పెళ్లి తర్వాతఎఫ్-2 కథ రాసుకున్నా!

Mon,January 14, 2019 01:45 AM

జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాల్ని పంచుతాయి. దర్శకుడిగా అలాంటి సినిమాలు చేయాలనే కోరిక నాలో బలంగా ఉండేది. ఆ కల ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉంది అని అన్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్-2. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ నాయకానాయికలుగా నటించారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అనిల్ రావిపూడి పాత్రికేయులతో సంభాషించారు.

దర్శకుడిగా ఇదివరకు వాణిజ్య హంగులతో కూడిన యాక్షన్ సినిమాలు చేశాను. వాటికి భిన్నంగా పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో ఓ సినిమా చేస్తే బాగుండునని అనిపించింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భరీ ్తచేస్తూ భార్యాభర్తల అనుబంధానికి కామెడీని జోడించి ఈ సినిమా చేశాను. మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. వెంకటేష్ పాత్ర, ఆయన మేనరిజమ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. అలాగే బోరబండ కుర్రాడిగా వరుణ్‌తేజ్ సహజమైన అభినయాన్ని కనబరిచాడు. బాలీవుడ్‌లో గోల్మాల్, హౌస్‌ఫుల్ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ను సృష్టించాయి. వాటి తరహాలో ఎఫ్-2 కు సీక్వెల్ చేయాలనుంది. ఈ సీక్వెల్‌లో నటించడానికి వెంకటేష్, వరుణ్‌తేజ్ సంసిద్ధతను వ్యక్తంచేశారు.

కాపీ కొట్టను..

ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేసేటప్పుడు ప్రతి కథలో వైవిధ్యత ఉండాలి. సన్నివేశాల్లో కొత్తదనం కనిపించాలి. సినిమా చేస్తున్నప్పుడు ఆ తరహా కథాంశాలతో గతంలో వచ్చిన చిత్రాలన్నీ చూస్తాను. వాటికి భిన్నంగా నా శైలి హంగులతో తెరకెక్కించడానికి ప్రాధాన్యతనిస్తాను. దర్శకుడిగా, రచయితగా జంధ్యాల ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ బోర్ కొట్టినప్పుడల్లా జంధ్యాల సినిమాలే చూస్తాను. ఆయన తర్వాత ఈవీవీ, కృష్ణారెడ్డి సినిమాలు నచ్చుతాయి. వారి శైలిని అనుసరిస్తాను కానీ కాపీ కొట్టను. పెళ్లయిన తర్వాత ఎఫ్-2 కథ రాసుకున్నాను. నా భార్య ఈ సినిమా చూసి ఏమనుకుంటుందోనని భయపడ్డాను. కానీ చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది.

హద్దులు దాటకుండా

నా గత సినిమాల్లో గ్లామర్ కనిపించలేదని కొందరు తిట్టారు. ఆ ఆలోచనతోనే ఇందులో హద్దులు దాటకుండా కథానాయికల్ని గ్లామరస్‌గా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. కామెడీ సినిమా కాకుండా భిన్నమైన కథాంశంతో తదుపరి సినిమా చేయాలనుంది.

3716

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles