యువరాణిగా నటించాలనివుంది!


Sun,July 16, 2017 11:13 PM

వైశాఖం చిత్రంలో భానుమతి అనే ఆధునిక భావాలున్న అమ్మాయిగా నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది అని చెప్పింది అవంతిక. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం వైశాఖం. ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏరాజు నిర్మిస్తున్నారు. బి.జయ దర్శకురాలు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో అవంతిక పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి....
Avanthika
ఢిల్లీలో పుట్టాను. నాన్న ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కావడంతో దేశంలోని చాలా ప్రాంతాలతో అనుబంధముంది. నాన్న బాటలోనే ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్ కావాలనుకున్నాను. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాను. కానీ అనుకోకుండా సినిమాలతో ప్రేమలో పడిపోయా. నటన పట్ల ఉన్న ఇష్టంతో చిత్రసీమలో అడుగుపెట్టాను. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నీలకంఠ దర్శకత్వం వహించిన మాయ సినిమాలో అవకాశం వచ్చింది. చదువుకు ఇబ్బంది కలగకూడదని వేసవి సెలవుల్లో ఆ సినిమా చేశాను.

కూతురిలా చూసుకున్నారు...


నా ఫొటోలు చూసిన దర్శకురాలు జయ ఆడిషన్ చేసి సినిమాలో అవకాశమిచ్చారు. ఇందులో నా పాత్ర పేరు భానుమతి. పట్టణ సంస్కృతిలో పెరిగినా కుటుంబ బంధాలకు విలువనిచ్చే యువతిగా కనిపిస్తాను. తెలుగుదనాన్ని అమితంగా ప్రేమించే అమ్మాయిగా వినూత్నంగా నా పాత్ర ఉంటుంది. అలాంటి అమ్మాయి జీవితం ఓ అబ్బాయి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిని పంచుతుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ పాటలు, గ్లామర్ సన్నివేశాలకే పరిమితమవుతారు. కానీ ఈ సినిమా కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. దర్శకురాలు జయ నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. వారు నాపై చూపించిన ప్రేమ నేను బాగా నటించడానికి కారణమైంది.

ఆరు డిగ్రీల చలిలో...


శాస్త్రీయ సంగీతంతో పోలిస్తే సినిమాల్లో చేసే డ్యాన్సులు భిన్నంగా ఉంటాయి. డ్యాన్స్‌ల విషయంలో సినిమాలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓ పాటలో ఖజకిస్థాన్‌లో మైనస్ ఆరు డిగ్రీల చలిలో షూటింగ్ చేశాం. అలాంటి మరపురాని అనుభవాలు చాలా ఉన్నాయి. కథకు అవసరమైతే గ్లామర్ పాత్రల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా దృష్టిలో గ్లామర్ అనేది వేసుకునే దుస్తుల్లో ఉండదు. చీరలు, సల్వార్ కమీజ్‌లలో కూడా అందంగా కనిపించవచ్చని నమ్ముతాను. .

రాజమౌళికి అభిమానిని...


నటుల కంటే పాత్రలు, కథల నుంచి ఎక్కువ స్ఫూర్తి పొందుతాను. దర్శకుల ప్రతిభకే ఎక్కువ విలువనిస్తాను. రాజమౌళి నా అభిమాన దర్శకుడు. బాహుబలి చిత్రం బాగా నచ్చింది. జానపద చిత్రాల్లో నటించాలని ఉంది. పోరాటయోధురాలైన యువరాణి తరహా పాత్రల్లో నటించాలనేది నా కల. ప్రస్తుతం తమిళంలో అశోక్ సెల్వన్‌తో కలిసి నెంజమెల్ల కాదల్ సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి

644

More News

VIRAL NEWS