి ఉంటుంది. పరస్పరం ఇష్టపడుతూ అనుకోని కారణాల వల్ల వివాహం చేసుకోవడం ఆలస్యమయ్యే జంటలు సహజీవనం చేయడంలో అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ ఒకరినొకరు తెలుసుకునే నెపంతో ఒక టెస్ట్‌డ్రైవ్‌లా సహజీవనం చేయాలనుకోవడం అర్థం లేనిది. భవిష్యత్తులో తెలుగు చిత్రసీమ రాణించాలనే నిశ్చయంతో ఉన్నాను. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాల్ని త్వరలో తెలియజేస్తాను.

3133
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles