ఆ భయం మంచిదే!


Sat,May 25, 2019 10:59 PM

director teja comments on audience

సీత చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో సీత పాత్ర నేటి ఆధునిక మహిళకు ప్రతిరూపంలా కనిపిస్తుంది అన్నారు దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సీత చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా తేజ శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ కలల సాఫల్యం కోసం పరుగులు పెడుతూ కీర్తిప్రతిష్టల కోసం తపిస్తుంటుంది సీత. ఇందుకు భిన్నంగా కథానాయకుడు రామ్ మృదుస్వభావి. సంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తి. భిన్న ధృవాలైన వీరిద్దరి సంఘర్షణ కథలో చక్కటి భావోద్వేగాల్ని పండించింది. అభినవ సీత గీత దాటితే ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నదే కథలో ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా నేను అప్‌డేట్ అవడం లేదనే వాదనలో ఏమాత్రం నిజం లేదు.

ఓరకంగా చెప్పాలంటే నేను ప్రేక్షకుల ఆలోచనలకంటే ఇంకా ముందున్నాను. నా సినిమాలో పనిచేసే నటీనటుల్ని కొడతాననే పుకారు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అది మంచిదే అనుకుంటున్నాను. అలాంటి భయాలు ఉన్నప్పుడే నా దగ్గరకు వచ్చే ఆర్టిస్టులు తమలోని ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాలనే తపనతో పనిచేస్తారు (నవ్వుతూ). సమీక్షకులు, పరిశ్రమలోని వారు నా గురించి ఏమనుకుంటున్నారే విషయాన్ని అస్సలు పట్టించుకోను. అంతిమంగా ప్రేక్షకుల తీర్పే ముఖ్యం. ప్రేక్షకులు సినిమాలోని తప్పుల్ని వెతికే ఉద్దేశ్యంతో సినిమా చూడరు. నచ్చితే ఆదరిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు. వెంకటేష్‌గారితో చేయాల్సిన సినిమా రద్దయింది. నా మూడ్ బాగాలేక ఆ సినిమాను వద్దనుకున్నా (నవ్వుతూ). తదుపరి సినిమా గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నారు.

1817

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles