చనిపోతానని భయపడ్డాను!

Tue,February 12, 2019 10:32 PM

కెరీర్ తొలినాళ్లతో పోలిస్తే రకుల్‌ప్రీత్‌సింగ్ మాటల్లో ప్రస్తుతం కెరీర్ పట్ల ధృడమైన ఆత్మవిశ్వాసం గోచరిస్తున్నది. మాటల్లో అనుభవంతో కూడిన పరిపూర్ణత కనిపిస్తున్నది. రాశి కంటే వాసికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న ఆమె నవ్యమైన ఇతివృత్తాలతో భిన్న భాషల్లో సినిమాలు చేస్తున్నది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం దేవ్. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌సింగ్ చిత్ర విశేషాల్ని పాత్రికేయులతో పంచుకుందిలా..

శ్రీదేవి బయోపిక్‌లో అవకాశం వస్తే నటిస్తానని అన్నారు?

-ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. శ్రీదేవి బయోపిక్‌లో నాకు నటించాలనుంది.

ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకత ఏమిటి?

-దేవ్ సినిమా విడుదల అవుతుంది. అదే ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకత. వాలంటైన్స్‌డేకు ముందు రోజు మా అమ్మానాన్నలు ఇక్కడకు వస్తున్నారు. నా కెరీర్‌లో తొలిసారి విడుదల రోజు అమ్మానాన్నలతో కలిసి నా సినిమా చూడబోతున్నాను. ఇదివరకు ఎప్పుడూ నా సినిమాల్ని వారితో కలిసి చూసే అవకాశం రాలేదు. వారు ఢిల్లీలో నేను మరో చోట సినిమాలు చూసేవాళ్లం. వాలంటైన్స్ డే అంటే భాగస్వామితో సెలబ్రేట్ చేసుకోవడమే కాదు. తల్లిదండ్రుల స్నేహితులతో జరుపుకోవచ్చునని నమ్ముతాను.

కాలేజీ రోజుల్లో ప్రేమికుల రోజుకు సంబంధించి మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా?

-వాలంటైన్స్ డేపై నాకు నమ్మకం లేదు. విదేశీ సంస్కృతితో ముడిపడిన వేడుక ఇది. ప్రత్యేకంగా ప్రేమ కోసం ఒక రోజును కేటాయించి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సరికాదు. ఏడాది మొత్తం లేని ప్రేమనంతా ఆ ఒక్కరోజే కురిపించడంలో అర్థంలేదు. ప్రేమలో ఉన్న వారికి ప్రతి రోజు పండుగలానే ఉంటుంది. వాలంటైన్స్ డే రోజున షాపింగ్‌ల పేరుతో డబ్బులు ఖర్చుచేయడం నిజమైన ప్రేమ కాదు.

దేవ్‌లో మీ పాత్ర ఎలా ఉంటుంది. గత చిత్రాలతో పోలిస్తే మీ పాత్రకున్న ప్రత్యేకత ఏమిటి?

-lచాలా రోజులుగా మంచి ప్రేమకథలో నటించాలని ఎదురుచూస్తున్న నా కల ఈ సినిమాతో తీరింది. పట్టణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఇందులో మేఘన అనే స్త్రీవాద భావాలు కలిగిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ఆలోచించే అమ్మాయిగా నా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. పనే తన ప్రపంచం. చిన్నతనం నుంచి ప్రేమ, పెళ్లి పట్ల తనకున్న అపనమ్మకాలు, సంశయాల కారణంగా మేఘన ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నదనేది ఆకట్టుకుంటుంది.

నిజజీవితంలో మీలో ఫెమినిజం భావాలు ఉన్నాయని అనుకుంటున్నారా?

-నాలో అనే కాదు సమాజంలోని చాలా మందిలో ఆ భావజాలం కనిపిస్తుంది. ఫెమినిజం అంటే మగాళ్లను వ్యతిరేకించడంకాదు. తమ సొంత కాళ్ల మీద నిలబడటమేనని నేను నమ్ముతాను. లింగవివక్ష లేకుండా అందరిని సమానంగా గౌరవించడం చాలా ముఖ్యం.

నిజజీవితంలో మీరు అడ్వెంచర్స్‌కు ప్రాధాన్యత నిస్తుంటారా?

-వృత్తికే నా తొలి ప్రాధాన్యత. నాకు నచ్చిన సినిమా రంగంలో స్థిరపడ్డాను కాబట్టి ఇందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. అలసట కనిపించదు. విరామం తీసుకోవాలనే తలంపు రాదు. సమయం దొరికితే అడ్వెంచర్స్ చేస్తాను. గత వారం దుబాయ్‌లో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నీరజకోనాతో కలిసి స్కైడైవ్ చేశాను. 15 వేల అడుగుల పైనుండి దూకే ముందు బతుకుతానా లేదా అన్న భయం వేసింది. ఇంకా చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని విమానంలో నేను, నీరజ మాట్లాడుకున్నాం. విమానం నుంచి కిందికి దూకగానే 50 క్షణాల పాటు పారాచూట్ లేకుండా కిందికి వేగంగా వెళతాం. ఆ క్షణాలు నా జీవితంలో చాలా మధురంగా అనిపించాయి.

అడ్వెంచర్స్ గురించి ఇంట్లో వారికి చెప్పే చేస్తుంటారా?

-భయపడుతారనే ఆలోచనతో స్కైడైవ్‌విషయం ముందుగా మా కుటుంబసభ్యులకు చెప్పలేదు. స్కైడైవ్ చేసిన తర్వాత వీడియోతో పాటు వాయిస్‌నోట్‌ను పంపించాను. మా నాన్న మాత్రం ముందుగా చెబితే నేను వచ్చేవాణ్ణి కదా అని అన్నారు. ఆర్మీలో పనిచేశారు కాబట్టి ఆయనకు ఇవన్నీ అలవాటే. కానీ అమ్మ మాత్రం ఓకే అంటూ సింపుల్‌గా మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఫోన్ చేసి స్కైడైవ్ అనుభూతి గురించి అడిగింది.

ట్విట్టర్‌లో మీపై ఓ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కారణం ఏమిటి?

-ఆ సంఘటనను మర్చిపోయాను. అయినా అది కాంట్రవర్సీ కాదు. సోషల్‌మీడియాలో అలా కావాలనే ప్రచారం చేశారు. నటిగా కాకుండా ఓ సాధారణ మహిళగా అతడికి సమాధానం ఇచ్చాను. తెలుగు ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టి ఆరేళ్లవుతుంది. ఇన్నేళ్లలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదు. సోషల్‌మీడియాలో ఒక సెలబ్రిటీ గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే రియల్‌లైఫ్‌లో ఎంతమందిని వేధిస్తున్నారో అనిపించింది. ఇలాంటి వారే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారు. అతడికి నేను ఇచ్చిన సమాధానం చూసి చాలా మంది రకుల్ అతడికి పరుషంగా సమాధానం ఇచ్చిందని ట్రోల్ చేశారు. రోడ్‌మీద నడిచే సమయంలో ఎవరైన మనల్ని అసభ్యపదజాలంతో దూషిస్తే అలా మాట్లాడవద్దని ప్రాధేయపడితే వినరు. వారు చెప్పిన భాషలోనే మనం మాట్లాడితేనే వింటారనిపించి అలా మాట్లాడాను.

మీకు నచ్చిన సినిమాల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇప్పుడు దొరికిందా?

-రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత నా ఆలోచన దృక్పథం మారింది. సంఖ్య కంటే నాణ్యతకే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నాను. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన తర్వాత బాగా జరిగిందనే అనుభూతి ప్రతి రోజు నాలో కలగాలి. అలాంటి సినిమాలనే చేస్తాను.

4853

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles