మీటూ భుగభుగలు


Mon,October 15, 2018 02:07 AM

Bollywood Women Film Makers have given full support to Mitu

-సుభాష్‌ఘాయ్‌పై కేట్‌శర్మ ఆరోపణలు
-మీటూకు మహిళా డైరెక్టర్స్ మద్దతు

మీటూ సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. బాధిత మహిళల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. యువ కథానాయికలు మీటూ అంటూ పరిశ్రమ పెద్దల చీకటి భాగోతాల్ని బట్టబయలుచేస్తున్నారు. దర్శకుడు సుభాష్‌ఘాయ్‌పై ఆరోపణలు సద్దుమణగకముందే మరో నాయిక కేట్‌శర్మ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ ఉమెన్‌ఫిల్మ్‌మేకర్స్ మీటూకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

కౌగిలించుకొని ముద్దుపెట్టబోయాడు -కేట్‌శర్మ


kate-sharma.jpg
బాలీవుడ్ దర్శకుడు సుభాష్‌ఘాయ్ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం నడుస్తుండగానే తాజాగా మోడల్, నటి కేట్‌శర్మ..సుభాష్‌ఘాయ్ తనను వేధించారని పేర్కొంది. ఆగస్ట్ నెలలో సుభాష్‌ఘాయ్ నన్ను తన ఇంటికి పిలిచారు. మసాజ్ చేయమని కోరడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. అయితే ఆయనపై ఉన్న గౌరవంతో ఒప్పుకున్నా. ఆ తర్వాత ఏదో మాట్లాడే నెపంతో సుభాష్‌ఘాయ్ నన్ను దగ్గరకు లాక్కొని కౌగిలించుకుని, ముద్దుపెట్టబోయాడు. నేను తీవ్రంగా ప్రతిఘటించాను. తనతో గడపకపోతే నటిగా అవకాశాలివ్వనని బెదిరించాడు అని కేట్‌శర్మ ఆరోపించింది. ఈ ఘటనపై కేట్‌శర్మ శనివారం ముంబయిలోని వెర్సొవా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై సమగ్ర విచారణ చేపట్టబోతున్నామని డీసీపీ పరమ్‌జిత్‌సింగ్ తెలిపారు.

దర్శకుడు కుషాన్ వేధించాడు -చిత్రాంగద


chitrangadha-singh.jpg
2016లో వచ్చిన బాబూ మషాయ్ బందూక్‌బాజ్ చిత్ర షూటింగ్‌లో దర్శకుడు కుషాన్‌నంది తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని కథానాయిక చిత్రాంగద ఆరోపించింది. ఓ సన్నివేశ చిత్రీకరణలో బటన్స్‌లేని జాకెట్ తనతో ధరింపజేసి జుగుప్సాకరంగా ప్రవర్తించాడని తెలిపింది. షూటింగ్ రోజున నవాజుద్దీన్ సిద్ధ్ధిఖీతో కలిసి ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని డిజైన్ చేశారు. నాకు బటన్స్‌లేని జాకెట్ ఇచ్చి వేసుకోమన్నారు. ఆ తర్వాత దర్శకుడు కుషాన్ అవాంఛితమైన భంగిమలో నా కాళ్లను పైకెత్తమని అడిగాడు. అలా చేయలేనని ఎంత చెప్పినా వినలేదు. స్క్రిప్ట్‌లో లేని కొత్త సన్నివేశాల్ని అప్పటికప్పుడు సృష్టించారు. సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పక్కనే ఉన్నా ఏమాత్రం అడ్డుకోలేదు. ఈ బాధలు తట్టుకోలేక సినిమా నుంచి తప్పుకున్నా అని చిత్రాంగద వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలను దర్శకుడు కుషాన్ ఖండించాడు. చిత్రాందగ సరిగా నటించలేకపోవడం వల్లనే సినిమా నుంచి తొలగించానని వివరణ ఇచ్చాడు.

బాధ్యతతో డీల్ చేయాలి - కృతిసనన్


kriti-sanon.jpg
మీటూ ఉద్యమం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లో పోరాటం నుంచి విరమించొద్దని కథానాయిక కృతిసనన్ కోరింది. అయితే పేరు బయటపెట్టకుండా ఆరోపణలు చేసేవారి వల్ల మీటూ దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అన్యాయాలపై మాట్లాడుతున్న మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే వేధింపులకు గురైన వారు న్యాయపరంగా పోరాటం చేస్తే మంచి ఫలితాలుంటాయి. తమ ఐటెంటిటీని దాచుకోకుండా సరైన ఆధారాలతో కేసులు పెడితే విచారణకు ఆస్కారం ఉంటుంది అని చెప్పింది. ఆమె ప్రస్తుతం హౌస్‌ఫుల్ 4 చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

దోషులు శిక్షింపబడతారు-సైఫ్‌అలీఖాన్


ఇతరుల బాధల్ని, ఆవేదనను చాలా మంది అర్థంచేసుకోవడానికి ప్రయత్నించరు. 25 ఏళ్ల క్రితం వృత్తిపరంగా నేను కొన్ని వేధింపులను ఎదుర్కొన్నాను. అయితే అవి లైంగికమైనవి కాదు. కానీ ఆ ఘటనపై ఇప్పటికీ నాలో కోపం అలాగే ఉంది. వేధింపులకు పాల్పడే వారు ఏదోఒకరోజు తప్పకుండా శిక్షింపబడతారు

బాలీవుడ్ ఉమెన్ ఫిల్మ్‌మేకర్స్ మద్దతు


మీటూ ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు బాలీవుడ్ ఉమెన్ ఫిల్మ్‌మేకర్స్. నిజాయితీగా తమపై జరిగిన వేధింపులను బయటపెడుతున్నవారికి నైతికంగా అండగా నిలబడతామని చెప్పారు. మీటూ పరిశ్రమలో మహిళా హక్కుల పరిరక్షణకు, విప్లవాత్మకమైన మార్పులకు నాందిపలికిందని అభిప్రాయపడ్డారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలు సురక్షితంగా వుండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పిస్తామని వారు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి భవిష్యత్తులో పనిచేయబోమని స్పష్టం చేశారు. బాలీవుడ్ మహిళా డైరెక్టర్స్ అలంక్రిత శ్రీవాత్సవ, గౌరీషిండే, కిరణ్‌రావ్, కొంకణసేన్‌శర్మ, మేఘన గుల్జార్, నందితాదాస్, నిత్యామేహ్రా, రిమాకాగ్తీ, రుచినరైన్, షోనాలిబోస్, జోయాఅక్తర్ ఈ ప్రకటనను విడుదల చేశారు.

వైరముత్తుకు ధైర్యం ఉందా..


లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యే ధైర్యం వైరముత్తుకు ఉందా అని సవాల్ చేసింది గాయని చిన్మయి. రచయిత వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చిన్మయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. ఆ ధైర్యం నాకు ఉంది. వైరముత్తు అందుకు సిద్ధమేనా? అని నెటిజన్‌కు ఘాటుగా సమాధానమిచ్చింది చిన్మయి.

1424

More News

VIRAL NEWS