పోలీస్ సాదకబాధకాలు

Sun,March 10, 2019 11:45 PM

సహజత్వానికి దగ్గరగా సాగే రియలిస్టిక్ చిత్రమిది. ప్రతి సన్నివేశం పల్లెటూరిలో విహరించిన అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు నాగసాయి మాకం. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘన జంటగా నటించారు. మహంకాళి శ్రీనివాస్ నిర్మాత. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు నాగసాయి ముచ్చటించారు.

మహబూబ్‌నగర్‌లోని ఆత్మకూరు నా స్వస్థలం. సత్యజీత్‌రే, శ్యామ్‌బెనగల్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వారి శైలిలో పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాను. పోలీస్ వృత్తిలోని సాదకబాధకాలు, కేసులను పరిష్కరించే క్రమంలో వారికి ఎదురయ్యే సంఘర్షణను ఆధారంగా చేసుకొని వినోదప్రధానంగా నేను, నిర్మాత మహంకాళి శ్రీనివాస్ కలిసి ఏడాదిన్నర పాటు పరిశోధించి ఈ కథ రాసుకున్నాం. పోలీస్ ఉద్యోగం కోసం పల్లెటూరిలో అడుగుపెట్టిన ఓ ఎస్‌ఐకి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తన ఊహలకు భిన్నమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆకట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. వినోదం, సస్పెన్స్, థ్రిల్లర్ హంగులతో పాటు అంతర్లీనంగా కథలో చక్కటి సందేశం మిళితమై ఉంటుంది.

తెలంగాణ సంస్కృతితో..

హెడ్‌కానిస్టేబుల్‌గా గోరటి వెంకన్న పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిజజీవితంలోని మానవ సంబంధాల్ని ప్రతిబింబిస్తూ వాస్తవికతకు దగ్గరగా ఆయన పాత్రను తీర్చిదిద్దాం. నవ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు నూతన తారాగణం అయితేనే న్యాయం చేయగలరని మాగంటి శ్రీనాథ్, సాన్వీమేఘనలను నాయకానాయికలుగా తీసుకున్నాం. స్వతహాగా రంగస్థల కళాకారులు కావడంతో వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తెలంగాణ సంస్కృతికి, ఆచారవ్యవహరాలు, భాష, యాసలకు ఈ సినిమాలో ప్రాముఖ్యతనిచ్చాం. సంభాషణలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాడుక పదాలను తీసుకొని రాశాం. అవన్నీ కొత్త అనుభూతిని పంచుతాయి. ఇప్పటివరకు ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరించాం. పోలీసు జీవితాలపై సుద్దాల అశోక్‌తేజ రాసిన పాటతో పాటు మిగతా గీతాలన్నింటికి చక్కటి స్పందన లభిస్తున్నది. దర్శకుడు ఎన్.శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి మంచి ప్రయత్నమని అభినందించారు. తదుపరి సినిమా కోసం యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఓ కథను సిద్ధంచేసుకున్నాను స్టార్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను.

521

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles