రాళ్లు రప్పలు కాదు..అంతా స్వర్ణమయం!

Sat,January 12, 2019 11:39 PM

ఎన్టీఆర్ బయోపిక్ అలనాటి రోజుల్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో మాట్లాడుకున్న మాటల్నే పెట్టాం. ఆ మాటల వెనకున్న అర్థం హైదరాబాద్‌లో వున్నది రాళ్లు రప్పలు కాదు హైదరాబాద్ అంతా స్వర్ణమయమని చెప్పడం. ఆ డైలాగ్ చూసిన చాలా మంది అక్కడే ఆగిపోయి ఆలోచనలు చేస్తున్నారు. ఆ తరువాత సినిమాలో ఉన్న సంభాషణలు చూడటం లేదు అన్నారు క్రిష్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఎన్‌టీఆర్ కథానాయకుడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో నిర్మాత నాగిరెడ్డి పాత్ర ధారి ప్రకాష్ రాజ్ చెప్పినహైదరాబాద్‌లో ఏముంది? బ్రదర్ రాళ్లు రప్పలే కదా అనే డైలాగ్‌పై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా నమస్తే తెలంగాణతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

సినిమాపై ప్రశంసలు ఏ స్థాయిలో వున్నాయో విమర్శలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. దీనిపై మీరు మంటారు?

ఒక భాగమే విడుదలైంది. అప్పుడే అలా మాట్లాడితే ఎలా. రెండవ పార్టు కూడా చూడాలి కదా?. చాలా మంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు కానీ అవేవీ నా దాకా రాలేదు. విమర్శలు చేయడం చాలా సులువు.

ఎన్‌టీఆర్ కథానాయకుడు మీ అంచనాలకు అనుగునంగానే ఆకట్టుకుంటోందా? సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది?

-ప్రేక్షకుల స్పందన అమోఘం. నలుమూలల నుంచి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా మాట్లాడినా, పొగిడినా అవి గుండెలోతుల్లోంచి వచ్చాయా? లేదా? అనేది తెలిసిపోతుంటుంది. కానీ ఈ సినిమా గురించి ఫోన్ చేసిన వారంతా తమ గుండెలోతుల్లోంచి వచ్చిన మాటలతో, సంతృప్తి చెందిన హృదయంతో మాట్లాడుతుండటం ఓ దర్శకుడిగా అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యేలా చేస్తోంది.

ఇలాంటి బయోపిక్‌కు దర్శకత్వం వహించడం అనేది ప్రతి దర్శకుడికీ ఓ ఛాలెంజ్. దర్శకుడు తేజ మధ్యలో తప్పుకున్న చిత్రాన్ని భుజాలమీదకి ఎత్తుకోవడం రిస్క్ చేస్తున్నానను అనే భావన మీలో కలగలేదా?

-తొలి అడుగు నుంచే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. దీనికి తోడు చాలా మంది నేతల బయోగ్రఫీల గురించి నేను చాలా కాలంగా చదువుతున్నాను. ఐ వెంకట్రావుగారు రాసిన రామారావుగారి కథ కూడా చాలా కాలం క్రితమే చదివాను. దాంతో రామారావుగారి జీవితంపై నాకు అవగాహన ఏర్పడి బయోపిక్‌పై పూర్తి స్పష్టత వచ్చింది.

బాలీవుడ్ చిత్రం మణికర్ణిక ను మధ్యలోనే వదిలేసి ఎన్టీఆర్ కోసం వచ్చారని తెలిసింది?

-మణికర్ణిక కోసం 108 రోజులు షూటింగ్ చేశాను. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి వుంది. దాన్ని పక్కన పెట్టి నేను ఈ సినిమా కోసం వచ్చాక నాలుగు రోజుల షూట్ కాస్తా పెద్దదిగా మారింది. అనేక నాటకీయ పరిణామాల తరువాత సోనూసూద్ సినిమా నుంచి తప్పుకోవడంతో మణికర్ణిక చిత్రీకరణ పార్టు పెరిగిపోయింది.ఆగస్టు 15న విడుదల కావాల్సింది.చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల వాయిదాపడింది. ఇక ఎన్టీఆర్ చిత్రాన్నిఅంగీకరించిన తరువాత మణికర్ణికను పూర్తిగా వదిలేయడం జరిగింది.

ఎన్టీఆర్ కథ దాదాపుగా అందిరికి తెలిసిందే. దీన్ని భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో చెప్పాలన్న ఆలోచన ఎవరిది?

-ప్రతిదానికి ఓ చిక్కుముడి వుంటుంది. అది విడిపోతేనే కథనం సాఫీగా సాగుతుంది. రామారావుగారి కథ ఏంటనేది అందరికి తెలిసింది. అయితే ఆయన జీవితంలోని ఏ అంశాల్ని తీసుకుని సినిమా చేయాలనే ఆ నేపథ్యంలో కథ చెప్పాలనుకున్నాను. ఈ సినిమాతో రామారావుగారి అంతరంగాన్ని ఆవిష్కరించాలనుకున్నాను. రామారావుగారు ఆయన ఏమిటన్నది ఒక్క బసవతారకంగారికే తెలుసు. ప్రతీ అడుగులోనూ అడుగై నడిచారామె. అందుకే ఆమె పంథాలో సినిమా నడిపించాలనుకున్నాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను.

ఈ చిత్ర కథలో కుబుసం దర్శకుడు శ్రీనాథ్‌గారి సహకారం వుంది. ఆయన ఇన్‌పుట్స్‌ని ఎంత వరకు తీసుకున్నారు?

-రామారావుగారి జీవితంపై రీసెర్చ్ చేసిన శ్రీనాథ్‌గారు టూకీగా కథ చెప్పారు. అయితే దాన్ని తీసుకుని పూర్తిగా నేను రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించాను.

సినిమాలో ప్రకాష్‌రాజ్ పాత్రతో హైదరాబాద్‌లో ఏముంది రాళ్లు రప్పలు తప్ప అనే డైలాగ్ చెప్పించారు ఎందుకని?

-ఎన్టీఆర్ సినిమా అలనాటి రోజుల్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో మాట్లాడుకున్న మాటల్నే పెట్టాం. ఆ మాటల వెనకున్న అర్థం ఏంటంటే హైదరాబాద్‌లో వున్నది రాళ్లు రప్పలు కాదు హైదరాబాద్ అంతా స్వర్ణమయమని చెప్పడం. ఆ డైలాగ్ చూసిన చాలా మంది అక్కడే ఆగిపోయి ఆలోచనలు చేస్తున్నారు. ఆ తరువాత వున్న మాటలు చూడటం లేదు.

బయోపిక్‌లో రామారావుగారి పాత్రను ఓ మహానటుడిగా చూపిస్తూనే ఆయన్ని దైవాంశ సంభూతుడిగా కీర్తించినట్లుగా కనిపిస్తోంది?

-ఈ సినిమా చూసి కాల్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దర్శకుడు పూరిజగన్నాథ్. రామారావుగారి మీద అభిమానంతో ఆయన ఓ సందర్భంలో గుండు కూడా కొట్టించుకున్నానని, రామారావుగారి ఇంటికి వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు ఈ విషయం వేల మందికి తెలుసు. కాబట్టి ఆయన్ని అలా చూపించడంలో ఎలాంటి తప్పులేదు. దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు అన్నది వాళ్ల వాళ్ల మనస్థత్వాన్ని బట్టి వుంటుంది. సినిమాలో నేను చూపించిన ప్రతి అంశం నిజజీవితంలో జరిగినవే.

బయోపిక్ అంటే ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా చూపిస్తుంటారు. కానీ ఇందులో కేవలం ప్లస్‌ల గురించే ఎక్కవగా ప్రస్తావించినట్లున్నారు?

-నేను చూసిన కథని చెప్పాలి కానీ ఎవరో ఒకరు ఊహించిన కథని, అనుకున్న కథని చూపించలేం కదా!. ఒక వ్యక్తిని కించపరచడం కోసం సినిమా తీయమంటే అది తప్పవుతుంది.

సినిమాలో బాలకృష్ణగారు వున్నా మీ మ్యాజిక్ డామినేట్ చేసిందని అంటున్నారు?

-బాలకృష్ణగారు అద్భుతమైన నటనతో మహాద్భుతాన్ని సృష్టించారు. ఆయన చేసిన పాత్రలు ఎక్కడా తగ్గకుండా పరిపూర్ణత తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేశాను. ఈ సినిమా వంద శాతం ఫలితాన్ని సాధిస్తే అందులో సగ భాగం క్రెడిట్ నాది. సగం బాలకృష్ణది.

రెండవ భాగం ఎలా వుండబోతుంది?

-ఇప్పుడు చెబితే థ్రిల్ వుండదు పైగా చూసే విధానం మారిపోతుంది. రెండవ భాగంలో ఎన్టీఆర్ బాల్యంతో పాటు చాలా విషయాలు చూపించబోతున్నాం.

ఈ సినిమా మీరు తీసి వుండకపోతే ఈ స్థాయిలో వచ్చేది కాదంటున్నారు.

ఆ మాటలు విన్నప్పుడు నా జన్మధన్యమైంది అనే అనుభూతి కలుగుతోంది. రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి ఈ సినిమాతో నీ జన్మ ధన్యమైంది క్రిష్ అన్నారు. ఆయనలాగే కొన్ని వేల మంది ఫోన్, వాట్సప్ ద్వారా చెప్పారు. ఈ సినిమాకు వచ్చిన పేరు ఇంత వరకు నేను తీసిన ఏ సినిమాకు రాలేదు. ఆ నమ్మకంతో వున్నాను.

- దర్శకుడు క్రిష్

3820

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles