రామ్ నవరసాలు పండించాడు


Sun,October 14, 2018 01:55 AM

Hello Guru Prema Kosame Pre Release Event

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఫస్ట్ బిగ్ టికెట్‌ను స్రవంతి రవికిషోర్ ఆవిష్కరించి దిల్‌రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ నేను లోకల్ తర్వాత మాటల రచయిత ప్రసన్న ఓ రోజు ఫోన్ చేసి నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయని చెప్పారు. అందులో హలో గురు ప్రేమకోసమే ఒకటి. తొలుత ఈ కాన్సెప్ట్‌లో ఏముంది? ఎంటర్‌టైన్‌మెంటే కదా అనుకొని రెండో స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాను. దానిమీదే వర్క్ చేయడం ప్రారంభించాం.

అయితే ప్రకాష్‌రాజ్‌గారు ఈ కథ బాగుందని నాతో చెప్పారు. దాంతో తిరిగి హలో గురు ప్రేమకోసమే కాన్సెప్ట్‌ను తీయాలనుకున్నాం. ఈ సినిమాలో ఉన్న పాయింట్‌కి అందరం కనెక్ట్ అయ్యాం. కామెడీతో పాటు ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంటుంది. రెండుగంటల పదిహేను నిమిషాల నిడివి గల ఈ సినిమాలో గంట పది నిమిషాల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో మా సంస్థకిది తొమ్మిదవ చిత్రం. పాటలు అద్భుతంగా కుదిరాయి. రామ్ బెస్ట్ పర్‌ఫార్మర్. నేను శైలజ తర్వాత రామ్ ఈ సినిమాలో సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. కథను ఓన్ చేసుకొని నవరసాలు పండించాడు. రామ్, ప్రకాష్‌రాజ్, అనుపమ.. సినిమాకు మూడుస్తంభాలుగా నిలిచారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ రామ్ తీవ్రమైన జ్వరంలో కూడా ఓ మాస్ పాటకు డ్యాన్స్ చేశాడు. అంత కమిట్‌మెంట్‌తో సినిమా కోసం పనిచేశాడు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకునే చిత్రమిది అన్నారు. రామ్ మాట్లాడుతూ యూనిట్‌లోని ప్రతి ఒక్కరు ఈ సినిమా కాన్సెప్ట్‌తో కనెక్ట్ అయ్యారు. ప్రసన్నకుమార్ చక్కటి సంభాషణల రాశారు. దేవిశ్రీప్రసాద్‌తో నేను చేసిన ఆరో చిత్రమిది అన్నారు.

తెలుగు ప్రేక్షకుల ప్రేమ మరచిపోలేనిది

MGK.jpg
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ తెలుగులో నా ఏడవ చిత్రమిది. శతమానం భవతి తర్వాత దిల్‌రాజుగారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పుడూ మరచిపోలేనివి అన్నారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో రొమాన్స్, ఎమోషన్స్, కామెడీ బాగా పండాయి. రామ్ కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. రామ్, అనుపమపరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు. ఈ వేడుకలో నాయకానాయికలు రామ్, అనుపమపరమేశ్వరన్‌లతో కలసి నిర్మాత దిల్‌రాజు నృత్యం చేయడం ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్రవంతి రవికిషోర్, సాయికృష్ణ, ప్రసన్నకుమార్, సాహి సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

2334

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles