హాలీవుడ్‌ సినిమాలా అనిపించింది

Tue,October 22, 2019 12:10 AM

కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖైదీ’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆదివారం చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. కార్తీ మాట్లాడుతూ “ఖాకీ’ చిత్రం నేను కొత్త ప్రయోగాలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది. దర్శకుడు ‘ఖైదీ’ చిత్ర కథ చెబుతున్నప్పుడే హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలా అనిపించింది. ఈ సినిమా ప్రజెంటేషన్‌ విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా లారీ మీద లైవ్‌ యాక్షన్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అంతా యువకులైన బృందంతో ఈ సినిమాను తెరకెక్కించారు. పోరాటఘట్టాలతో పాటు సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంటుంది. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చిన ‘ఖైదీ’ కథ ఇది. అతనికి అప్పటివరకు చూడని కూతురు ఉంటుంది. తండ్రీకూతురు మధ్య డ్రామా హృదయాల్ని స్పృశిస్తుంది. ఈ టైటిల్‌ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ‘ప్రస్తుతం ప్రేక్షకులు కథాంశాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇందులో పాటలు, రొమాన్స్‌ వంటి అంశాలు లేవు..కానీ రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది’ అని కె.కె.రాధామోహన్‌ తెలిపారు. “ఆవారా’ సినిమాను నేను బ్లాక్‌ టికెట్‌ కొనుక్కొని చూశాను. కార్తీ సినిమాలకు పెద్ద అభిమానిని. మీ అందరితో పాటు సినిమా చూడాలని ఆసక్తితో ఉన్నాను’ అని అడివి శేష్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్‌ మధు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు తదితరులు పాల్గొన్నారు.

1191

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles