కొత్తవాళ్ల దగ్గర నేర్చుకుంటాను!

Tue,October 15, 2019 11:43 PM

‘ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఔత్సాహిక దర్శకులతోనే ఎక్కువగా పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తున్నాను. అందులో నా స్వార్థం ఉంది. కొత్త వారు నవ్యమైన ఆలోచనలతో సినిమాలు చేస్తారు కాబట్టి వారి నుంచి కెరీర్‌కు ఉపయోగపడే చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు’ అని అన్నారు సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు. ఆయన ఛాయాగ్రహణాన్ని అందించిన తాజా చిత్రం ‘రాజుగారి గది-3’. ఓంకార్‌ దర్శకుడు. ఈ నెల 18న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఛోటా కె నాయుడు పాత్రికేయులతో ముచ్చటించారు.


దర్శకుడు ఓంకార్‌తో చాలా కాలంగా పరిచయముంది. అతడు ఇంతకుముందు దర్శకత్వం వహించిన ‘జీనియస్‌', ‘రాజుగారి గది’ చిత్రాలకు నేను సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాల్సింది. అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమాతో మా కలయిక కుదిరింది. ‘మీ శైలి హంగులతో కూడిన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’ అని చెప్పి ఒప్పించాడు ఓంకార్‌. హారర్‌ అంశాలు మిళితమైన వినోదభరిత చిత్రమిది.ఓంకార్‌ గత చిత్రాలకు మించిన వినోదం ఉంటుంది. హీరోగా అశ్విన్‌ ఈ సినిమాకు న్యాయం చేయగలడా లేడా అని తొలుత సందేహించాను. నృత్యాలు, పోరాటాలు, సంభాషణలు..అన్నింటిని సింగిల్‌టేక్‌లో పూర్తి చేసి నా అంచనాలు తప్పని నిరూపించాడు. అవికా సహజ అభినయాన్ని కనబరిచింది.

దర్శకత్వం చేయను..

‘అమ్మ రాజీనామా’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా నా ప్రయాణం ప్రారంభమైంది. కానీ తొలుత ‘రగులుతున్న భారతం’ చిత్రం విడుదలైంది. ఛాయాగ్రాహకుడిగా తొంభైకి పైగా సినిమాలు పూర్తిచేశాను. ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలతో పాటు సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయినా చిత్రాల్ని చూస్తూ అప్‌డేట్‌ అవుతుంటాను. నాకు కోపం ఎక్కువని, ఎవరి మాట విననని.. నాతో పనిచేయడం కష్టమనే అభిప్రాయం చిత్రసీమలో చాలా మందిలో ఉంది. తొలినాళ్ల నుంచి వృత్తిపట్ల ప్రేమతో పనిచేస్తున్నాను. నా తత్వం అంతే. నా అభిప్రాయం ఏదైనా నిర్మొహమాటంగా చెబుతుంటాను. ఎవరికీ భయపడను. నాకున్న కోపానికి, మనస్తత్వానికి సినిమాకు దర్శకత్వం వహించడం కష్టమని నా అభిప్రాయం. నేను దర్శకత్వం వహిస్తున్నానంటే సినిమాపై చాలా అంచనాలుంటాయి. అందుకు తగిన కథ దొరికితే భవిష్యత్తులో దర్శకత్వం గురించి ఆలోచిస్తా. నా దగ్గరకు వచ్చే దర్శకుల్ని కథేమిటని అడగకుండా తొలుత బ్యాక్‌డ్రాప్‌ ఏమిటో తెలుసుకుంటాను. అది నచ్చితేనే సినిమా అంగీకరిస్తాను.

తొలి హారర్‌ సినిమా..

నా కెరీర్‌లో యాక్షన్‌, ప్రేమకథలు, సెంటిమెంట్‌ ఇలా అన్ని రకాల జోనర్‌లలో సినిమాలు చేశాను. కానీ హారర్‌ కథాంశానికి కెమెరామెన్‌గా పనిచేయడం ఇదే తొలిసారి.ప్రేమకథలతో పాటు యాక్షన్‌ సినిమాలకు పనిచేయడంలో కంఫర్ట్‌ ఎక్కువగా ఉంటుంది. సంతోష్‌శివన్‌ నా అభిమాన ఛాయాగ్రాహకుడు. అన్ని నాకే తెలుసు అనే భావనతో ఎప్పుడూ ఉండను. అవసరమైతే కొత్తవాళ్ల నుంచి సినిమాటోగ్రఫీకి సంబంధించిన మెళుకువలను నేర్చుకోవడానికి మోహమాటపడను. నూతన కెమెరామెన్‌ల పనితనం నచ్చితే వారిని స్వయంగా అభినందిస్తుంటాను.

629

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles