ఎలాగైనా ఆ సినిమా చేస్తాను!


Tue,June 21, 2016 11:38 PM

Director Mohana Krishna Indraganti Interview

తెలుగు చిత్రసీమలో వున్న సృజనాత్మక దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ప్రధాన స్రవంతి చిత్రాలకు భిన్నంగా నవ్యమైన కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు తీస్తూ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు.
mohanaKrishna
గ్రహణం, అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తరువాత చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటించిన జెంటిల్‌మెన్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇంద్రగంటి మోహనకృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.

'జెంటిల్‌మెన్ 'నా కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. విదేశాల్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అష్టాచమ్మాతో నా కెరీర్‌లో తొలి విజయాన్నందుకున్నాను. మరోసారి నానితో చేసిన జెంటిల్‌మెన్ పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా వుంది. నా లక్కీ హీరో నాని అని భావిస్తున్నాను.


అలా మొదలైంది...


జెంటిల్‌మెన్ చిత్రానికి తమిళ రచయిత ఆర్.డేవిడ్‌నాథన్ కథనందించారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ మన సంస్కృతికి దూరంగా వున్నట్లనిపించింది. దాంతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశాం. నానికి కథ చెప్పగానే సినిమా చేద్దామన్నారు. అయితే ఆయనకున్న ముందస్తు కమిట్‌మెంట్స్ వల్ల ఓ ఆరునెలల పాటు వెయిట్ చేయమని చెప్పారు. లేకపోతే మరో హీరోతో సినిమా చేసుకోమని సూచించారు. స్క్రీన్‌ప్లే ప్రధానమైన కథ కాబట్టి స్క్రిప్ట్‌వర్క్‌కే ఆరునెలల సమయం పట్టింది. ఆ లోపు నాని అందుబాటులోకి వచ్చారు. అలా జెంటిల్‌మెన్ సినిమా పట్టాలెక్కింది.

చివరి పది నిమిషాల్లోనే...


ైఈ సినిమాకు చివరి పదినిమిషాలు ఆయువుపట్టులా నిలిచాయి. క్లెమాక్స్ ఘట్టాల్లోని చివరి పదినిమిషాల్లోనే ప్రేక్షకులకు తెలియని విషయాల్ని చెప్పాలనుకున్నాం. అదే సమయంలో కథాగమనంలోని ఊహించని మలుపుల్ని బయటపెట్టాలని భావించాం.

తెలుగు టైటిల్స్ కుదరలేదు


ఓ అమ్మాయి దృష్టిలో విలన్‌గా ముద్రపడ్డ యువకుడు నిజంగా విలన్ కాదు. అతనొక జెంటిల్‌మెన్ అన్నదే ఈ సినిమా కథలోని ప్రధానాంశం. తొలుత ఈ సినిమాకు తెలుగు టైటిల్ పెట్టానుకున్నాను. జెంటిల్‌మెన్ స్థానంలో ఉత్తముడు మంచివాడు వంటి టైటిల్స్‌ని పరిశీలించాం. అవి కొంచెం బరువైన టైటిల్స్ అనిపించాయి. దాంతో చివరకు జెంటిల్‌మెన్ టైటిల్‌ను ఖరారు చేశాం. కథానుగుణంగా ఈ టైటిల్ బాగా కుదిరిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

నా మార్క్ వదులుకొను...


అష్టాచమ్మా మంచి విజయం సాధించడం వల్ల సునిశితమైన హాస్యం మేళవించిన సినిమాల్ని బాగా తీస్తాననే ఇమేజ్ వచ్చింది. ఇప్పటివరకు నేను ఒకదానికొకటి పూర్తి భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకొని సినిమాలు చేశాను. ఏ జోనర్‌ను రిపీట్ చేయలేదు. గోల్కొండ హైస్కూల్ గ్రహణం బందిపోటు....వంటి సినిమాల్ని వినూత్నమైన కథలతో తెరకెక్కించాను. అయితే ఎలాంటి సినిమాలు తీసినా వాటిలో నా తాలూకు ప్రత్యేకమైన ముద్ర వుండేలా చూసుకుంటాను. నా సినిమాలు సంసారపక్షంగా, సెన్సార్ పక్షంగా వుంటాయని నాపై నేనే సెటైర్ వేసుకుంటాను.

అదే నా డ్రీమ్...


అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించేలా ఓ సినిమా చేయాలన్నది నా డ్రీమ్. కొడవటిగంటి కుటుంబరావు రచనల్ని నేను బాగా ఇష్టపడతాను. ఆయన రాసిన రెండు కథల హక్కుల్ని తీసుకున్నాను. వాటిలో ఓ కథ వ్యంగ్యం, సామాజిక సందేశం ప్రధానంగా సాగుతుంది. యాభైఏళ్ల క్రితమే కొడవటిగంటిగారు ప్రగతిశీల భావాలతో ఆ రచన చేశారు. ప్రస్తుత సమాజ పరిస్థితులకు ఆ రచన చక్కగా సరిపోతుంది. ఆ కాన్సెప్ట్‌తో ఎలాగైనా సినిమా తీయాలనుకుంటున్నాను. బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది నవల హక్కుల్ని కూడా పొందాను. దీనిలోని కొన్ని భాగాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఓ సినిమా చేయాలనుకుంటున్నాను.

అలాంటి కథల్ని రాయలేను..


నా కెరీర్‌లో ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. పెద్ద హీరోలతో సినిమా చేయాలంటే వారి ఇమేజ్, అభిమానుల్ని సంతృప్తిపరిచేలా కథల్ని తయారుచేసుకోవాలి. ఆ ప్రతిభ నాలో లేదేమో అనుకుంటున్నాను (నవ్వుతూ). నా అభిరుచులతో పాటు అగ్రహీరోల ఇమేజ్‌కు సరిపోయే కథాంశం దొరికినప్పుడు వారితో సినిమా చేస్తాను.

2940

More News

VIRAL NEWS