సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు


Mon,September 9, 2019 11:40 PM

Chiranjeevi Mahesh Babu and more Telugu stars shine at the Cine Mahotsavam

సినిమా అద్భుతసౌధమైతే దానికి పునాదిరాళ్లుగా మేనేజర్లు నిలుస్తారు. సినిమా విజయాల్లో వారి పాత్ర కీలకంగా ఉంటుంది అన్నారు హీరో చిరంజీవి. తెలుగు సినీ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సిల్వర్‌జూబ్లీ వేడుక రథసారథుల రజతోత్సవం పేరుతో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, మహేష్‌బాబు, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు తెలుగు సినీ తారాలోకం పాల్గొని సందడిచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినిమాల కోసం మేనేజర్లు పడే కష్టమేమిటో ప్రత్యక్షంగా తెలుసు. ఆఫీస్ ప్రారంభం నుంచి సినిమా విడుదలయ్యే వరకు రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంటారు అని తెలిపారు. చిరంజీవితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహేష్‌బాబు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం.

భవిష్యత్తులో సినీ రంగానికి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. కశ్మీర్‌ను సినిమా చిత్రీకరణలకు అనువుగా మార్చేందుకు కేంద్రం కృషిచేస్తున్నదని, సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మేనేజర్ల సహాయసహకారాల వల్లే మంచి సినిమాలు తీయగలిగానని, ఈ యూనియన్‌కు 32 లక్షల్ని విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, కృష్ణంరాజు, సుమలత, జయసుధ, రోజారమణి, రాజశేఖర్, నాగబాబు, సందీప్‌కిషన్, శ్రీకాంత్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు. పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠి, అనసూయ, శివాని, శివాత్మికతో పాటు పలువురు కథానాయికలు తమ నృత్యాలతో ఆహుతుల్ని అలరించారు.

339

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles