ధైర్యంగా మాట్లాడుతున్నా!


Tue,August 6, 2019 12:53 AM

Bellamkonda Suresh Press Meet about Bellamkonda Sai Srinivas and Rakshasudu Movie Success

మా అబ్బాయి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది. పరిణితితో కూడిన అద్భుతమైన అభినయాన్ని కనబరచగలడని ఈ సినిమా నిరూపించింది అని అన్నారు బెల్లంకొండ సురేష్. ఆయన తనయుడు సాయిశ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో బెల్లంకొండ సురేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

ఐదేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాల్లో నటించాడు సాయిశ్రీనివాస్. తొలి సినిమా అల్లుడుశీను అగ్ర హీరోల చిత్రాల స్థాయిలో మంచి వసూళ్లను సాధించింది. మాస్, కమర్షియల్ హంగులతో దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 34 కోట్ల షేర్‌ను సాధించింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన జయజానకి నాయక మంచి విజయాన్ని సాధించింది. గతంలో అతడు చేసిన సినిమాలన్నీ దర్శకులకు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుతీసుకొచ్చాయి. కానీ రాక్షసుడు సినిమా సాయిశ్రీనివాస్‌ను మంచి నటుడిగా నిరూపించింది. వసూళ్లు బాగున్నాయి. ఫైట్స్, డ్యాన్స్, రొమాన్స్ లేకుండా భావోద్వేగాలు, సందేశంతో కూడిన సినిమా ఇది. ఇలాంటి అరుదైన కథ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ప్రారంభించే సమయంలో శ్రీనివాస్ బలమే డ్యాన్సులు, ఫైట్లు. అవి లేకుండా సినిమా చేసి అతడి భవిష్యత్తును పాడు చేయొద్దని చాలా మంది అన్నారు. నటుడిగా శ్రీనివాస్‌కు పేరుతెచ్చే సినిమా అవుతుందని బలంగా నమ్మాను. అదే నిజమైంది. మా అబ్బాయితో మంచి సినిమాను నిర్మించిన నిర్మాత కోనేరు సత్యనారాయణకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

ఈ సినిమాలకు మించి ఆనందాన్ని..

నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. 21 ఏళ్లుగా సినిమాల్ని నిర్మిస్తున్నాను. ఈ ప్రయాణంలో ఇరవై ఐదు స్ట్రెయిట్ సినిమాల్ని నిర్మించాను. ఎనిమిది డబ్బింగ్ చిత్రాల్ని విడుదలచేశాను. మరో ఎనిమిది చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాను. వాటన్నింటికి మంచిన ఆనందాన్ని రాక్షసుడు సినిమా ఇచ్చింది. శ్రీనివాస్ ఇప్పటివరకు నటించిన ఆరు సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా ఒకఎత్తుగా నిలిచింది. ఓవర్‌సీస్‌లో మంచి ఆదరణ లభిస్తున్నది. శనివారం రోజు 95 శాతం అక్యూపెన్సీ ఉంటే ఆదివారం రోజు 100 శాతానికి పెరిగింది.

ఆ ధైర్యాన్నిచ్చాయి..

అల్లుడుశీను, జయజానకి నాయక చిత్రాలు శ్రీనివాస్‌కు విజయాల్ని అందించాయి. స్పీడున్నోడు, కవచం, సీత చిత్రాలు పరాజయాలుగా నిలిచిన మంచి రెవెన్యూను సాధించాయి. హిందీలో అనువాదమైన దక్షిణాది హీరోల సినిమాల్లో అత్యధిక మంది యూట్యూబ్‌లో వీక్షించిన వాటిలో సాయిశ్రీనివాస్ సినిమాలే ఉన్నాయి. స్పీడున్నోడు 200 మిలియన్లు, జయజానకి నాయక 140 మిలియన్లు, కవచం 120 మిలియన్లపైగా ప్రేక్షకులు యూట్యూబ్‌లో వీక్షించారు. శాటిలైట్ హక్కులు, టీఆర్‌పీ రేటింగ్స్‌తో అద్భుతమైన విజయాల్ని సాధించాయి. మేము చేసింది మంచి సినిమాలే అనే ధైర్యాన్నిచ్చాయి.

ఐదేళ్ల తర్వాత

నేను వేదికలపై సినిమాల గురించి మాట్లాడి ఐదేళ్లయ్యింది. విడుదలకు ముందు రోజు రాక్షసుడు సినిమా చూశాను. గ్యారెంటీ హిట్ అనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నిజమైంది కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

వచ్చే ఏడాది బాలీవుడ్‌లో..

మా అబ్బాయితో బాలీవుడ్‌లో ఓ స్ట్రెయిట్ సినిమా చేస్తామని పెద్ద నిర్మాణ సంస్థ సంప్రదించింది. తెలుగులో హిట్టయిన ఓ సినిమాను హిందీలో మా అబ్బాయితో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాను. మా సంస్థలోనే వచ్చే ఏడాది ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం శ్రీనివాస్ కోసం కథలు వింటున్నాను. కథాబలంతో కూడిన మంచి సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచనలో ఉన్నాం. శ్రీనివాస్‌తో తదుపరి సినిమా బాధ్యతను దిల్‌రాజుకు అప్పగించాను. లాభాలను తెచ్చి పెట్టే మంచి కథ దొరికితే రీమేక్ సినిమా చేయడానికి అభ్యంతరం లేదు.

523

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles