ప్రజాస్వామ్యం అంగడి సరుకు కావొద్దు!


Tue,June 4, 2019 12:12 AM

Director Puri Jagannadh Imitated R Narayana Murthy Market Lo Prajaswamyam Movie

తొలినాళ్ల నుంచి తాను నమ్మిన పంథాలో చక్కటి సందేశాత్మక కథాంశాలతో నారాయణమూర్తి సినిమాలు తీస్తున్నారు. డబ్బు కోసం ఆలోచించి ఆయన ఎప్పుడూ సినిమాలు చేయలేదు. సామాజిక ఇతివృత్తంతో నారాయణమూర్తి రూపొందించిన ఈ సినిమా ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నానుఅన్నారు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్. ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం. ఈ సినిమాను ఆదివారం హైదరాబాద్‌లో పలువురు దర్శకులు, ప్రజా ఉద్యమకారులు ప్రత్యేకంగా వీక్షించారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ నా చిన్నతనం నుంచి నారాయణమూర్తి సినిమాలు చూస్తున్నాను. ఇప్పటికి అదే పంథాలో సినిమాలు తీస్తున్నారాయన. ఈ సినిమాలో ఇసుక మాఫియా అక్రమాల్ని కూలంకుషంగా చూపించారు అని అన్నారు. శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కమిట్‌మెంట్‌తో రాజీపడకుండా సినిమాలు తీస్తున్నారు నారాయణమూర్తి.

సూటిగా, ధైర్యంగా తాను చెప్పాలనుకున్న విషయాల్ని ఈ సినిమాలో చూపించారు అని అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. దేశంలో డబ్బున్న పదిశాతం వారే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. మిగిలిన 90 శాతం బడుగు బలహీన వర్గాలకు ప్రజాసేవ చేయాలని, గొప్ప నాయకులు అనిపించుకోవాలని ఉన్నా అవకాశాలు దక్కడం లేదు. పదిశాతం పాలిస్తూ 90శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకు చేయకుండా దానిని కాపాడుకోవాలని చాటిచెప్పే చిత్రమిది. ప్రస్తుతం సెన్సార్ జరుపుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దర్, ధవళ సత్యం, ఎల్బీశ్రీరాం, గటిక విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

1288

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles