కేటీఆర్‌కు మంచి స్నేహితుడిగా ఉంటా!


Tue,September 25, 2018 11:40 PM

DevaDas Movie Press Meet

నేను రాజకీయాల్లోకి రాను. ఆ ఆలోచన లేదు. కేటీఆర్‌కు మంచి స్నేహితుడిగా ఉంటాను అని అన్నారు నాగార్జున. నానితో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, ఆకాంక్షసింగ్ కథానాయికలు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ హింసకు తావు లేకుండా ఓ అంతర్జాతీయ మాఫియా డాన్ వ్యక్తిగత జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించిన సినిమా ఇది. ప్రారంభం నుంచి ముగింపు వరకు సరదాగా ఉంటుంది. నాతో పాటు నాని, రష్మిక, ఆకాంక్ష... అందరిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ శ్రీరామ్ ఆదిత్య అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. అతడిలో కొంత బద్దకం ఉంది. నెల రోజుల ముందు సినిమా చూడాలనుకున్నాను.

కానీ శ్రీరామ్‌ఆదిత్య మాత్రం రెండు రోజుల ముందు చూపించారు. దాంతో సినిమాలో మార్పులు చేసే అవకాశం దొరకలేదు. ముందుగా పూర్తిచేస్తే తప్పొప్పుల్ని సవరించుకొని మంచి సినిమా చేయడానికి నిర్మాతలకు వెసులుబాటు ఉంటుంది. ఆ విషయంపై దర్శకులందరూ పునరాలోచించాలి అని అన్నారు. నాని మాట్లాడుతూ నాగార్జునకు నేను వీరాభిమానిని. టిక్కెట్ల కోసం లైన్లలో నిల్చొని ఆయన సినిమాలు చూశాను. ఆయనతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఫోన్ ఎక్కువగా వాడుతాననే నింద ఈ సినిమాతో నాపై పడింది. నాగార్జున గారు పక్కన ఉంటే ఫోన్ వాడే ధైర్యం చేయను. కానీ స్వప్నదత్‌తో పాటు కొంతమంది చెప్పిన మాటలను నమ్మి నాగార్జున ట్విట్టర్‌లో ఫోన్‌లోనే మునిగిపోతానంటూ నాపై ఓ వీడియో పెట్టారు. అందులో కొంత మాత్రమే వాస్తవం ఉంది. నా జీవితంలో చాలా ఒత్తిడితో పాటు ఉత్సుకత, భయం అన్ని కలగలసిన వారాంతం ఇదే. దేవదాస్ విడుదలతో పాటు బిగ్‌బాస్ ఫైనల్ ఈ వారంలోనే ఉన్నాయి. ఈ బాధ్యతలు పూర్తిచేసి కొన్నాళ్ల పాటు కాశీకి వెళ్లిపోవాలనుంది(నవ్వుతూ).

వ్యాఖ్యాతగా మారుతానని అనుకోలేదు. జీవితం ఎటు తీసుకెళుతుందో తెలియదు. నటుడిగా కొనసాగడమే నాకు ఇష్టం అని చెప్పారు. నాగార్జున, నాని ఈ చిత్రాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించారని, గుండమ్మకథలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ తరహాలో వారి పాత్రలు సాగుతాయని అశ్వినీదత్ అన్నారు. రీమేక్ సినిమా కాదు. సొంత కథతో చేశాం. స్నేహం నేపథ్యంలో సాగుతుంది అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా, ఆకాంక్షసింగ్ పాల్గొన్నారు.

4578

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles