గీతాంజలి, ఫిదా తరహా ప్రేమకథ


Fri,December 14, 2018 11:54 PM

Dil Raj Excellent Words About Sai Pallavi Padi Padi Leche Manasu Movie Trailer Launch

చిత్రసీమలో జయాపజయాలు సహజం. సక్సెస్‌ఫుల్ దర్శకులతో నేను చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఫెయిల్యూర్‌లో ఉన్నవారితో చేసిన చిత్రాలు విజయాల్ని అందుకున్న దాఖలాలున్నాయి అంతిమంగా ఓ డైరెక్టర్‌కు మంచి కథ కావాలి. అలాంటి అద్భుతమైన కథ దర్శకుడు హను రాఘవపూడికి ఈ సినిమాతో కుదిరింది అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచె మనసు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. ఈ నెల 21న విడుదలకానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మాత దిల్‌రాజు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తెలుగు చిత్రసీమలోకి కొత్త నిర్మాతలు అరంగేట్రం చేస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే విజయవంతం అవుతారు. ఈ సినిమా ద్వారా ఆ జాబితాలో సుధాకర్ నిలుస్తాడు. ఎంతో అభిరుచితో ఈ సినిమాను నిర్మించారు.

వందశాతం సక్సెస్ కళ కనిపిస్తుంది. హను కష్టంతో పాటు శర్వానంద్, సాయిపల్లవి కెమిస్ట్రీ, విజువల్స్, బాణీలు అందంగా ఉన్నాయి. గీతాంజలి, ఫిదా తరహాలో చక్కటి ప్రేమకథగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశానని, చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని హాస్యనటుడు సునీల్ చెప్పారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ లై పరాజయంతో నిరుత్సాహంలో ఉన్న సమయంలో నాతో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు శర్వానంద్. అతడు ఇచ్చిన ప్రోత్సాహం, బలం వల్లే ఈ కథ రాయగలిగాను. ఈ సినిమా క్రెడిట్ మొత్తం శర్వానంద్, నిర్మాత సుధాకర్‌లకు దక్కుతుంది. కోల్‌కతా, నేపాల్‌లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలా రోజుల పాటు గుర్తుండిపోయే ఓ మంచి సినిమా అవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్, సుధాకర్, కల్పిక, శత్రు తదితరులు పాల్గొన్నారు.

1838

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles