ఎక్కడ వుందో తారక..!


Wed,April 24, 2019 11:56 PM

heroes not finds the suitable heroines

ఓ అగ్ర హీరో సినిమా కోసం దర్శకుడితో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. కానీ కథానాయిక బెర్తు మాత్రం ఖాళీగానే మిగిలిపోయింది. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. మరో సినిమా చిత్రీకరణ ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తికాలేదు. కథానాయికలు కావలెను అంటూ చిత్రబృందం నిరీక్షిస్తూనే ఉంది... ఇలా టాలీవుడ్‌లో స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల సినిమాలు సైతం కథానాయికల కోసం ఎదురుచూస్తున్నాయి. తమ కథకు సరిపోయే నాయికల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. హీరోయిన్‌లకు కొరత లేకపోయినా తమకు కావాల్సిన నాయికలు మాత్రం వారికి దొరకడం లేదు. ఒకేసారి నాలుగైదు భాషల్లో హీరోయిన్లు సినిమాలు చేస్తుండటంతో వారి డేట్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ప్రస్తుతం సినిమాల ఎంపికలో తన పంథాను మార్చుకున్నారు మహేష్‌బాబు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తున్నారు. తాజాగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత అనిల్‌రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రతీకార కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్వనిర్మాణ పనులన్నీ పూర్తయినట్లు తెలిసింది. అయితే కథానాయిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. హీరోయిన్ కోసం చిత్రబృందం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన రష్మిక మందన్న నటించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆమెతో పాటు కొందరు బాలీవుడ్ తారల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మహేష్‌తో జోడీ కట్టే నాయిక ఎవరో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
anuska
శ్రీనివాసకల్యాణం తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న భీష్మతో పాటు చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. భీష్మలో రష్మిక మందన్న కథానాయిక నటించనుండగా చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో మాత్రం హీరోయిన్ బెర్తు ఖాళీగానే మిగిలింది. ఈ స్థానాన్ని రకుల్‌ప్రీత్‌సింగ్‌తో భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలతో పాటు తెలుగులో మన్మధుడు-2 చిత్రాల్లో నటిస్తూ రకుల్ బిజీగా ఉంది. ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేని పక్షంలో ఈ సినిమాతో కొత్త హీరోయిన్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయాలనే అలోచనలో వున్నారట.
Catherine
బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో అలియాభట్‌తో పాటు బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోనాస్ హీరోయిన్లుగా నటించనున్నట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించారు. అయితే షూటింగ్‌లో అడుగుపెట్టకముందే అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గార్ జోనాస్ తప్పుకున్నది. ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్, పరిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెరాండెజ్‌లలో ఒకరిని హీరోయిన్‌గా ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. త్వరలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా చిత్రబృందం ప్రకటించబోతున్నట్లు తెలిసింది.
kiara-advani
ఆర్య, పరుగు, డీజే దువ్వాడ జగన్నాథమ్ తర్వాత హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్‌రాజు కలయికలో ఐకాన్ కనబడుటలేదు పేరుతో మరో సినిమా రూపొందుతున్నది. ఎమ్‌సీఏ ఫేమ్ వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రోడ్‌జర్నీ నేపథ్యంలో వినూత్న ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీని ఎంపికచేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. కథానాయిక పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాకావడంతో బాలీవుడ్ నటి అలియాభట్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆమెతో పాటు సమంత పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
shrrradaa
లౌక్యం తర్వాత గోపీచంద్‌కు సరైన సక్సెస్ లేదు. మంచి విజయం కోసం నీరిక్షిస్తున్న ఆయన ప్రస్తుతం స్పైథ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమాను చేస్తున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కథానాయిక ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తమన్నా, ఇలియానా, మెహరీన్‌తో పాటు పలువురు తారల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా చిత్రబృందం మాత్రం హీరోయిన్ పేరును వెల్లడించలేదు.
mehareen
తమిళ చిత్రం తేరిని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు రవితేజ. సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి కనకదుర్గ అనే పేరును ఖరారుచేసినట్లు తెలిసింది. ఇద్దరూ హీరోయిన్లకు చోటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కేథరిన్‌లతో ఈ స్థానాల్ని భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. రష్మిక మందన్న, కియారా అద్వానీలలో ఒకరికి ఈ అవకాశం దక్కినట్లు చెబుతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న హీరో సినిమాతో కోలీవుడ్ హీరోయిన్‌ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొన్ని సినిమాల కోసం కథానాయికల అన్వేషణ సాగుతున్నది.
shrrrada
ఖైదీ నంబర్ 150తో ఘనమైన పునరాగమనం చేశారు హీరో చిరంజీవి. ప్రస్తుతం తొలితరం స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారాయన. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలకానుంది. సైరా.. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌పనులు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సరసన నటించబోయే నాయిక కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. చిరంజీవి సినిమాతో శృతిహాసన్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు నయనతార, అనుష్క, కీర్తిసురేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఒకరిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
Tamannaah
...?చిత్రం డెస్క్

1970

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles