అనుబంధాలకు దర్పణం


Tue,April 16, 2019 12:19 AM

chiranjeevi appriciates chitralahari unit and saidharamtej

జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించడానికి కృషితో ముందుకు వెళ్లాలని చిత్రలహరిలో ఆవిష్కరించిన తీరు బాగుంది. తండ్రీకొడుకుల అనుబంధం గురించి చక్కగా చూపించారు అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. సాయితేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం చిత్రలహరి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్(సి.వి.ఎం) నిర్మించారు. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిరంజీవి చిత్రబృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్థవంతమైన సందేశంతో దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాను తెరకెక్కించారు. నటుడిగా తేజు తన ప్రతిభను నిరూపించుకున్నాడు. పరిణితితో కూడిన అభినయాన్ని కనబరిచాడు. పోసాని కృష్ణమురళి, సునీల్‌తో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి సినిమాకు నిండుదనం తెచ్చారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. విజయవంతమైన చిత్రాలకు మైత్రీ మూవీస్ చిరునామాగా నిలుస్తున్నది. వారి ప్రతిష్టను మరింత నిలబెట్టుకునేలా సినిమాను రూపొందించారు. అనుబంధాలను హృద్యంగా ఈ సినిమాలో ఆవిష్కృతం చేశారు. వేసవిలో ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది అని తెలిపారు.

కేరళలో సైరా
సీనియర్ నటుడు చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఆంగ్లేయులను ఎదిరించిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్, సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అన్ని భాషల అగ్రనటులు భాగం కావడంతో పాన్ ఇండియా మూవీగా ఇప్పటికే అందరి దృష్టిని ఆకట్టుకుంటుందీ చిత్రం.

ప్రస్తుతం కేరళలోని చాలకూడిలో చిత్రీకరణ జరుగుతున్నది. చిరంజీవి, జగపతిబాబు పాత్రలపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పోరాటయోధుడు వీరారెడ్డిగా జగపతిబాబు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. నరసింహారెడ్డి రాజగురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మే నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తిచేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అమిత్‌త్రివేది స్వరకర్త. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1426

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles