నటించడం చాలా కష్టం!


Thu,March 14, 2019 12:07 AM

Bilaspur Police Station Movie Pre Release Event

పరిటాల రవి కారణంగా శ్రీరాములయ్య చిత్రంలో చిన్న పాత్ర పోషించాను. ఆ తరువాత దర్శకుడు ప్రభాకర్ వల్ల బతుకమ్మ సినిమాలో మంచి పాత్ర చేశాను. కొంత విరామం తరువాత పూర్తిస్థాయి పాత్రలో నటించిన చిత్రం బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్. ముందు నేను ఈ సినిమాకు అవసరమా? అని దర్శకుడిని అడిగాను. వాళ్ల ఆఫీసులో స్టీవెన్ స్పీల్‌బర్గ్, శ్యామ్ బెనెగల్ వంటి ప్రముఖ దర్శకుల ఫొటోలు కనిపించడంతో వెంటనే అంగీకరించాను అన్నారు గోరెటి వెంకన్న. ఆయన నటిస్తున్న తాజా చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్నారు. నాగసాయి మాకం దర్శకుడు. మహంకాళీ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయ కారుడు, సాహితీవేత్త, నటుడు గోరెటి వెంకన్న బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

తెలంగాణ, కర్ణాటక బోర్డర్‌లో వున్న బిలాల్‌పూర్ నేపథ్యంలో సాగే అందమైన కథ ఇది. సినిమాలో సురేందర్ అనే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌గా హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపిస్తాను. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర సినిమా అంతా కనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా సాగే చిత్రమిది. నాగర్ కర్నూల్‌లో ఓ పోలీసు మిత్రుడు వుండేవాడు. తను, నేను రంగస్థల కళాకారులం. ఇద్దరం నాటకాలు వేసేవాళ్లం. ఎంత పోలీసు హెడ్ కానిస్టేబుల్ అయినా చిన్న పిల్లలు భయపెట్టినా భయపడేవాడు. సినిమాలో నాకు తెలియకుండానే అతన్ని అనుకరించానేమో అనిపించింది. భయపడుతూనే హాస్యాన్ని పండించే పాత్రలో నటించాను. అరుణయ్య, నాగశేషయ్య అనే ఇద్దరు మిత్రులు వుండే వాళ్లు. వాళ్లది సున్నితమైన మనస్తత్వం. వాళ్లను ఊహించుకుని ఈ సినిమాలోని పాత్రను రక్తికట్టించే ప్రయత్నం చేశాను. దర్శకుడు నాగసాయి మాకం కొత్త పంథాలో రూపొందించిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది.

ఏ పాట రాసినా..

ఏ పాట రాసినా అందులో వున్న బాధని, ఆనందాన్ని ముందు నేను ఆకలింపుచేసుకున్న తరువాతే రాయడానికి ప్రయత్నిస్తాను. పాటలు రాసే సమయంలో ఎలాగైతే ఆలోచించి చేస్తానో అదే తరహాలో ఈ సినిమాలో చేసిన పాత్రని సహానుభూతి పొంది నటించాను. బతుకమ్మ సమయంలో నాకు నటన అంటే ఏమిటో తెలియదు. ఇటీవల చనిపోయిన దీక్షితులుగారు ఆ సమయంలో నాకు మూడు రోజుల పాటు శిక్షణనిచ్చారు. అది ఈ సినిమాకు ఉపయోగపడింది. ఈ సినిమాలో నటించిన తరువాత పాటలు రాయడం కంటే నటించడమే చాలా కష్టంగా అనిపించింది. సినిమాల కంటే రంగస్థలం అంటేనే ఎక్కువ ఆసక్తి. ఎక్కడ నాటకాలు జరుగుతున్నా అక్కడ వాలిపోతాను. సినిమా రంగంలో నేను ఎక్కువ చిత్రాలకు పనిచేయకపోవడానికి కారణం నేను అందుబాటులో వుండకపోవడమే. ఇకపై నేను కావాలని వచ్చిన వాళ్లకు తప్పకుండా అందుబాటులో వుంటా. ప్రస్తుతం దొరసాని, ఆర్. నారాయణమూర్తి రూపొందిస్తున్న మార్కెట్‌లో ప్రజాస్వామ్యం మల్లేశం చిత్రాలకు పాటలు రాశాను.

1829

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles