ఆ అర్హత వందశాతం నాకే ఉంది!


Thu,January 10, 2019 11:18 PM

boyapati srinu at vinaya vidheya rama interview

బోయపాటి శ్రీను సినిమాలంటేనే భారీతనానికి పెట్టింది పేరు. రొమాంచితమైన పోరాట ఘట్టాలు, తెర నిండుగా పరచుకునే కుటుంబ అనుబంధాలు, కథానాయకుడి ధీరత్వ ప్రదర్శన వెరసి జనరంజకమైన వాణిజ్య సినిమాకు చిరునామాగా అనిపిస్తాయి. నా దృష్టిలో సినిమా సంక్రాంతిలాంటిది. భోగీలోని తియ్యదనం, సంక్రాంతిలోని ఆప్యాయతానురాగాలు, కనుమనాటి కోడిపుంజుల కొట్లాట..ఇలా భిన్న భావోద్వేగాలకు దృశ్యరూపంగా సినిమాను భావిస్తాను అన్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా గురువారం బోయపాటి శ్రీను పాత్రికేయులతో ముచ్చటించారు.రామ్‌చరణ్ ఏదో సాధించానని తృప్తిచెందే మనిషి కాదు. ఇంకా పైకి ఎదగాలి, మరిన్ని గొప్ప విజయాల్ని సాధించాలని తపిస్తుంటాడు. అతనిలో ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. చిరంజీవి అందించిన యుద్ధట్యాంక్ లాంటివాడు రామ్‌చరణ్. పోరులో ముందుకు సాగిపోతూ, శత్రువుల్ని సంహరిస్తూ విజయం వైపు పయనిస్తూనే ఉంటాడు.నేను సెట్‌లో కొంచెం కఠినంగానే ఉంటాను. ఎందుకంటే నా సినిమాలన్ని భారీ తారాగణంతో ఉంటాయి. ఒక్క రోజు షూటింగ్‌కు కొన్ని లక్షల వ్యయం అవుతుంది. అందరిని సమన్వయం చేసుకొని అనుకున్న విధంగా చిత్రీకరణ పూర్తి చేయాలంటే కఠినంగానే వ్యవహరించాలి. నిర్మాతకు నష్టం చేయకూడదనే ఉద్దేశ్యంతో నేను అలా ప్రవర్తిస్తాను. అదే సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి గౌరవమిస్తాను.

ఈ సినిమాలో రాముడు ఎవరికి విధేయుడిగా కనిపిస్తారు?

తనను నమ్మిన వారికి, ఉపకారం చేసిన వారికి కృతజ్ఞులై ఉండేవారిని విధేయులు అంటాం. ఈ సినిమాలో కథానాయకుడైన రాముడు తన కుటుంబానికి, సాయం కోరి వచ్చిన ఆశ్రితులకు విధేయుడై ఉంటాడు. వారిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఈ అభినవ రాముడి విధేయత ఎలా వుంటుందో తెరపై చూస్తేనే అర్థమవుతుంది.

ట్రైలర్ చూస్తే సినిమాలో యాక్షన్ దండిగా ఉన్నట్లు కనిపిస్తున్నది. సాఫ్ట్ టైటిల్‌తో సినిమా తీస్తూ పోరాటఘట్టాల్ని ఎక్కువగా చూపించారెందుకని?

ట్రైలర్ చూస్తే అభిమానులు సంతృప్తిగా ఫీలవ్వాలి. వాళ్లు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలు అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటాయి. వారికోసమే ట్రైలర్‌లో యాక్షన్ ఘట్టాల్ని ఎక్కువగా చూపించాం. అయితే ఈ సినిమాలో పోరాట దృశ్యాలు కేవలం ఓ పార్శం మాత్రమే. మిగతా కథంతా చక్కటి కుటుంబ అనుబంధాలు, మనవైన అప్యాయతల కలబోతగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌కు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారని తెలిసింది?

నాలుగేళ్ల ముందే రామ్‌చరణ్‌కు ఈ కథ చెప్పాను. ఇందులో కథానుగుణంగా హీరో ఐరన్‌మేన్‌లా అత్యంత శక్తివంతమైన లుక్‌తో కనిపించాలి. చక్కటి పరిణితి కలిగిన యువకుడిలా అనిపించాలి. మరికొంత సమయం తీసుకుంటే రామ్‌చరణ్‌లో ఆ లక్షణాలన్నింటిని రాబట్టుకోవచ్చని అనుకున్నాను. అందుకే ఈ సినిమా కార్యరూపం దాల్చడం కొంచెం ఆలస్యమైంది.

మీ సినిమాల్లో యాక్షన్, హింస పాలు ఎక్కువనే విమర్శలున్నాయి?

భద్ర నుంచి నా సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతి చిత్రంలో కుటుంబ అనుబంధాల ఆవిష్కరణ, సమాజం పట్ల బాధ్యత కనిపిస్తుంది. ఈ రెండు అంశాలకు దూరంగా నేనెప్పుడు సినిమాలు తీయలేదు. యాక్షన్, హింస అనేవి కథ డిమాండ్ మేరకు అవసరమైన చోటే ఉంటాయి. అంతేకాని అవే ప్రధానంగా కనిపించవు. సినిమాలో నేను ఓ దెబ్బ కొట్టినట్లు చూపించినా అందులో కూడా భావోద్వేగం ఉంటుంది. అర్థంలేకుండా యాక్షన్ ఘట్టాల్ని కథలో చూపెట్టను. కుటుంబ కథా చిత్రాల దర్శకుడినని ప్రకటించుకునే అర్హత వందకు వందశాతం నాకే ఉందనుకుంటున్నాను.

ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రను ఎలా తీర్చిదిద్దారు. ఆయనతో తొలిసారి సినిమా చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

ఈ సినిమా విషయంలో రామ్‌చరణ్ నేను కోరుకున్నవన్నీ ఇచ్చాడు. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం రెండున్నర నెలలు పూర్తిగా దృష్టిపెట్టమని చెప్పాను. అదే విధంగా కష్టపడి బాడీ బిల్డింగ్ చేశాడు. దర్శకుడిగా నా విజన్‌కు, తెరపై కనిపించిన విజువల్‌కు రామ్‌చరణ్ ఓ వారధిలా నిలిచాడు. అందుకే సినిమా అద్భుతంగా తయారైంది.

నటీనటులకు కథను చెప్పే సమయంలో మీరు తీవ్రమైన భావోద్వేగాల్ని ప్రదర్శిస్తారని, సన్నివేశాల తాలూకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా కథను వినిపిస్తారని చెబుతుంటారు?

అవును. నా ైస్టెల్ అలాగే ఉంటుంది. నా దృష్టిలో సినిమా ఓ పండగ. ఒక మరచిపోలేని అనుభవం. ఓ దర్శకుడిగా నేను ఆవిష్కరించేబోయే పాత్రల్ని బాగా ప్రేమిస్తాను. వాటిలో పరకాయప్రవేశం చేసి నటీనటులను ఇంప్రెస్ చేయాలనుకుంటాను. నటించబోయే తారల కంటే పదిరేట్లు గొప్పగా పాత్రల స్వభావాన్ని తెలియజెప్పాలన్నది నా సిద్ధాంతం. అందుకే నా కథా వర్ణన మిగతా దర్శకులకంటే భిన్నంగా ఉంటుంది.

ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటించారు. ఆయన్ని ఎంచుకోవడానికి కారణమేమిటి?

నేను అనుకున్న పాత్రకు ఆయనే పక్కాగా సరిపోతాడనిపించింది. ముంబైకి వెళ్లి ఆయనకు కథ చెబుదామనుకున్నప్పుడు నేను తెలుగులో రక్తచరిత్ర సినిమా చేశాను. అంతకుమించిన పాత్ర అనిపిస్తేనే నటిస్తాను అని అన్నారాయన. అరగంట పాటు ఆయనకు కథ నరేట్ చేశాను. కథ విని వెంటనే డేట్స్ చూసుకోండని చెప్పారు. అంతలా ఆయన్ని ఆకట్టుకుందీ కథ.

మొదటి నుంచి వాణిజ్య విలువలున్న చిత్రాల్నే చేస్తున్నారు. మీ పంథాకు భిన్నంగా నవ్యమైన కథాంశాలతో సినిమాలు చేసే ఆలోచన ఉందా?

నేను చిన్న సినిమాలు చేయలేను. నా కథలు లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌ను కలిగి ఉంటాయి. సినిమా అంటే కలర్‌ఫుల్‌గా, ఉన్నతమైన భావోద్వేగాల కలబోతగా ఉండాలని నేను అభిలషిస్తాను. అయితే నేను ఎప్పుడూ ఒకే రకమైన కథల్ని ఎంచుకోను. నా సినీ ప్రయాణాన్ని గమనిస్తే కమర్షియల్ ఇతివృత్తాల్నే ఎంచుకున్నప్పటికి కథాపరంగా వైవిధ్యం కనిపిస్తుంది. పదిమంది చూసే సినిమాలు చేయాలన్నదే దర్శకుడిగా నా లక్ష్యం. ఎవరో ఒక్కరి కోసం సినిమాలు తీయడం నాకు ఇష్టం ఉండదు.

2432

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles