పరాజయానికి కారణం తెలుసుకోవాలి!


Fri,February 1, 2019 01:00 AM

Dil Raju Interview about F2 Movie Success

ఫన్..అండ్ మోర్ ఫన్‌తో.. ఎఫ్-2 థియేటర్లు నవ్వుల క్లబ్బులుగా మారిపోయాయి..అన్ని వర్గాల ప్రేక్షకులు రెండున్నర గంటలు ఎఫ్-2 లాఫింగ్ క్లబ్‌లో సేద తీరుతున్నారు. పూర్తి వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఎఫ్-2. వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సంక్రాంతి సరదా అల్లుళ్ళు.. అందర్ని నవ్విస్తూ...100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇప్పటికి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకు సాగిపోతున్న ఎఫ్-2 విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత దిల్‌రాజుతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.

దిల్ రాజు అంటే ఓ మార్కు వుంది. దానికి దూరంగా వెళుతున్నట్టున్నారు?

2017లో నా మార్కుతో రూపొందిన శతమానం భవతి, ఫిదా చిత్రాలు వచ్చాయి కదా!. ఇక గత ఏడాది శ్రీనివాస కల్యాణంతో మరో మంచి చిత్రాన్ని అందించాలని ప్రయత్నించాను. శతమానం భవతి తరహా మ్యాజిక్ జరుగుతుందని ఊహించాను. కానీ జరగలేదు. అలాగని నా మార్కు సినిమాలు ఆపను. నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటాను. త్వరలో ముగ్గురు దర్శకులను పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికే వాళ్లు చెప్పిన కథలు ఫైనల్ చేశాను. అందులో ఒకటి పలుకే బంగారమాయే పేరుతో రూపొందనుంది.

చాలా రోజుల తరువాత ఎఫ్-2 సక్సెస్‌తో ఊపిరి పీల్చుకున్నట్టున్నారు?

ఎఫ్-2 2019 ప్రారంభంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర విజయం చేయబోయే ప్రాజెక్ట్‌లకు మంచి బూస్ట్ నిచ్చింది. సక్సెస్ వున్నప్పుడు తదురి సినిమా కోసం మరింత కష్టపడాల్సి వుంటుంది.

ఇంతటి భారీ విజయాన్ని సాధిస్తుందని ఊహించారా?

సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం మొదటి నుంచి వుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రతీసారి దర్శకుడు అనిల్‌కు, నాకు మధ్య ఓ చర్చ జరుగుతూ వుండేది. భార్యభర్తల నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఈ కథకు వాళ్లు కనెక్ట్ అయితే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే చెప్పాను. నేను ఏదైతే ఊహించానో అదే ఈ రోజు నిజమైంది.

ఇది ఫ్యామిలీ సినిమా. దీనికి ఎఫ్-2 టైటిల్ మైనస్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా?

అనిల్ సినిమాలన్నీ పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగుతాయి. అందుకే అతను ఈ టైటిల్ చెప్పినప్పుడు ఇది వర్కవుట్ అవుతుందా? కాదా? అనే చర్చ అసలే చేయలేదు. టైటిల్ ఎలా వున్నా సినిమా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది.

కథ విన్నప్పుడు మహిళలపై సెటైరికల్‌గా వుంటుందేమో అన్న భావన కలిగిందా?

అనిల్ కథ చెప్పినప్పుడు ఏంటీ మహిళలపై సెటైర్లు వేస్తున్నామా? అనే అనుమానం కలిగింది. అయితే సెకండ్ హాఫ్‌లో నాజర్, అతని భార్య పాత్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశం, ఆ పాత్రలతో చెప్పించే డైలాగ్‌లతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాం. ఈ సినిమాను మహిళలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే సినిమా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు రాబడుతుందని ఊహించారా?

ఇక్కడ రెండు అంశాలు కీలకంగా మారాయి. వెంకటేష్, వరుణ్‌తేజ్ వంటి ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. ఇలాంటి కథకు ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. వాళ్లు కనెక్ట్ట్ అయితే ఊహించని మ్యాజిక్ జరుగుతుంది. సినిమాను మనం ఏవిధంగా చెప్పాం అన్నది ప్రేక్షకులకు సంబంధంలేదు. రెండున్న ర గంటలు ప్రేక్షకుల్ని నవ్వించే సినిమాలు కొన్ని వుంటాయి. ఏడిపించే సినిమాలు వుంటాయి. మా సంస్థలో వచ్చిన శతమానంభవతి చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ వుండదు. ఎమోషన్ మాత్రమే వుంటుంది. ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు అందుకే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఖైదీనంబర్150, రంగస్థలం వంటి చిత్రాలు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్. వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. అవి బ్లాక్‌బస్టర్‌లు అయ్యాయి. ఎఫ్-2 కూడా అంతే.

ఎంత మొత్తంలో వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు?

ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ దాటిపోయింది. టాప్ టెన్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాహుబలి రెండు భాగాలని పక్కన పెడితే మిగిలిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో మాత్రం మా ఎఫ్-2 స్థానాన్ని సొంతం చేసుకుంది.

గత ఏడాది పంపిణీ రంగంలో వరుస అపజయాల్ని చవిచూశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మీలో ఏమైనా మార్పులొచ్చాయా?

ఈ ఏడాది నుంచి డిస్ట్రిబ్యూషన్ రంగం వైపు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చాను. ఆ రంగం నుంచి వచ్చాను కావున ఆ మమకారంతో ఇన్నేళ్లూ సినిమాల పంపిణీ చేశాను. అయితే ఇప్పుడొస్తున్న సినిమాల ఎకానమీ లెక్కలు చూస్తుంటే భయమేస్తోంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఆ తప్పులు చేయదల్చుకోలేదు. సినిమాల నిర్మాణంపైనే ఇక నుంచి ఎక్కువ దృష్టిపెట్టాలనుకుంటున్నాను.

శ్రీనివాస కల్యాణం ఏ విషయంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచింది అనుకుంటున్నారు?

ఒక సినిమా పరాజయానికి కారణాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా విడుదల రోజు వరకు నేను పూర్తి నమ్మకంతో వున్నాను. విడుదల తరువాత కూడా నలభై పైబడిన వాళ్లంతా సినిమా బాగుందని అభినందించారు. అయితే ఆ కింది స్థాయి వారికి, యువతకు మాత్రం ఈ సినిమా ఎందుకో నచ్చలేదు. అమ్మా ఇదేంట్రా క్లాసులు పీకుతున్నట్టుంది. ఇలా చెబుతున్నారేంటీ?. పెళ్లి గురించి మనకు తెలియనిదా? అని భావించారు. దాంతో మేం తప్పుచేశాం అని తెలుసుకున్నాను.

మీకు మల్టీస్టారర్ చిత్రాలు కలిసొస్తున్నట్టున్నాయి?

ఏ సినిమా తీసుకున్నా దాంట్లో విషయం వుంటేనే ఆడుతుంది. దాన్నే నేను బలంగా నమ్ముతాను. కొత్త హీరోనా?, స్టార్ హీరోనా?, మల్టీస్టారర్ చిత్రమా? అనేది నేను నమ్మను. మనం తీసే సినిమా ద్వారా ప్రేక్షకుల్ని నమ్మించినప్పుడే అది ఆడుతుంది. లేదంటే ఆడదు.

మహర్షి ఎలా వుండబోతోంది?

నాకు తెలిసినంత వరకు ఈ ఏడాదిలో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

తదుపరి చిత్రాల గురించి?

తమిళ హిట్ చిత్రం 96ని తెలుగులో శర్వానంద్, సమంతలతో రీమేక్ చేస్తున్నాను. ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. మాతృకను రూపొందించిన ప్రేమ్‌కుమార్, కెమెరామెన్, సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పనిచేస్తారు. చిన్న చిన్న మార్పులతో ఈ సినిమా చేయబోతున్నాం. దీనితో పాటు నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాను. దీనికి సంబంధించిన కథ ఫైనల్ అయింది. ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా వుంటుంది.

ఈ ఏడాదే బాలీవుడ్‌లో అడుగుపెడతానని అన్నారు?

దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో మొదలుపెడతాం.

3572

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles