పారితోషికం తీసుకోకుండా నటించా

Thu,October 3, 2019 12:16 AM

‘నటుడిగా మూసధోరణితో కూడిన పాత్రలకు పరిమితమవ్వడం నచ్చదు. వైవిధ్యతను నమ్మి సినిమాల్ని అంగీకరిస్తాను. పారితోషికాన్ని పట్టించుకోను. ఉచితంగా నటించిన సందర్భాలున్నాయి’ అని అన్నారు అవసరాల శ్రీనివాస్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’.బాలాజీ సానల దర్శకుడు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 5న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో అవసరాల శ్రీనివాస్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.


కుటుంబ విలువలతో తెరకెక్కిన చక్కటి చిత్రమిది. సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చే రెండు జంటల జీవన గమనానికి దృశ్యరూపంగా ఉంటుంది. ఇందులో తమిళ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాను. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ పల్లెటూరి వస్తాను. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది. పెళ్లి అనేది వ్యక్తిగత ఆసక్తులతో పాటు కుటుంబం, ఊరి అభిప్రాయాల్ని గౌరవించేలా ఉండాలని ఈ చిత్రం చాటిచెబుతుంది. సున్నితమైన అంశానికి వినోదం, ప్రేమ, సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు బాలాజీ సినిమాను రూపొందించారు.

పులిమీద స్వారీనే

సినిమాలో నా పాత్ర చిన్నదా, నిడివి ఎక్కువగా ఉంటుందా అని ఎప్పుడూ ఆలోచించను. ఆ క్యారెక్టర్‌ నన్ను సినీ పరిశ్రమలో మనగలిగేలా చేస్తుందా, ప్రాముఖ్యత ఉందా అనే అంశాలను బేరీజు వేసుకుంటూ సినిమాల్ని అంగీకరిస్తాను.నటుడిగా వరుసగా అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం అంటే పులిమీద స్వారీ లాంటిదే. అలాగని దర్శకుడిగా విరామం లేకుండా సినిమాలు చేయడం కుదరదు. ఆ ఒత్తిడులు ఉండకూడదనే నటన, దర్శకత్వం రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. నటీనటులందరికి రచనాపరిజ్ఞానం కొంతైనా ఉండాలని నేను విశ్వసిస్తాను. ఫిలిం మేకింగ్‌ కోర్సులో అదే నేను నేర్చుకున్నాను. హిందీలో కంగనా రనౌత్‌తో పాటు పలువురు తారలకు స్క్రిప్ట్‌రైటింగ్‌పై మంచి పట్టు ఉండటంతో పాత్రల్లో సులువుగా ఒదిగిపోతుంటారు. కథను ఎంపికచేసుకునేవారకే ఆ నాలెడ్జ్‌ వాడాలి. ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత అందులో జోక్యం చేసుకోకూడదు.

ఇండియా..అమెరికా..

ప్రస్తుతం దర్శకుడిగా ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ సినిమా చేస్తున్నాను. నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా నటిస్తున్నారు. పద్దెనిమిదేళ్ల వయసు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వరకు ఓ జంట జీవితంలో జరిగే సంఘటనల సమాహారంగా సాగుతుంది.సగం సినిమా ఇండియాలో, సగం అమెరికాలో ఉంటుంది. ఇండియా టాకీపార్ట్‌ పూర్తిచేశాం. వర్క్‌వీసాలు లభించకపోవడంతో అమెరికా ఎపిసోడ్‌ ఆలస్యమైంది. డిసెంబర్‌లో తిరిగి షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాం ప్రస్తుతం మరో కథను సిద్ధం చేస్తున్నాను. దర్శకుడిగా నానితో ఓ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.నాని శైలికి తగ్గ కథ రాసిన తర్వాత సినిమాపై నిర్ణయానికి వస్తాం.

1040

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles