ఎవరినీ అనుకరించను!


Sun,July 7, 2019 12:00 AM

dorasani movie heroine shivathmika first interview

సినీ నేపథ్యం చిత్రసీమలో అరంగేట్రానికి సులభంగా బాటలు వేస్తుంది. అయితే ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోవాలంటే స్వీయ ప్రతిభతో రాణించాల్సిందే. భవిష్యత్తులో నాదైన ముద్రతో పేరుతెచ్చుకుంటాను అని అంటున్నది సీనియర్ నటులు రాజశేఖర్-జీవిత ముద్దుల తనయ శివాత్మిక. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివాత్మిక పాత్రికేయులతో ముచ్చటించింది.

కల్కి సినిమాకు అక్క శివాని, నేను సహనిర్మాతలుగా వ్యవహరించాం. ఆ సినిమా నిర్మాణ వ్యవహారాల్లో మేమిద్దరం చురుగ్గా పాల్గొన్నాం. మా ఇద్దరి వర్క్ చూసి నాన్న చాలా సంతోషంగా ఫీలయ్యారు. కూతుళ్ల రూపంలో ప్రతిభావంతులైన వారసులు దొరికారని ఆనందపడ్డారు.


దొరసాని చిత్రంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?

-పాఠశాల రోజుల నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేది. కాలేజీ పూర్తయ్యాక నటిగా అరంగేట్రం చేద్దామని అనుకున్నాను. నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డిగారు మా కుటుంబానికి మంచి సన్నిహితుడు. కథానుగుణంగా ఈ సినిమా కోసం 18ఏళ్ల అమ్మాయిని తీసుకోవాలని ఆయన అనుకున్నారు. అప్పుడే నేను 12క్లాస్ పూర్తిచేశాను. ఓ సంవత్సరం విరామం తీసుకొని మెడిసిన్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఆ టైమ్‌లో శ్రీధర్‌రెడ్డిగారు ఈ కథతో మా కుటుంబాన్ని సంప్రదించారు. కథ వినగానే ఎంతగానో నచ్చింది. దొరసాని పాత్రకు నేను న్యాయం చేయగలననే విశ్వాసం కలిగింది. దాంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పాను.

షూటింగ్‌కు ముందు నటనాపరంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

-తొలుత స్క్రీన్‌టెస్ట్‌కు హాజరయ్యాను. ఆ తర్వాత ఆడిషన్స్ నిర్వహించారు. నేను, ఆనంద్ దేవరకొండ ఇద్దరం కలిసి అడిషన్స్‌లో పాల్గొన్నాం. దర్శకుడు కె.వి.మహేంద్ర స్క్రిప్ట్‌లోని ప్రతి అంశాన్ని పూర్తిగా మాకు వివరించారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ చిత్రాల్లోని కథానాయిక తరహాలో దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దారు. నా నడక, కూర్చునే విధానం చూసి నీలో నిజమైన దొరసాని కనిపిస్తుంది అని మహేంద్ర పొగిడేవారు.

కెమెరా ముందు తొలి సన్నివేశం అనుభవం ఎలా అనిపించింది?

-చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణాన్ని దగ్గరి నుంచి పరిశీలించాను కాబట్టి ఈజీగా యాక్ట్ చేయొచ్చు అనుకున్నాను. అయితే తొలిరోజు కెమెరా ముందు ఫ్రీజ్ అయిపోయాను. నేను నడుచుకుంటూ వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసే సన్నివేశాల్ని తొలిషాట్‌గా తీశారు. మూడు టేక్స్ తీసుకున్నాక ఆ సీన్ ఓకే అయింది.

మీ అమ్మనాన్నలో నటనాపరంగా మీపై ఎక్కువ ఎవరి ప్రభావం ఉందనుకుంటున్నారు?

-రూపురేఖల పరంగా నేను అచ్చం మా అమ్మలాగానే ఉంటాను. 18ఏళ్ల వయసులో అమ్మ నాలాగే ఉండేదని అప్పటి ఫొటోలు చూస్తే అర్థమైంది. ఇక నటన విషయంలో అమ్మనాన్నలిద్దరిలో ఎవరిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. అలా చేస్తే నాలోని సహజమైన నటన మిస్ అవుతుందనిపించింది. పాత్రను బాగా ఆకళింపు చేసుకొని అందులో జీవించే ప్రయత్నం చేయాలి. ఎవరినీ అనుకరించవొద్దు. అప్పుడే చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తావు అని అమ్మనాన్న సలహాలిచ్చారు. వారి మాటల్ని ఖచ్చితంగా పాటిస్తాను.

తొలి సినిమా కదా..షూటింగ్ అనుభవం ఎలా అనిపించింది?

-కోదాడ దగ్గరలోని నడిగూడెం గడీలో దాదాపు 25రోజులు షూటింగ్ జరిపాం. దాదాపు 150ఏళ్ల క్రితం నాటి గడీ అది. షూటింగ్ అంతా ప్రణాళికబద్దంగా జరిగింది. యూనిట్ అంతా ఓ కుటుంబంలా సినిమా కోసం శ్రమించాం.

దొరసానిలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

-80దశకం నాటి కథ ఇది. నేను దేవకి అనే దొరసాని పాత్రలో కనిపిస్తాను. అప్పటి దొరసానిలా రాజసం కలబోతగా నా పాత్ర ఉంటుంది. రాజు అనే ఓ సాధారణ యువకుడిని ప్రేమించిన దొరసానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే కథలో ఆసక్తిరంగా ఉంటుంది. అప్పటి గడీల నాటి పరిస్థితుల్ని కళ్లకు కడుతూ దర్శకుడు మహేంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ సినిమా డబ్బింగ్ మీరే చెప్పారట కదా?

-నాకు తెలుగుపై మంచి పట్టు ఉంది. తెలుగు పుస్తకాలు కూడా చదువుతాను. సింక్‌సౌండ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాంతో సంభాషణల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పాను.

ఆనంద్ దేవరకొండతో నటించడం ఎలా అనిపించింది?

-అడిషన్స్‌లో కలిసేంత వరకు అతను విజయ్ దేవరకొండ సోదరుడు అనే విషయం నాకు తెలియదు. ఆనంద్ ఎంతో సౌమ్యుడు. స్నేహశీలి. అతనితో షూటింగ్ సరదాగా సాగిపోయింది. మేమిద్దరం మంచి మిత్రులమయ్యాం.

కథానాయికగా భవిష్యత్తులో ఎలాంటి పాత్రలకు ప్రాధాన్యతత ఇవ్వాలనుకుంటున్నారు?

-నా వయసుకి తగిన పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. 18ఏళ్ల వయసే కాబట్టి ఇప్పుడే ప్రయోగాల జోలికి పోకుండా మెయిన్‌స్ట్రీమ్ సినిమాలే చేద్దామనుకుంటున్నాను.

కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు?

-అమ్మనాన్న తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. వారి పేరు నిలబెట్టేలా సినిమాలు చేయాలని వుంది. పరిశ్రమలో సుదీర్ఘకాలం ప్రయాణం సాగించేలా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాను.

1715

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles