హాలీవుడ్‌కు మనం ఫాలోవర్స్ మాత్రమే!

Sun,April 14, 2019 11:35 PM

హాస్యనటుడి బాడీలాంగ్వేజ్ కామెడీగా కనిపించాలనే ముద్ర ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. సిక్స్‌ప్యాక్‌లతో హాస్య నటుడు వినోదాన్ని పండిస్తే చూడరు. అందుకే ఫిట్‌నెస్ గురించి ఆలోచించడం మానేశాను అని అన్నారు సునీల్. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత హీరోగా మారారు. కథానాయకుడిగా వరుస పరాజయాలు పలకరించడంతో ఇటీవలే హాస్యనటుడిగా తిరిగి పునరాగమనం చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చిత్రలహరి. ఈ సినిమాతో పాటు తన కెరీర్ గురించి ఆదివారం హైదరాబాద్‌లో సునీల్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

చిత్రలహరి కథలో మీ జీవితాన్ని చూసుకున్నారా?

-సినిమాలో కథానాయకుడి పాత్ర మాదిరిగానే నా జీవితం మొదలైంది. సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లో వాళ్లు వెన్నుతట్టి ప్రోత్సహించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తే మంచి పాత్రలు వస్తాయని కొన్నాళ్లు ఆ పనిచేశాను. ఆ సమయంలో స్నేహితులు, బంధువులంతా అసిస్టెంట్‌డైరెక్ట్‌గా పనిచేయడానికే హైదరాబాద్ వెళ్లావా అని విమర్శించారు. ఆ విమర్శల్ని తట్టుకుంటూ నిలబడ్డాను కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను.

సాయితేజ్‌తో తొలిసారి సినిమా చేశారు? ఆ అనుభవం ఎలా ఉంది?

-తేజ్ సినిమాల్లోకి రాకముందే అతడితో పరిచయం ఉంది. సినిమా షూటింగ్‌లు చూడటానికి వచ్చినప్పుడు నిన్ను హీరోగా పెట్టి ఎప్పటికైనా సినిమా చేస్తాను అని అతడితో అనేవాణ్ణి. దర్శకుడిగా కాకపోయిన అతడితో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది

మీ సంతోషాల్ని, బాధల్ని ఎవరితో ఎక్కువగా పంచుకుంటారు?

-ఇంకెవరు త్రివిక్రమ్‌తోనే. సమస్యలు, బాధలు ఏవైనా తనతోనే పంచుకుంటాను. స్నేహితుడిగానే కాకుండా త్రివిక్రమ్‌లో గొప్ప టీచర్ ఉన్నాడు.సమస్యల్లో ఉన్నవారిలో ధైర్యాన్ని నింపుతాడు. కష్టాన్ని తీసేసి కాన్ఫిడెంట్‌ను ఇస్తాడు. సినిమా అవకాశాల కోసం కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఇద్దరం ధైర్యంగా బతికాం.

సినిమాల్లోకి రాకముందు నుంచి త్రివిక్రమ్‌తో పరిచయం ఉందా?

-స్కూల్‌లో త్రివిక్రమ్ నా సీనియర్. భీమవరంలోని డీఎన్‌ఆర్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. చిన్నతనం నుంచి అతడితో స్నేహం ఉంది. అవకాశాల కోసం తొలుత ఒక్కడినే హైదరాబాద్ వచ్చి ప్రయత్నించాను. అవి వర్కవుట్ కాకపోవడంతో ప్రతిభ ఉన్నవాళ్లు నా తోడుగా ఉంటే బాగుంటుందనిపించింది. అలా త్రివిక్రమ్ నాకు తోడయ్యాడు.

సినీ పరిశ్రమలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు ఉన్నాయా?

-ప్రస్తుత సమాజంలో ఓడిపోతే మనల్ని బాధపెట్టేవారు ఎక్కువగా ఉంటారు. విజయం సాధిస్తే పొగిడేవారు పెరుగుతారు. బాధలు పడనివారు ఎవరూ ఉండరు. మేము మిమ్మల్ని బాధపెడతాం నువ్వు మాత్రం నవ్వించాలనే ధోరణి పెరిగిపోయింది. నేను చనిపోయానని ఓ వైబ్‌సైట్ న్యూస్‌రాసి డబ్బులు సంపాదించింది. వ్యూస్ కోసం అలా చంపడం సరికాదు. ఎవరిని ఏడిపించి నేను డబ్బులు సంపాదించడం లేదు. నవ్విస్తూ సంపాదిస్తున్నాను కాబట్టి గర్వపడుతున్నాను

యాక్షన్ ఇమేజ్ కోసం ప్రయత్నించడం వల్లే హీరోగా రాణించలేకపోయారని అనుకోవచ్చా?

-ఓ అగ్ర దర్శకుడి సలహాతో ఇతర హీరోలకు భిన్నంగా యాక్షన్ కామెడీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. హాస్యనటుడిగా సినిమాలు చేస్తూనే నా శైలికి సరిపోయే కథలు వస్తే హీరోగా నటించాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో నేను హాస్యనటుడిగా చేయననే ఆలోచనతో అలాంటి పాత్రల కోసం నన్ను అడగటం అందరూ మానేశారు. కామెడీ పాత్రలు చేయననే మాట నేనెప్పుడు చెప్పలేదు.

విదేశీ సినిమాల్ని బాగా చూస్తారా?

-మన సినిమాలన్నీ కాపీయే. కథల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు హాలీవుడ్‌లో వచ్చిన తర్వాతే ఇక్కడకు వస్తాయి. అంతేకానీ ఇక్కడ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడం ఉండదు. మనం ఫాలోవర్స్ మాత్రమే.

హాస్యనటుడిగా మీ స్థానం పదిలంగానే ఉందని అనుకుంటున్నారా?

-మిలియన్ డాలర్ల ప్రశ్న అది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నలభై ఆరు మంది కమెడీయన్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరి స్థానం శాశ్వతం కాదు. నేను హీరోగా మారిన ఈ పదేళ్లలో చాలా మంది హాస్యనటులు సినీ పరిశ్రమలోకి వచ్చారు. అద్భుతంగా నటిస్తున్నారు. వారి ట్రెండ్‌ను అందుకోగలిగి, కొత్తదనం చూపిస్తే ఉంటాను.

హీరోగా మళ్లీ నటిస్తారా?

-ఆ ఆలోచనైతే లేదు. హీరోగా చేయమని ఇద్దరూ నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. వారితో చేయననే చెబుతున్నాను. కానీ ఎప్పటికైనా మీతో కామెడీ సినిమా చేస్తామని వారు అంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి?

-త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో పాటు రవితేజ, వీఐ ఆనంద్ కలయికల్లో వస్తున్న సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే పెద్ద హీరోతో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాతో నా కల నెరవేరబోతున్నది.


హీరోగా పనిచేసినప్పుడు సినిమాల్లో ఎక్కువ జోక్యం చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి?

-నేను చేసిన కొన్ని సినిమాల కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టి రచయితల్ని తీసుకొచ్చాను. వారి చేత పనిచేయించుకున్నాను. నా కష్టంతో హిట్టు వచ్చిన తర్వాత సినిమాల్లో నేను ఎక్కువ జోక్యం చేసుకున్నానని కొందరు అబద్ధాలు చెప్పారు. అలా అబద్ధాలు చెప్పిన వారు మళ్లీ హిట్లు ఇవ్వలేదు.

హాస్యనటుడిగా పునరాగమనం చేసిన తర్వాత కెరీర్ ఎలా ఉంది?

-హీరోగా అయితే సంవత్సరానికి ఒకసారి కనిపిస్తాను. అదే హాస్యనటుడిని అయితే నెలకు నాలుగైదు సార్లు ప్రేక్షకుల ముందుకు రావచ్చు. కమెడియన్లకు హీరో స్థాయిలో పారితోషికం ఇవ్వరు. అందుకే హాస్యనటుడి కంటే ఒక అడుగు కిందికి దిగే పారితోషికం తీసుకుంటున్నాను.

2081

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles