నేటి తరానికి వాళ్ల గొప్పతనం తెలియాలి!

Wed,October 2, 2019 12:07 AM

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరిగా చరిత్రలో మరుగున పడిన వీరులు చాలా మంది ఉన్నారు. సైరా తర్వాత చిరంజీవి స్ఫూర్తితో అలాంటి వీరుల కథల్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది ధైర్యంగా ముందుకొస్తారనే నమ్మకముంది అని అన్నారు సురేందర్‌రెడ్డి. అతనొక్కడే, కిక్, రేసుగుర్రం చిత్రాలతో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. తొలిసారి తన పంథాకు భిన్నంగా చారిత్రక కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం సురేందర్‌రెడ్డి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...


సైరాకు దర్శకత్వం వహించే అవకాశం మీకు ఎలా వచ్చింది?

-ధృవ సక్సెస్‌టూర్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడ ఉన్నప్పుడే ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించావని ప్రశంసిస్తూ చిరంజీవి నాకు మెసేజ్ పంపించారు. అదే రోజు సాయంత్రం ధృవ తర్వాత ఏ సినిమా చేయబోతున్నావని రామ్‌చరణ్ నన్ను అడిగారు. ఏం అనుకోలేదని చెప్పాను. నాన్నతో సినిమా చేస్తావా అని చరణ్ అడగ్గానే వెంటనే ఓకే చెప్పాను.

చారిత్రక కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎలా మొదలైంది.

-చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో అని ఆలోచిసున్న సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరంజీవిగారే నాతో చెప్పారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిన్నతనంలో వినడం తప్ప ఆయన చరిత్ర నాకు అవగాహన లేదు. గొప్ప వీరుడి కథను తెరపై ఆవిష్కరించాలంటే మానసికంగా నేను సన్నద్ధమవ్వాలనే ఆలోచనతో ఉయ్యాలవాడ జీవితంలోని నిజానిజాలేమిటో తెలుసుకోవడం ప్రారంభించాను. గెజిట్స్, పుస్తకాలు చదవడంతో పాటు ఆయనపై వచ్చిన పాటలు, బుర్రకథలు విన్నాను. అందులోని కొన్ని అంశాలు నాలో ఆసక్తిని పంచాయి. అవి చూడగానే చిరంజీవి దగ్గరకు వెళ్లి సినిమా నేను చేస్తానని చెప్పాను. ఉయ్యాలవాడ గురించి గెజిట్‌లో రాసిన పాయింట్‌ను ఆధారంగా చేసుకుంటూ నెలరోజుల్లోనే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంచేసుకున్నాను. చిరంజీవి కథ వినగానే ఆనందంతో నన్ను హత్తుకున్నారు.

సైరా కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలేవి?

-బ్రిటీష్ వారి గెజిట్స్‌లో నరసింహారెడ్డిని బందిపోటు దొంగగా వర్ణించారు. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన వారందరిపై అలాగే ముద్రలు వేశారు. అదే గెజిట్స్‌లో తొమ్మిదివేల మంది సైన్యంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్‌వారిపై యుద్ధం చేశాడని రాశారు. నిజంగా నరసింహారెడ్డి బందిపోటు అయితే ప్రజలు ఆయన్ని ఎందుకు అంతగా నమ్మారనే ఆలోచన మొదలైంది. బ్రిటీష్‌వారు నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీశారు. ఆయన తలను కోటగుమ్మానికి 30 ఏళ్ల పాటు వేలాడతీశారు. చావుకు సిద్ధపడి ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించాం.

పరుచూరి బ్రదర్స్ కథతోనే సినిమా చేశారా?మీరు సొంతంగా కథ రాసుకున్నారా?

-పరుచూరి బ్రదర్స్ ముందుగా ఓ కథ సిద్ధం చేసి నాకు వినిపించారు. వారి దృక్కోణానికి తగినట్లుగా ఆ కథ ఉంది. అయితే నేటి తరానికి ఈ సినిమాను ఎలా చూపిస్తే బాగుంటుందోననే నా ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కథ రాసుకున్నాను. నా శైలికి అనుగునంగా సినిమా చేశాను.

భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీభాయి లాంటి స్వాతంత్య్ర పోరాట యోధులతో పోలిస్తే ఉయ్యాలవాడ జీవితంలో వైవిధ్యత ఏమిటి?

-ఝాన్సీలక్ష్మిభాయి, తమిళనాడుకు చెందిన కట్టవీరబ్రహ్మణ, కేరళకు చెందిన చంగోలు రాయలు. తొలితరం స్వాతంత్య్రసమరయోధులు చాలా వరకు తమ రాజ్యాలు, ప్రజల కోసం పోరాడారు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాత్రం ఒంటరిగా పోరాటం సాగించాడు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి విప్లవానికి కారకుడయ్యారు.

ఈ యథార్థ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్ర రూపకల్పనలో సినిమాటిక్ లిబర్టీని ఎక్కడైనా తీసుకున్నారా?


-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన తొమ్మిదివేల మంది సైన్యంతో ఆంగ్లేయులపై యుద్ధం చేశారని చరిత్రలో ఉన్నది. ఆ యుద్ధ సన్నివేశాల్ని ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించడం సాధ్యం కాదు. మా ఊహలకు అనుగుణంగా వీరోచితంగా తెరపై చూపించాం. సినిమాలో చారిత్రక సంఘటనలకు కొంత నాటకీయతను మేళవించాం. చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలని అనుకున్నాం. అంతేకానీ పాటలు, కమర్షియల్ హంగుల కోసం ఆలోచించలేదు.

సినిమా రూపకల్పనలో దర్శకుడిగా మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

-ఓ సినిమాను గ్రాండియర్‌తో పాటు రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో చిన్న గీత హద్దుగా ఉంటుంది. ఆ పరిమితులకు లోబడి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా చేయడం దర్శకుడిగా చాలా కష్టమైంది. సినిమాలో అదే నాకు ఎక్కువ టఫ్‌గా అనిపించింది.

మీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. ఆ ఒత్తిడిని ఎదుర్కొంటూ సినిమా చేయడం సవాల్‌గా అనిపించిందా?

-బడ్జెట్ గురించి నేనెప్పుడూ టెన్షన్ పడలేదు. ఓ గొప్ప వీరుడి కథ ఇది. చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఎలా తెరపై ఆవిష్కరించాలనే నిరంతరం ఆలోచించేవాణ్ణి. బడ్జెట్ లెక్కలను నిర్మాత రామ్‌చరణ్ నా మైండ్‌లోకి ఏ రోజు రానివ్వలేదు. చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌తో పాటు ఇందులో నటించిన వారంతా గొప్ప నటులే. సినిమా విలువ తెలిసిన వారు. వారి వల్లే నేను ఈ టెన్షన్ లేకుండా సినిమా చేయగలిగాను.

దర్శకుడిగా ఈ సినిమా మీకు నేర్పించిన అనుభవపాఠాలేమిటి?

-ఇదివరకు నేను చేసిన ఎనిమిది సినిమాలతో పోల్చితే ఈ చిత్రంతో ఎంతో నేర్చుకోగలిగాను. ఈ సినిమా కోసం చరిత్రను పరిశోధించడం వల్ల కొత్త విషయాల్ని తెలుసుకోగలిగాను. స్క్రిప్ట్, డైలాగ్స్, డిజైన్స్ ఇలా ప్రతి విషయంలో టీమ్‌గా ఎలా పనిచేయాలో తెలుసుకున్నాం.

సినిమాపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు? ఎందుకలా జరిగింది?

-ఉయ్యాలవాడ చరిత్రను గొప్పగా చూపించిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని కించపరచలేదు. ఉయ్యాలవాడ వారసులు మంచివారే. కానీ వారిని ఇతరులు పక్కదారి పట్టిస్తున్నారు. ఉయ్యాలవాడ వారసులకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం జరుగుతుంది.

ఈ చిత్రం బయోపిక్ కాదని కోర్టులో మీరు చెప్పినట్లు వార్తలు వచ్చాయి?

-సైరా బయోపిక్ అని మేము ఎక్కడ చెప్పలేదు. కొన్ని చారిత్రక సంఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందించాం.

-స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి నా చిన్నతనంలో చాలా చదువుకున్నాను. కానీ నేటితరానికి వారి గొప్పతనం తెలియడం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్, చంద్రబోస్, వీరసావర్కర్‌తో పాటు మరికొంత మంది చేసిన త్యాగాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ దక్షిణాది ప్రాంతం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులు ఎంతో మంది ఉన్నారు. వారి ఔన్నత్యం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

723

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles