లాజిక్ ఎక్కడ బ్రేక్ చేయాలో తెలియాలి!


Sat,December 15, 2018 12:15 AM

Director Sankalp Reddy Interview about Antariksham movie

అంతరిక్షం కాన్సెప్ట్‌ను ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది?

ఘాజీ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించాను. అంతరిక్షం కాన్సెప్ట్‌ను తెరకెక్కించాలని ముందుగా ఏమీ అనుకోలేదు. పత్రికలో చదివిన ఓ యథార్థ సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా తీయాలనుకున్నాను. అయితే పేపర్లో నేను చదివిన ఆర్టికల్ ఏమిటో మాత్రం చెప్పను. అది బయటపెడితే సినిమా కథ మొత్తం తెలిసిపోతుంది.


స్పేస్ నేపథ్యంలో హాలీవుడ్‌లో తెరకెక్కిన గ్రావిటీ మార్షియన్ కథలతో ఏమైనా సంబంధం ఉంటుందా?

అలాంటిదేమి లేదు. ఏ హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి కాదిది. తమిళ చిత్రం టిక్ టిక్ టిక్ కథతో కూడా పోలిక ఉండదు. ఘాజీ అంతరిక్షం రెండు కథల్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తయారుచేసుకున్నాను.

ప్రధాన స్రవంతికి భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్నారు. అందుకు ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?

ప్రస్తుతం నాకు అలాంటి ఐడియాలే వస్తున్నాయి. వాటినే తీద్దామనుకుంటున్నాను. ఒకవేళ భవిష్యత్తులో సోషల్‌మూవీస్ కాన్సెప్ట్స్ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను.

సాంకేతికంగా సంక్లిష్టమైన చిత్రాన్ని తక్కువ వ్యవధిలోనే పూర్తిచేశారు. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ఈ సినిమాకు ఎనిమిది నెలల సమయం పట్టింది. ఇందులో 1500 కంప్యూటర్ గ్రాఫిక్ సన్నివేశాలున్నాయి. చిత్రీకరణ మొత్తానికి 70రోజుల సమయం పట్టింది. ముఫ్పైరోజుల షూటింగ్‌ను జీరో గ్రావిటీ వాతావరణంలో తెరకెక్కించాం. అధికభాగం ఇన్‌డోర్ సెట్స్‌లోనే షూటింగ్ జరిపాం.

సినిమాకు సంబంధించిన సాంకేతికాంశాల విషయంలో ఎవరి సలహాలైనా తీసుకున్నారా?

ఈ తరహా కాన్సెప్ట్స్‌కు సంబంధించిన సమాచారం దాదాపుగా అంతర్జాలంలో దొరుకుతుంది. నాసా, ఇస్రో వైబ్‌సెట్స్ నుంచి కూడా సమాచారాన్ని తీసుకోవచ్చు. యూట్యూబ్‌లో స్పేస్ రిలేటెడ్ లైవ్ వీడియోలు ఉంటాయి. వాటిని రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రజ్ఞుల్ని బెంగళూరులో కలిసి కొంత సమాచారాన్ని సేకరించాను. ఈ సినిమాలోని సంఘటనలు వందశాతం హేతుబద్దంగా ఉండవు. అలా చేస్తే డాక్యుమెంటరీ అయిపోతుంది. అందుకే సినిమా కథాంశం, సన్నివేశాల రూపకల్పనలో సృజనాత్మకంగా కొంత స్వేచ్ఛను తీసుకున్నాం. ఘాజీ చిత్రం కూడా పూర్తి లాజిక్‌తో వుండదు. ఆ సినిమాలో చూపించినట్లుగా సబ్‌మెరైన్‌కు అప్ అండ్ డౌన్ మోషన్ ఉండదు. కానీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొన్ని సన్నివేశాల్ని అలా చూపించాం. ఏదో గుడ్డిగా కథను చెప్పకుండా ఎక్కడ లాజిక్‌ను బ్రేక్ చేయాలో తెలిసుండాలి. అది కథను జస్టిఫై చేసే విధంగా ఉండాలి.

సైంటిఫిక్ సినిమా కాబట్టి ప్రేక్షకులు లాజిక్‌తోనే ఆలోచిస్తారు కదా..?

సాధారణంగా ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతే టెక్నిక్, లాజిక్ గురించి పెద్దగా ఆలోచించరు. ఎప్పుడైతే కథ బోర్‌గా అనిపిస్తుందో అప్పుడు లాజిక్ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. కాబట్టి కథ బాగుంటే మిగతా విషయాల గురించి ప్రేక్షకులు అంతగా పట్టించుకోరు.

ఈ సినిమా రూపకల్పన విషయంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లేమిటి?

షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కంటే ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాకు సంబంధించిన మినీయేచర్స్, యాక్షన్ ఫిగర్స్‌ను చిన్న స్పై కెమెరాతో షూట్ చేసుకున్నాను. ఆ ఆవుట్‌పుట్ చూసే నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకొచ్చారు. మామూలుగా నేను స్క్రిప్ట్ తీసుకెళ్లి చూపిస్తే ఈ సినిమా చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. ఘాజీ విషయంలో కూడా నేను టెస్ట్ షూట్ చేసి నిర్మాతల్ని ఒప్పించాను.

తక్కువ వ్యవధిలో మీరు అనుకున్న అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టగలిగారు?

షూటింగ్‌కు తక్కువ సమయం తీసుకుంది కానీ..బడ్జెట్ బాగానే అయింది. ఇలాంటి సైంటిఫిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పుడు ఎక్కడో పరిమితి విధించుకోవాలి. అలాకాకుండా షూటింగ్ చేస్తూ పోతే ఎన్ని సంవత్సరాలైన తీయొచ్చు. అదొక అంతులేని ప్రయాణంలా అయిపోతుంది. మరో రెండేళ్లు టైమ్ తీసుకుంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వచ్చేదేమో. కానీ అలా తీయలేం. ఎందుకంటే బడ్జెట్ పరిమితులు, బిజినెస్ లెక్కలు వేసుకొని అందుకు అనుగుణంగా షూటింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో ఇదే తరహాలో సినిమాలు తీయాలను కుంటున్నారా?

అవును. చిన్న సినిమాలు మాత్రం అస్సలు చేయను. ఎందుకంటే చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా అవే ఎఫర్ట్స్ పెట్టాలి. అలాంటప్పుడు పెద్ద సినిమా గురించి ఆలోచించడమే మంచిది.

బాలీవుడ్‌లో ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా?

హిందీ నుంచి రెండు ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమాలు చేయాలనుకుంటున్నాను.

బాలీవుడ్‌కు వెళ్లినా తెలుగు సినిమాలు కూడా చేస్తాను.

ప్రతి సినిమాకు ఒక్కో రకమైన సవాళ్లు ఉంటాయి. ఈ తరహా కథలతో నిర్మాతల్ని ఒప్పించడమే పెద్ద సవాలు. ఆ తర్వాత వారు ఆశించిన అవుట్‌పుట్‌ను అందించడం మరో ఛాలెంజ్. ప్రతి సినిమాకు నేను స్టోరీబోర్డ్ వేసుకొని నిర్మాతలను సంప్రదిస్తాను. అందుకే నేను వేరే గ్రహానికి సంబంధించిన కథ చెప్పినా నిర్మాతలు ఒప్పుకుంటారు (నవ్వుతూ).


అంతరిక్షం కాన్సెప్ట్ అనుకున్నప్పుడే వరుణ్‌తేజ్ అయితే బాగుంటుందనిపించింది. తొలుత వరుణ్‌తేజ్‌ను కలిసినప్పుడు ఓ ఫొటో చూపించి కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఆయన వెంటనే అంగీకరించారు. ఆ ఫొటో ఏమిటో కూడా చెప్పను. ఎందుకంటే అందులోనే కాన్సెప్ట్ ఉంది. ఈ సినిమాలో కేవలం గ్రాఫిక్స్ హంగులు, సాంకేతిక సొబగులే కాదు.. దేశభక్తి, ప్రేమ, సెంటిమెంట్ అన్ని అంశాలుంటాయి.

హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా వుంటుందంటున్నారు?

హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయడం కుదరదు. బడ్జెట్, షూటింగ్ రోజుల విషయంలో ఇక్కడ పరిమితులుంటాయి. సాంకేతికపరమైన హద్దులు కూడా వుంటాయి. అయితే ఈ సినిమా మాత్రం గ్రావిటీ ఇంటర్‌స్టెల్లార్ సినిమాల్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది.

ఈ సినిమాను త్రీడీలో చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా?

త్రీడీలో చేద్దామనే ఆలోచన ఉంది. అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

బాలీవుడ్ సినిమా ఎప్పుడు స్టార్ చేయబోతున్నారు?

బాలీవుడ్‌లో కథ చెప్పాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సమకూర్చుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ సినిమా బాగా ఆలస్యమౌతుందనిపిస్తే ఈ నిర్మాతలతోనే తెలుగులో సినిమా చేస్తాను. దానికి అంతరిక్షం-2 అనే టైటిల్ అనుకుంటున్నాను.

2168

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles