ఇమేజ్‌ను పక్కనపెట్టినప్పుడే మంచి చిత్రాలొస్తాయి


Mon,July 17, 2017 10:56 PM

Dil Raju Interview about Fidaa movie

తెలుగు చిత్రసీమలో విలువలకు కట్టుబడి సినిమాలు చేసే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. స్టార్‌డమ్, హీరోయిజాలతో సంబంధం లేకుండా కథలను నమ్మి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారాయన. సంస్కృతి సంప్రదాయలు, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు ఆయన సినిమాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయి. ఆ ఆలోచనా విధానమే ఆయనకు విజయాల్ని తెచ్చిపెడుతున్నది. ఆయన నిర్మించిన తాజా చిత్రం ఫిదా. శేఖర్‌కమ్ముల దర్శకుడు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దిల్‌రాజు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి....
DIL-RAJU

శేఖర్‌కమ్ముల చెప్పిన కథకు మీరు ఎక్కడ ఫిదా అయ్యారు?


శేఖర్‌కమ్ములతో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయా ? లేదా? అనే సంశయం ఉండేది. ఆయన దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాను నేనే విడుదలచేశాను. అప్పుడు మా అభిరుచులు కుదిరాయి. ఖచ్చితంగా మా కాంబినేషన్‌లో సినిమా వస్తే వర్కవుట్ అవుతుందని అనిపించింది. శేఖర్‌కమ్ముల సొంత బ్యానర్‌లో తప్ప ఇతర సంస్థలతో సినిమాలు చేయకపోవడంతో మా కలయిక ఆలస్యమైంది. లీడర్ సినిమా తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేద్దామని, కథ ఉంటే చెప్పమని శేఖర్‌కమ్ములని అడిగాను. ఓ రోజు ఫిదా కథ చెప్పారు. తను చెప్పిన కథ వినగానే మంచి ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనిపించింది.

శేఖర్‌కమ్ముల గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఎలాంటి వైవిధ్యత కనిపిస్తుంది?


హ్యాపీడేస్ చిత్రాన్ని స్నేహం, ప్రేమ మధ్య సంఘర్షణ నేపథ్యంలో, లీడర్‌లో రాజకీయం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు శేఖర్. వాటితో పోలిస్తే భిన్నంగా ఉండే చిత్రమిది. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో ఆయన చేసిన సినిమా ఇది.

వరుణ్‌తేజ్‌ను కథానాయకుడిగా ఎంచుకోవడానికి కారణమేమిటి?


తొలుత స్టార్ హీరోతో సినిమా చేయాలని దర్శకుడు శేఖర్‌కమ్ముల భావించారు. ఆయన ఆసక్తిని చూసి నేనే ఓ స్టార్ హీరోను సంప్రదించాను. అతడికి కథ నచ్చింది. మంచి సినిమా అవుతుందని చెప్పారు. కానీ స్టార్ హీరో సినిమా అంటే అందులో వాణిజ్య హంగులు తప్పకుండా ఉండాలి. శేఖర్‌కమ్ముల శైలిలో సహజంగా సాగే సినిమా కావడంతో తాను చేయడం కరెక్ట్ కాదేమో అని ఆ హీరో సందేహించారు. దాంతో స్టార్ ఆలోచనను పక్కనపెట్టి వరుణ్‌తేజ్‌ను ఎంపికచేశాం.

కొత్త హీరోలతో కాకుండా తొలిసారి ఓ ఇమేజ్ ఉన్న హీరోతో శేఖర్‌కమ్ముల ఈ సినిమా చేశారు. దర్శకుడిగా ఈ సినిమా పరంగా ఆయనలో మీకు ఏమైనా మార్పులు గమనించారా?


తొలి ప్రేమ పవన్‌కల్యాణ్ కెరీర్‌లో నాలుగో సినిమా. అప్పటికీ ఆయనకు ఎలాంటి ఇమేజ్ లేదు. ఆర్యలో నటించే సమయంలో బన్నీ స్టార్ కాదు. వరుణ్‌తేజ్ ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నారు. ఆయన కెరీర్‌లో ఐదో చిత్రమిది. గత చిత్రాలు ఆయనకు సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. వరుణ్ నుంచి హీరోయిజం, తెరపై ఆయన పది మందిని కొట్టాలని ఆశించి ప్రేక్షకులు థియేటర్లకు రారు. వరుణ్ ఇమేజ్‌ను కాకుండా ఓ జంట మధ్య ఉండే అనుబంధాన్ని ఇందులో ఆవిష్కరించాం. తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అందమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరికి నవ్యమైన అనుభూతిని పంచుతుంది. స్టార్‌ఇమేజ్ పట్టింపులు లేకుండా కథను నమ్మి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు మహేష్‌బాబు. బృందావనంలో ఎన్టీఆర్, మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో ప్రభాస్ అదే పంథాను అనుసరించారు. ఇమేజ్‌ను పక్కనపెట్టినప్పుడే మంచి చిత్రాలొస్తాయి.

సాయిపల్లవిని కథానాయికగా తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?


కథ సిద్ధం చేసుకున్న తర్వాత హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న సమయంలో సాయిపల్లవి పేరును శేఖర్‌కమ్ముల సూచించారు. తను ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పారు. కానీ అప్పటికి సాయిపల్లవి మెడిసిన్ చదువుతున్నది. అది పూర్తయ్యేవరకు సినిమాలు చేయనని ఆమె చెప్పింది. దాంతో సాయిపల్లవి కోసం తొమ్మిది నెలలు వేచిచూశాం. పాత్ర కోసం తెలంగాణ మాండలికంపై పట్టు పెంచుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పింది. సినిమాల పట్ల ఉన్న తపనతో కష్టపడి దానిని సాధించింది. ఆమె పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

RAJU
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అమ్మాయికి, అమెరికాలో స్థిరపడ్డ అబ్బాయికి మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. కథానుగుణంగా హీరోయిన్‌ను తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా చూపించాం. హీరో ఏ ప్రాంతానికి చెందినవాడనే అంశాన్ని ప్రత్యేకంగా చూపించలేదు. ఓ పెళ్లిలో మొదలైన పరిచయం వారి జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది? వారు ఏ విధంగా ఏకమయ్యారు? ఇద్దరూ కలిసి తమ కలలను ఎలా సాకారం చేసుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. హృద్యమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

డీజే దువ్వాడ జగన్నాథం వసూళ్ల విషయంలో భిన్న అభిప్రాయాలు వచ్చాయి. నిర్మాతగా ఆ సినిమా ఫలితంపై మీరేమంటారు?


శతమానంభవతి, నేనులోకల్ తర్వాత నిర్మాతగా నాకు హ్యాట్రిక్ చిత్రమిదని డీజే విజయోత్సవ వేడుకలో చెప్పాను. విలువ లేని స్టేట్‌మెంట్స్‌ను నేను ఎప్పుడూ ఇవ్వను. సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయకపోతే మీడియా ముందుకురాను. వాటి గురించి మాట్లాడమని ఎవరైనా చెప్పినా వద్దంటాను. పరాజయాన్ని అంగీకరిస్తూ ముందుకుసాగాలి. అంతేకానీ మనల్ని మనం మోసం చేసుకోవడంలో ఉపయోగం లేదని నమ్ముతాను. ఓ సినిమా విషయంలో తప్పు చేశామా? లేదా? అనేది తొలి ఆటతోనే అర్థమవుతుంది. కొన్ని సినిమాలకు వసూళ్లు పెరగడానికి సమయం పడుతుంది. ఏది ఏమైనా సినిమా ఫలితం ఏంటనేది సోమ, మంగళవారం వసూళ్లు నిర్ణయిస్తాయి.

డీజే విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు?


డీజే విషయంలో ముందు నుంచి దుష్ప్రచారం జరుగుతున్నది. అది ఎందుకో తెలియదు. అల్లు అర్జున్ కెరీర్‌లో సరైనోడు చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది. ఆ సినిమా వసూళ్లను డీజే దాటింది. అలాంటప్పుడు సినిమా హిట్టే అని అర్థం. ఈ మధ్య డీజే వసూళ్లు ఇవే అంటూ కొందరు తప్పుడు లెక్కలు రిలీజ్ చేశారు. అవి తప్పు అని చెప్పి అసలైన వసూళ్లను తెప్పించుకొని విడుదలచేశాం. డీజే ద్వారా ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోలేదు. తప్పుడు వసూళ్లు, ఎక్కువ చేసి చూపించడం నా జీవితంలో అలవాటు లేదు. అలాంటివి భవిష్యత్తులోను చేయను. తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబుతో పాటు చాలా సినిమాల్ని విడుదలచేస్తున్నాను. ఒక్క హీరో విషయంలో తప్పు చేస్తే ఆ ప్రభావం అందరిపై పడుతుంది. అందుకే అలాంటి పనులు నేను చేయలేను. అలాగే డీజే సినిమాతో సరైనోడు, ఖైదీ నంబర్ 150లను పోల్చారు. అలాంటి పోలికలు సరికాదు. ఒక సినిమాను మరో సినిమాతో ఎప్పటికీ పోల్చను. ఓ హీరో గత సినిమాతో పోలిస్తే ప్రస్తుత చిత్రం వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తాను. అంతే తప్ప ఇతర హీరోల సినిమాలతో పోల్చిచూడను.

జీఎస్టీ ప్రభావం సినిమా వసూళ్లపై ఎంతవరకు పడుతుంది?


గతంతో పోలిస్తే నిర్మాతలపై జీఎస్టీ వల్ల పదిశాతం భారం పెరిగింది. షేర్స్‌పై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. జీఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాము.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ నిర్మాతగా దీనిపై మీ అభిప్రాయమేమిటి?


ఈ ఆదివారమే విదేశాల నుంచి ఇండియాకు వచ్చాను. డ్రగ్స్ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇక్కడ లేకపోవడంతో దాని గురించి నాకు ఏమీ తెలియదు. ప్రస్తుతం ఫిదా విడుదల గురించి తప్ప మరో ఆలోచన లేదు.

తదుపరి సినిమా విశేషాలేమిటి?


రామ్‌చరణ్‌తో ఓ సినిమా చర్చల దశలో ఉన్నది. దర్శకుడు, కథ సిద్ధమైన తర్వాతే దాని వివరాల్ని వెల్లడిస్తాను. మహేష్‌బాబు, వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయనున్నాను. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేయనున్న శ్రీనివాసకళ్యాణం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. రవితేజతో చేస్తున్న రాజా ది గ్రేట్ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ 12న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఎమ్‌సీఏ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

ఇటీవల మీ అర్థాంగి స్వర్గస్తురాలైంది. ఆ బాధ నుంచి ఎలా బయటపడగలిగారు?


ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాను. పూర్తిగా బయటపడటానికి ఇంకో రెండు నెలలైనా పడుతుంది. ఆ ఆలోచనల నుంచి దూరం అవ్వడానికే పనిపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నాను.

1006

More News

VIRAL NEWS