మాస్‌ ఇమేజ్‌ను తీసుకొస్తుంది!

Sun,October 13, 2019 12:15 AM

‘రాజుగారి గది-3’ చిత్రం ఆద్యంతం వినోదప్రధానంగా అలరిస్తుంది. నా పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది.ఏ తరహా ఇతివృత్తాన్ని ఎంచుకున్నా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే నా లక్ష్యం’ అన్నారు అశ్విన్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజుగారి గది-3’. ఓంకార్‌ దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా అశ్విన్‌బాబు పాత్రికేయులతో ముచ్చటించారు.


‘రాజుగారి గది-2’ సినిమాకు నాగార్జున, సమంత వంటి పెద్దస్టార్స్‌ ఇమేజ్‌ తోడయింది. నేను ఆ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావించాను. అయితే పార్ట్‌-2లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఏ సినిమాలో అయినా వినోదాన్ని కోరుకుంటున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ హాస్యభరితంగా ‘రాజుగారి గది-2’ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఇందులో కామెడీతో పాటు హారర్‌ అంశాలుంటాయి. రెండోభాగంలో స్టార్స్‌ ఉన్నారు కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మూడోభాగం విషయంలో పూర్తిగా కథపై విశ్వాసంతో ప్రేక్షకులముందుకొస్తున్నాం. భయంగొలిపే సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు నవ్వుల్ని పంచుతాయి. ఈ సినిమాలో నేను మాస్‌ పాత్రలో కనిపిస్తాను. కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ క్యారెక్టర్‌ చేయడం సవాలుగా తీసుకున్నా. ఈ సినిమా నాకు మాస్‌ ఇమేజ్‌ను తీసుకొస్తుందని నమ్ముతున్నాను.

ఎలాంటి సందేశాలు ఉండవు..

తొలి రెండు భాగాల్లో సందేశం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఎలాంటి సందేశాల్ని ఇవ్వలేదు. రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తుంది. తొలిభాగంలో మెడికల్‌ మాఫియా, రెండో భాగంలో మహిళల మధ్య ఇగో సమస్యల్ని చూపించాం. మూడోభాగంలో మాత్రం పూర్తిగా వినోదం మీదనే దృష్టిపెట్టాం. తొలుత ఈ సినిమాలో తమన్నాను కథానాయికగా తీసుకున్నాం. డేట్స్‌ సర్దుబాటు కాని కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకుంది. దాంతో అవికాగోర్‌ను నాయికగా తీసుకున్నాం. చాలా రోజుల తర్వాత ఆమె తెలుగులో రీఎంట్రీ ఇస్తూ అభినయప్రధాన పాత్రలో నటించింది.

నిర్మాత కష్టాలు తెలుసు..

సినిమాలో నాది మాస్‌ పాత్ర కాబట్టి క్యారక్టరైజేషన్‌ విషయంలో చిరంజీవి, రవితేజ వంటి హీరోల్ని ఫాలో అయ్యాను. ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకున్నాను కాబట్టి నాకు నిర్మాతల కష్టాలపై పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం కొన్ని సబ్జెక్ట్స్‌ వింటున్నాను. ‘గోదా’ అనే మళయాల చిత్రం రీమేక్‌ కథ విన్నాను. కుస్తీ నేపథ్యంలో నడిచే ఆ కథ బాగా నచ్చింది. ఈ సినిమాపై త్వరలో నిర్ణయం తీసుకుంటా. వినోదం మిస్‌ కాకుండా సినిమాలు చేయాలన్నదే నటుడిగా నేను నమ్మే సిద్ధాంతం.

443

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles