కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తాను!


Sun,June 2, 2019 01:28 AM

hero havish seven movie interview

కెరీర్ ఆరంభం నుంచి నవ్యమైన కథాంశాల్నిఎంచుకుంటూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు యువ హీరో హవీష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 7. నిజార్ షఫీ దర్శకుడు. ఈ నెల 5న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కథానాయకుడు హవీష్ శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

7 చిత్ర కథాంశం రెగ్యులర్ థ్రిల్లర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లర్ అంశాల కలబోతగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆరుగురు నాయికలుంటారు. 7 అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సివచ్చిందో సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

నాణ్యత విషయంలో రాజీలేదు..

దాదాపు 130రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నిర్మాణానికి సమయం ఎక్కువ తీసుకుంది. నేను ఏ కథ ఎంచుకున్నా అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. రొటీన్ కమర్షియల్ కథాంశాలతో సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. 7 ట్రైలర్ చూసిన నాకు మూడు సినిమాల్లో అవకాశాలిచ్చారు. సాధారణ థ్రిల్లర్‌లా సీరియస్‌గా సాగకుండా ఆహ్లాదభరితమైన రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది.

ముద్దు సన్నివేశాల్లో భయమేసింది...

కథానుగుణంగా ఈ సినిమాలో కొన్ని ముద్దు దృశ్యాలున్నాయి. తొలిరోజు నాయికకు ముద్దుపెట్టమన్నారు. ఈ విషయం నాకు ముందు చెప్పలేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఫీలయితే ఎలా? అని కంగారుపడ్డాను. కథ డిమాండ్ మేరకే ఆ సీన్స్‌ను పెట్టడం జరిగింది. ఇక సినిమాల బడ్జెట్ గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. భారీ బడ్జెట్ కంటే కథలో నవ్యతే ముఖ్యమని భావిస్తాను. ఇకముందు కూడా అదే పంథాలో సినిమాలు చేస్తాను.

ఎక్కడా కాపీ కొట్టలేదు...

థ్రిల్లర్ సినిమాలు అనగానే విదేశీ చిత్రాల నుంచి కాపీ అనే భావన వస్తుంది. 7 చిత్ర కాన్సెప్ట్ ఇప్పటివరకు ఏ భాషా చిత్రంలోనూ రాలేదు. యూనివర్సల్ ఫీల్ ఉన్న కథాంశమిది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించాం. నువ్విలా మొదలుకొని నా సినీ ప్రయాణం సాఫీగాసాగిపోతున్నది. కొన్ని పరాజయాలు పలకరించినా వినూత్న కథా చిత్రాల్ని చేశాననే సంతృప్తి ఉంది.

నవ్యతకే పెద్దపీట..

కథలో ఏదో కొత్తదనం ఉంటేనే సినిమా అంగీకరిస్తాను. ప్రస్తుతం అభిషేక్ ఫిల్మ్స్ సంస్థలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాను. కుటుంబ అనుబంధాలు, ప్రేమ అంశాలు కలబోసిన చిత్రమిది. ఇక స్వీయ నిర్మాణ సంస్థలో బెల్లంకొండ హీరోగా రాక్షసుడు చిత్రాన్ని తెరకెక్కించాను. ఇదొక విభిన్నమైన థ్రిల్లర్. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

1278

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles