సినిమా చూసి అమ్మ ఏడ్చింది!


Wed,May 22, 2019 11:30 PM

bellamkonda sreenivas kajals sita release on may 24th

దర్శకుడు తేజ రెండు కథలు చెప్పారు.అందులో మొదటి కథ సీత నాకు బాగా నచ్చింది. అయితే నాన్నకు రెండవ కథ నచ్చింది. నన్ను భారీ స్థాయిలో నాన్న చూడాలనుకున్నారు. అయితే నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ కథ ఉపయోగపడుతుందని బలంగా విశ్వసించాను. అందుకే తొలిసారి నాన్నకు నచ్చిన కథని పక్కన పెట్టి సీత చేశాను అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం సీత. తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

నా గత చిత్రాలతో పోలిస్తే సీత చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు తేజ కథ చెప్పగానే థ్రిల్ ఫీలయ్యాను. సినిమాలో నా పాత్ర పేరు రఘురామ్. 20 ఏళ్లు కల్మషం లేని మనుషుల మధ్య పెరిగిన రఘురామ్ జనారణ్యంలోకి వస్తాడు. జీవితంలోని ప్రతీ క్షణాన్ని స్వాదించాలనుకునే అతనికి, జీవితం అంటేనే డబ్బు మయం డబ్బుంటే అన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయనే సీతకి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది?. డబ్బే సర్వస్వం అనుకున్న సీతని రఘురామ్ ఎలా మార్చాడు అన్నదే ఇందులో ఆసక్తికరం. సినిమాలో నా పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. అల్లుడు శీను చిత్రం తరువాత ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన పాత్రలో నటించాను.

తొలి రోజు పరీక్షపెట్టారు..

ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో ఒకే సారి పేజీ డైలాగ్‌లు నేను ఏ సినిమాలో చెప్పలేదు. కానీ ఈ సినిమా చిత్రీకరణ తొలి రోజునే పేజీ డైలాగ్‌లు చేతికిచ్చి నాకు నటన తెలుసా లేదా అని దర్శకుడు తేజ పెద్ద పరీక్ష పెట్టారు. ఆ డైలాగ్‌లు చూసి ముందు షాకయ్యాను. ఆ తరువాత నన్ను పరీక్ష పెడుతున్నారని తెలిసి కారవాన్‌లోకి వెళ్లి రిహార్సల్ చేశాను. పక్కాగా చేయగలను అనుకున్నాక వచ్చి వెంటనే ఆయనకు పేజీ డైలాగ్‌లు చెప్పేశాను. దీంతో షాకైన తేజ కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నావు. పేజీ డైలాగ్‌లు చెప్పగలవా లేదా అనుకున్నాను. కానీ నా అనుమానం నిజం కాదని నిరూపించావన్నారు.

ఆ టైటిల్ నేనే పెట్టమన్నాను..

ఈ కథకు సీత టైటిల్ కరెక్ట్. అందుకే ఆ పేరు పెట్టమన్నాను. అలా ఎందుకు చెప్పారని కొంత మంది అన్నారు. కొంత మంది మాత్రం ఫోన్ చేసి అభినందించారు. సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుంది. దర్శకుడు తేజ కథ చెప్పినప్పుడే కథానాయిక కాజల్ అని చెప్పారు. ఆమె చేసింది కాబట్టే సినిమా బాగా వచ్చింది. ఆమె అనుభవం కూడా ఈ సినిమాకు పనికొచ్చింది. కాంబోడియాలో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని అమ్మ, తమ్ముడు చూశారు. సినిమా చూసి అమ్మ ఏడ్చేసింది. నా పాత్రకు అమ్మ అంత బాగా కనెక్ట్ అయ్యారు.

హిందీ మార్కెట్ పెరిగింది..

నాకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం అంటే చాలా ఇష్టం. తొలిసారి కవచంలో పోలీస్ పాత్రలో నటించాను. భారీ అంచనాలు పెట్ట్టుకున్న ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఆ సమయంలో తమిళ హిట్ చిత్రం రాట్చసన్ చూశాను. నాకు బాగా నచ్చింది. అందుకే తెలుగులో రీమేక్ చేస్తున్నాం. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దేవుడి దయవల్ల హిందీలో నా చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అందు కోసం సినిమాలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2064

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles