అలాంటి భయాలు నిర్మాతల్లో పోవాలి


Tue,September 11, 2018 03:25 AM

Bhumika Chawla at U Turn Interview

ఖుషీ, ఒక్కడు, సింహాద్రి, మిస్సమ్మతో పాటు పలు విజయవంతమైన చిత్రాలతో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది భూమిక. కమర్షియల్ సినిమాలతో పాటు మహిళా ప్రధాన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నది. సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్‌సీఏ సినిమాతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారామె. భూమిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యూటర్న్. సమంత కథానాయిక. పవన్‌కుమార్ దర్శకుడు.ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాలతో పాటు తన సినీ ప్రయాణం గురించి భూమిక పాత్రికేయులతో పంచుకున్న విశేషాలివి..

యూ టర్న్ అంగీకరించడానికి కారణమేమిటి?

ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. ఇందులో నటనకు ఆస్కారమున్న ఓ విభిన్నమైన పాత్రను కనిపిస్తాను. ఇదివరకు ఎప్పుడూ చేయని కొత్త తరహా క్యారెక్టర్ ఇది. పాత్రలు, కథాంశాల పరంగా చేసే ప్రతి సినిమాలో వైవిధ్యత ఉండాలి. అప్పుడే నటీనటులకు సంతృప్తి దొరుకుతుంది. అలాంటి అనుభూతిని నాకు పంచిన సినిమా ఇది.

మాతృకతో పోలిస్తే ఇందులో మీ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి? ఏమైనా మార్పులు చేర్పులు చేశారా?

మాతృకలోని పాత్రతో పోలిస్తే తెలుగులో నేను చేసిన క్యారెక్టర్ కొంత భిన్నంగా సాగుతుంది. నిడివి ఎక్కువగా ఉంటుంది. పాత్ర ఏదైనా నా పరిధుల మేర దానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నారో వందశాతం అందివ్వడానికి కృషిచేస్తాను. మిగతా వాటి గురించి ఆలోచించను.

ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు?

నటనాపరంగా ప్రతి సినిమా ద్వారా మనలో ఐదు శాతమైనా పరిణితి కనిపించాలి. ఒకేసారి గణనీయమైన మార్పులు ఎవరిలో కనిపించవు. అది సాధ్యం కాదు. ఈ సినిమా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకముంది. కొత్తదనంతో కూడిన ఈ పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని ఆసక్తి ఎదురుచూస్తున్నాను.

హారర్ థ్రిల్లర్ మీ ఫేవరేట్ జోనరా?

థ్రిల్లర్ సినిమాలు నచ్చుతాయి. కానీ హారర్ సినిమాలు చేయడానికి ఇష్టపడను. వాటిని చూడను కూడా.

సమంతతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

సమంత మంచి నటి. చిన్న చిన్న హావభావాల్ని సైతం అద్భుతంగా పండిస్తుంది. అదే ఆమెలో నాకు నచ్చే క్వాలిటీ. ఆమె నటించిన ఈగ, రంగస్థలం సినిమాలు చూశాను. అందులో ఆమె నటన చాలా బాగుంది. ఈ సినిమాలో తన నటనతో అందరికి ఆకట్టుకుంటుందనే నమ్మకముంది

సినిమా అంగీకరించే ముందు పాత్ర నిడివి గురించి ఆలోచిస్తుంటారా?

భాగ్‌మిల్కా భాగ్‌లో దివ్యాదత్తా కనిపించేది కొద్ది క్షణాలే ఆయిన ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సినిమా నుంచి బయటకు వచ్చినా కూడా ఆ పాత్ర ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. అలాంటి పాత్రలు చేయాలనుంది. కథతో పాటు పాత్రకున్న ప్రాముఖ్యత నచ్చితే సినిమాలో నా పాత్ర నిడివి ఎంత ఉందన్నది ఆలోచించను.

దక్షిణాదిలో కథానాయికల కోసం శక్తివంతమైన పాత్రల్ని సృష్టించే ధోరణి కొంత తక్కువేనని చెప్పవచ్చు. ఆ పంథాలో మార్పులు వస్తున్నాయని అనుకుంటున్నారా?

మహిళా ప్రధాన చిత్రాల పరంగా దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే మార్పులొస్తున్నాయి. మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్‌లో చూసుకుంటే పెళ్లయిన తర్వాత కూడా తుమ్హారీ సులు లాంటి చిత్రాలతో విద్యాబాలన్ ప్రతిభను చాటుకుంటున్నది. అలాంటి ప్రయత్నాలు తెలుగులో తక్కువే. ముఖ్యంగా 30-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న కథానాయికల్ని దృష్టిలో పెట్టుకొని మంచి కథల్ని సృష్టించడంపై దృష్టిసారించాలి.

గతంలో మీరు ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మంచి కథ దొరికితే మహిళా ప్రధాన కథాంశంతో సినిమాల్ని నిర్మించే ఆలోచన ఉందా?

సొంత సంస్థ ద్వారా కమర్షియల్ విలువలతో కూడిన అర్థవంతమైన సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. అలాంటి కథలు దొరికితే మళ్లీ సినిమాలు నిర్మిస్తాను.

జయాపజయాల్ని మీరు ఎలా స్వీకరిస్తారు?

జయాపజయాల ప్రభావం నాపై ఎప్పుడూ పెద్దగా పడలేదు. స్టార్‌ననే భావనలేకుండా సింపుల్‌గా ఉండటమే అందుకు కారణం. అమ్మానాన్నల నుంచే ఆ లక్షణం అలవడింది. అలాగే భిన్న భాషల్లో సినిమాలు చేయడం కూడా చాలావరకు కలిసొచ్చింది. తెలుగులో ఓ సినిమా చేసి వెంటనే బాలీవుడ్ వెళ్లిపోయేదాన్ని. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ ఓ సినిమా..నా ప్రయాణం మొత్తం ఇలాగే సాగింది. ఏ భాషలో పూర్తిగా స్థిరపడలేదు. అలాగే సోషల్‌మీడియా ప్రభావం ఆ రోజుల్లో అంతగా లేకపోవడం వల్ల పరాజయాలు ఉన్నా వాటిని తొందరగా ప్రేక్షకులు మర్చిపోయారు.

తదుపరి సినిమాలేమిటి?

తెలుగులో సవ్యసాచిలో కీలక పాత్రను పోషిస్తున్నాను. అలాగే బాలీవుడ్‌లో ఖామోషీతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. మూసధోరణితో కూడిన పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలు చేయాలన్నదే నా అభిమతం.

సాధారణంగా సినిమా అనేది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. మహిళా ప్రధానచిత్రాల వల్ల డబ్బులు వస్తోయో? రావో? అన్నభయం నిర్మాతల్లో ఉంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్ని చూడరనే అపోహ ఉంది. ఆ భయాలన్నీ పోయిన రోజే మంచి కథాంశాలతో కూడిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయి. లాభనష్టాలను గురించి ఆలోచించకుండా నిజాయితీగా ఈ తరహా సినిమాలు చేయాలి.

2638

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles