సవాళ్లకు సిద్ధంగా ఉన్నా!

Mon,October 7, 2019 12:34 AM

ఇద్దరమ్మాయిలతో సరైనోడు గౌతమ్‌నందా చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించకుంది కేథరిన్. ఆమె కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రం అరువమ్ తెలుగులో వదలడు పేరుతో విడుదలవుతున్నది. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను జ్యోతి అనే పాత్రలో కనిపిస్తాను. పుట్టుక నుంచే ఎలాంటి వాసనను గుర్తించలేని ఇంద్రియలోపంతో బాధపడుతుంటాను. ఈ పాయింట్ నచ్చే సినిమా అంగీకరించాను. వాసనను పసిగట్టలేకపోవడం వల్ల జ్యోతి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది.


ఆ కారణంతోనే వివాహానికి విముఖత చూపుతుంది. అయితే జ్యోతికి సాంఘిక స్పృహ ఎక్కువ. వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు వెళుతూ సేవ చేస్తుంటుంది. ఆహారం కల్తీ వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను చర్చించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరో సిద్ధార్థ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌గా కనిపిస్తాడు. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా కథ సాగుతుంది. ఆహారం విషయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. జనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి అంశాల్ని చర్చిస్తూ ప్రజల్లో అవగాహన కలిగించే సినిమా ఇది.

సొంతంగా డబ్బింగ్ చెబుతా..

-అందరూ అనుకుంటున్నట్లుగా ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు. కొంతభాగం సూపర్‌నేచురల్ అంశాలతో నడుస్తుంది. అదేమిటన్నదే సస్పెన్స్. నా పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది. నేను తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేశాను. తమిళంలో అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించాను. తెలుగులో సవాలుతో కూడిన పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర కొత్తపంథాలో ఉంటుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించాను. దర్శకులు అంగీకరిస్తే సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమే. కథ నచ్చితే ఏ భాషా చిత్రంలో నటించడానికైనా అభ్యంతరం లేదు.

733

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles