‘హలో’ గీతావిష్కరణ


Mon,December 11, 2017 11:04 PM

Hello Movie Audio Launched by ganta srinivasrao

hello
హలో సినిమాతో అఖిల్‌ను పరిశ్రమకు తిరిగి పరిచయం చేస్తున్నాను. మూడు రోజుల క్రితమే సినిమా చూశాను. తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ కొడతామన్న నమ్మకం వుంది అన్నారు నాగార్జున. ఆయన తనయుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హలో. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. అనూప్‌రూబెన్స్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఆదివారం విశాఖపట్నంలో విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆడియో సీడీ తొలి ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తెలుగు పరిశ్రమకు డ్యాన్సుల్ని పరిచయం చేసింది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఛరిష్మా అనితరసాధ్యం. అఖిల్‌లో నాకు నాన్నగారు కనబడుతున్నారు. అఖిల్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలని ఇష్టపడతారో ఆ విధంగానే హలో చిత్రంలో కనిపిస్తాడు. అఖిల్‌ను పెద్ద హీరోని చేయాలనే సంకల్పంతో చిత్ర బృందమంతా అంకితభావంతో శ్రమించారు. నిర్ణయం సినిమాలో నన్ను, అమలను దర్శకుడు ప్రియదర్శన్ కలిపారు. ఇప్పుడు ప్రియదర్శన్‌గారి అమ్మాయి ఈ సినిమాలో కథానాయికగా నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్యతో అన్నపూర్ణ సంస్థలో సినిమా చేస్తున్నాను అన్నారు. అఖిల్ మాట్లాడుతూ హలో ఉద్వేగభరిత ప్రయాణం. అమ్మానాన్నలు గర్వించేలా ఈ సినిమా కోసం కష్టించాను.

రెండేళ్ల పాటు సినిమా లేకుండా ఖాళీగా వున్నా ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమా విజయం తథ్యమని నమ్ముతున్నాను అన్నారు. ప్రియదర్శన్ మాట్లాడుతూ నా కెరీర్‌లో 92 సినిమాలు చేశాను. అందులో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఏఎన్నార్‌తో పాటు నాగార్జున, అమలతో కలిసి పనిచేశాను. ఇప్పుడు అఖిల్.. మా అమ్మాయితో కలిసి నటించడం ఆనందంగా వుంది. నా శిష్యుల్లో ఇష్టమైన విక్రమ్‌కుమార్ నా కంటే పెద్ద దర్శకుడిగా ఎదుగుతున్నాడు అన్నారు. నాకు ఇష్టమైన దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఆయనతో చేసిన ఇష్క్ మనం సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. హలో సినిమాకు పాటలకు బాగా కుదిరాయి. సంగీతం అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను అని అనూప్‌రూబెన్స్ తెలిపారు. ఈ సినిమాకు అనూప్‌రూబెన్స్ హృదయానికి హత్తుకునే సంగీతాన్నందించాడని గీత రచయిత చంద్రబోస్ పేర్కొన్నారు. అఖిల్‌ను చక్కటి ప్రేమకథలో చూడాలని వుండేది. ఆ లోటు ఈ సినిమాతో తీరిపోనుంది. డిసెంబర్ నెల మా కుటుంబానికి సెంటిమెంట్. ఈ మాసంలో విడుదలైన మా చిత్రాలన్ని మంచి విజయాల్ని అందుకున్నాయి. డిసెంబర్ 22 అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైన రోజు అని సమంత, నాగచైతన్య వీడియో సందేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అమల, మహేష్‌రెడ్డి, శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.

1143

More News

VIRAL NEWS