ఇరవై మంది వచ్చేవారు కాదు!


Wed,July 17, 2019 12:13 AM

chiyaan vikram misterkk interview

విభిన్నమైన ఇతివృత్తాలు, ప్రయోగాత్మక పాత్రలతో విలక్షణ కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విక్రమ్. నవ్యతకు ఆయన సినిమాలు చిరునామాగా నిలుస్తుంటాయి. ప్రతి సినిమాలో నటుడిగా తనను తాను సరికొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటారాయన. ఆ శైలి ఆయనకు దక్షిణాదిన తిరుగులేని అభిమానగణాన్ని తెచ్చిపెట్టింది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిస్టర్ కె.కె. రాజేష్ ఎం.సెల్వ దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విక్రమ్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

-ఆదిత్య వర్మలో నటించడానికి ముందు ధృవ్ అమెరికాలో మెథడ్ యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఐదేళ్ల తర్వాత సినిమాల్లో న టించాలనే ఆలోచనలో ఉండేవాడు. ఆ సమయంలో ధృవ్ నటించిన ఓ డబ్‌స్మాష్ వీడియో చూసి చిత్రబృందం ఈ రీమేక్ కోసం అడిగారు. సినిమా చేయాలా అని నన్ను ఆడిగినప్పుడు చేయమని చెప్పాను. తెలుగు మాతృక కూడా చూడలేదు. నా మాటకు కట్టుబడి నటించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో నా కంటే బాగా నటించాడు.

మిస్టర్ కె.కె.లో మీకు నచ్చినదేమిటి?

-అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ైస్టెలిష్ యాక్షన్ సినిమా ఇది. గ్రే షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేశాను. నేను హీరోగా కనిపిస్తానా? ప్రతినాయకుడినా అన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది

క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశారా? కథకు ప్రాముఖ్యతనిచ్చారా?

-సినిమాకు కథే ముఖ్యం. స్టోరీతో పాటు నా పాత్ర బాగుంటేనే నటిస్తాను. ఒక రోజులో జరిగే కథ ఇది. చాలా ఫాస్ట్‌పేస్‌లో సాగుతుంది.

హాలీవుడ్ శైలి సినిమా అంటున్నారు . తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది?

-హాలీవుడ్ శైలికి మనవైన భావోద్వేగాల్ని మేళవించి రూపొందించాం. నేటివిటీ కంటే ఎమోషన్ మాత్రమే సినిమాతో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్ హాలీవుడ్ సినిమానే అయినా ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారు. అలాగే బాహుబలి ఇండియన్ సినిమాగా అన్ని భాషల్లో విజయాన్ని సాధించింది. కథల్లోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం వల్లే అవి విజయవంతమయ్యాయి. కథ, భావోద్వేగాలు బాగుంటే నేటివిటీ పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమా చూస్తారు.

అపరిచితుడు తర్వాత బ్లాక్‌బాస్టర్ సక్సెస్ మీ కెరీర్‌లో లేదెందుకని? కథల ఎంపికలో మీ పంథా ఏమైనా మారిందని అనుకుంటున్నారా?

-విజయాన్ని అందుకోవాలనే తపనతోనే ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. నేనూ అంతే. డబ్బు కోసం కాకుండా బ్రేక్ వస్తుందనే విశ్వాసంతో నటిస్తాను. సేతు సినిమాకు ముందు పది, పన్నెండు ఏళ్ల వరకు నాకు సరైన విజయం లేదు. నా సినిమాలకు థియేటర్లలో ఇరవై మంది కూడా ఉండేవారు కాదు. ఆ తర్వాత వరుసగా ఐదారేళ్లు నా సినిమాలన్నీ విజయం సాధించాయి. ఆ సమయంలో మీ విజయరహస్యం ఏమిటని అందరూ అడిగేవారు. జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రతిసారి ప్రేక్షకులకు మంచి సినిమాను అందించడానికి ప్రయత్నిస్తాను. అందువల్లే ఇన్నేళ్లయినా తమిళంలో టాప్‌పైవ్ హీరోల్లో ఒకరిగా ఉన్నాను.

సినిమాలు పరాజయం పాలైనప్పుడు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది?

-నేనే నంబర్‌వన్‌గా ఉండాలని ఎప్పుడూ అనుకోను. సినిమా అంటే నాకు ఇష్టం. డబ్బులు, స్టార్‌డమ్ ఇవన్నీ పక్కనపెట్టి విభిన్నమైన చిత్రాల్లో భాగమవ్వడానికే ప్రయత్నిస్తాను. ఇరవై, ముప్ఫై ఏళ్ల తర్వాత కూడా సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు అందరూ చెప్పుకునేలా ఉండాలి.

కమల్‌హాసన్ నిర్మాణంలో సినిమా చేయడం ఎలా ఉంది?

-ఈ సినిమాలో కమల్‌హాసన్ హీరోగా నటించాల్సింది. కానీ రాజకీయాలతో బిజీగా ఉండటంతో నాకు ఆ అవకాశం వచ్చింది. ఆయన పాత్ర అనే ఆలోచన నిరంతరం మనసులోపెట్టుకొనే నటించాను. షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు సార్లు మాత్రమే సెట్స్‌కు వచ్చారు. నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. కమల్ హాసన్ ఇతర హీరోల గురించి ఎక్కువగా మాట్లాడరు. ఆడియో వేడుకలో నా క్యారెక్టర్, లుక్ గురించి మాట్లాడటం ఆనందాన్నిచ్చింది. సినిమా చూసి ఆయన బాగుందని చెప్పినప్పుడు సంతృప్తిగా ఫీలవుతాను.

మణిరత్నంతో పొన్నియన్ సెల్వన్ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది?

-జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. టైటిల్ పాత్ర కోసం జయం రవిని తీసుకోవాలని మణిరత్నం భావిస్తున్నారు. అతడి పాత్రనేపథ్యంలో సాగే ఈ సినిమాలో నేనూ ఓ కీలక క్యారెక్టర్ చేయబోతున్నాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

-గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ధృవనక్షత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తిచేయాల్సివుంది. అలాగే అజయ్ జ్ఞానముత్తుతో మరో సినిమా చేయబోతున్నాను.

అర్జున్‌రెడ్డి రీమేక్‌లో మీ తనయుడు ధృవ్ యాక్టింగ్ చూసినప్పుడు ఏమనిపించింది? మీరు సెట్స్‌కు వెళ్లినప్పుడు ధృవ్ టెన్షన్‌గా ఫీలయ్యాడా?

-రొమాంటిక్ సీన్స్, ముద్దు దృశ్యాల్లో నటించే సమయంలో మీరు సెట్స్‌లో ఉంటే నేను చేయలేను బయటకు వెళ్లండి నాన్న అని చెప్పేవాడు. నాన్న అని మర్చిపోయి అసిస్టెంట్ డైరెక్టర్‌గా భావించుకోమని చెప్పాను.

991

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles