ఆ విషయంలో గర్వంగా ఉంది!


Mon,August 19, 2019 12:06 AM

evaru director venkat ramji interview

మీరు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ బ్యాచ్ అని, మీకు మాస్ పల్స్ తెలియదని పీవీపీగారు మమ్మల్ని ఎప్పుడూ తిడుతుంటారు. ఆయన అన్నట్టే ఎవరు ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత ఇది ఏ సెంటర్‌లో మాత్రమే ఆడుతుందనుకున్నాం. కానీ మా అంచనాలని తారు మారు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అడివి శేష్ పోషించిన విక్రమ్ వాసుదేవ్ పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అన్నారు వెంకట్ రామ్‌జీ. ఆయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఎవరు.అడివి శేష్, రెజీనా కలయికలో పీవీపీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు వెంకట్ రామ్‌జీ పాత్రికేయులతో ముచ్చటించారు.

పీవీపీ సంస్థలో చాలా చిత్రాలకు వివిధ శాఖల్లో పనిచేశాను. ఆయనకు కథ చెప్పాలని ఓ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ని రాసుకుని వెళ్లాను. అయితే అది తరువాత చేద్దాం ముందు ఈ లైన్‌ని డెవలప్ చెయ్యాలని చెప్పారు. అప్పటికే నేను స్పానిష్ చిత్రం ది ఇన్విజిబుల్ గెస్ట్ చూశాను. అయితే దాన్ని యథాతదంగా తీసుకోకుండా ఆ కథలో తెలుగుకు అనుగుణంగా చాలా మార్పులు చేశాం. పాత్రల్ని మార్చాం. న్యాయం కోసం పోరాడుతున్న ఒక కొడుకు కథ ఇది. ఓ రివేంజ్ డ్రామాని థ్రిల్లర్‌గా మార్చి తెరపైకి తీసుకొచ్చాం. అదే ఇప్పుడు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ స్థాయి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు.

బద్లా గురించి ముందే తెలుసు..

ది ఇన్విజిబుల్ గెస్ట్ స్ఫూర్తితో బద్లా చేస్తున్నారని ముందే ఊహించాం. అయితే అందులోని భావోద్వేగాలు మన తెలుగు నేటివిటీకి దగ్గరగా లేవు. ఓ కథ చెప్పాలనుకున్నప్పుడు భావోద్వేగాలు ప్రధానం. ఎమోషన్స్ పండకపోతే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టం. దీంతో భావోద్వేగాల్ని మిళితం చేసి ఆకట్టుకోవాలని ప్రయత్నించాం. మాతృకకు మా చిత్రానికి అస్సలు పోలిక కనిపించదు. ఆ విషయంలో గర్వంగా వుంది. తెలుగు కథలో భావోద్వేగాలతో పాటు, కొన్ని పాత్రల్ని మార్చడమే కాకుండా మార్చుకున్న పాత్రలకు అనుగుణంగా కొత్త స్క్రీన్‌ప్లేని రాసుకున్నాం. ఈ విషయంలో అబ్బూరి రవి చాలా సపోర్ట్ చేశారు. కథ ఎక్కడో పట్టు తప్పుతుందని అనిపించిన చోట మాత్రం అడివి శేష్ సలహాలిచ్చారు. దాంతో మేము అనుకున్న కథని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగాం. అబ్బూరి రవి డైలాగ్‌లతో పాటు సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తే గర్వంగా వుంది. క్షణం సినిమాతో కొత్త తరహా చిత్రాల ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఆ కోవలో ఎవరు కూడా సక్సెస్ కావడం ఆనందంగా వుంది.

ఆమె కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్..

రెజీనా దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో వుంది. ఆమెకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు. అ! నుంచి తన పంథా మార్చుకుంది. ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం కొంత మందిని అనుకున్నాం. వారు తప్ప ఆ పాత్రలకు ప్రత్యామ్నాయం లేదు. రెజీనాను కూడా అలాగే ఎంచుకున్నాం. ఈ చిత్రంలోని సమీరా పాత్రకు రెజీనా నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఆమె కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తన కళ్లతోనే నటించి ఆకట్టుకుందామె. ఈ సినిమా తరువాత కూడా రెజీనా తనకు నచ్చిన చిత్రాల్లో మాత్రమే నటిస్తుందని నమ్ముతున్నాను. సినిమా చూసి చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది అభినందించారు. క్రిష్, రాఘవేంద్రరావు, ప్రకాష్ కోవెలమూడి ఫోన్ చేశారు. రవితేజ సినిమా చూస్తానన్నారు. త్వరలో పీవీపీ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను.

402

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles