ఒక్కరు మారినా మా ప్రయత్నం ఫలించినట్లే!


Thu,January 11, 2018 11:02 AM

Director B Jaya Birthday Celebrations and Press Meet

jaya
జయ మార్క్ అనిపించేలా.. నా కంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చే సినిమాలు మరిన్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మైమరపింపజేయాలనేది నా లక్ష్యం. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలనుకుంటున్నాను అన్నారు బి. జయ. ఆమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

మా ఆర్.జె. సినిమాస్ సంస్థలో జూన్ నుంచి లక్కీఫెలో పేరుతో కొత్త చిత్రాన్ని మొదలుపెడుతున్నాం. తక్కువ వ్యవధిలోనే చిత్రాన్ని పూర్తి చేస్తాం. ప్రస్తుతం ప్రీపొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నాం. ఓ యువ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. అతను ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. అనుకోకుండా ఓ యువకుడికి అదృష్టం వరిస్తుంది. అలాంటి వ్యక్తిని అంతా లక్కీఫెలో అంటారు. ఆ అవకాశాన్ని హీరో సద్వినియోగం చేసుకున్నాడా? లేక మిస్‌యూజ్ చేసుకున్నాడా? అనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మానవ సంబంధాలు, భావోద్వేగాల్ని మిళితం చేసి ఈ సినిమా రూపొందించనున్నాం. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. ఈ రోజుల్లో ఆడవాళ్లకు నిత్యం ఏవో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి వారిని జీవితాంతం మానసికంగా వెంటాడుతున్నాయి. అలాంటి సమస్యల్ని పరిష్కరించే పాత్ర హీరోయిన్‌ది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు వినోదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. మా సినిమా చూసి ఒక్కరిలో మార్పు వచ్చినా మా ప్రయత్నం ఫలించినట్లే.

లవ్‌లీ చిత్రాన్ని మించి...

వైశాఖం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందని ఆశించామో అదే స్థాయి విజయాన్ని అందించింది. మేము పెట్టిన బడ్జెట్‌కు తగిన వసూళ్లు రాబట్టింది. ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. లవ్‌లీ దర్శకురాలిగా కమర్షియల్ విజయంతో పాటు ప్రశంసల్ని అందించింది. అయితే లక్కీఫెలో మాత్రం లవ్‌లీని మించి పెద్ద విజయాన్ని అందిస్తుందనే నమ్మకముంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. టైటిల్ బాగుందని అందరు అభినందిస్తున్నారు. వేగంగా మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మైమరపింపజేయాలని వుంది. నా కంటూ ఓ మార్కుని ఏర్పరచుకొని ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాను.

మహిళా దర్శకులు రావాలి...

నన్ను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది మహిళలు సినీ రంగంలోకి వచ్చారు. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. చిత్రపరిశ్రమకు మహిళా దర్శకులు మరింత మంది రావాలి. అలా రావాలనుకునే వారికి స్వాగతం చెబుతున్నాను. వెబ్ సిరీస్‌లు చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాకు వున్నంత క్రేజ్ వెబ్ సిరీస్‌కు లేదు. ఇన్నేళ్లయినా మహిళా దర్శకులతో సినిమాలు నిర్మించడానికి చిత్రపరిశ్రమ ఇంకా సిద్ధంగా లేదు. అవకాశం ఇస్తే చేయగలరా? లేదా అనే అనుమానం ఇంకా అలాగే కొనసాగుతున్నది. ఆ విషయంలో మార్పురావాలి.

1924

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles