రజనీ అభిమానులకు పండగే!

Mon,January 7, 2019 11:05 PM

కేసీఆర్ డైనమిక్ లీడర్. ప్రజల అభిమానంతో రెండోసారి తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. థియేటర్ల మాఫియాను అరికట్టి నిర్మాతలకు ఓ మంచి పరిష్కారాన్ని చూపించాలని ఆయన్ని కోరుతున్నాం అని అన్నారు నిర్మాత అశోక్ వల్లభనేని. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం పేట్ట. కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు. ఈ చిత్రాన్ని పేట పేరుతో నిర్మాత అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ సేతుపతి, శశికుమార్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సిమ్రన్, త్రిష కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడుతూ థియేటర్ల కేటాయింపులో ఎంతో మంది ఇబ్బందులు పెడుతున్నారు.

వందలాది థియేటర్లలో తమ సినిమాలను విడుదలచేస్తున్నారు. మంచి సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. ప్రస్తుతం సామాన్యుడికి సినిమానే ప్రధాన వినోద సాధనంగా ఉంది. అయితే థియేటర్ల మాఫియా కారణంగా ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు చూడలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలి. ప్రత్యామ్నాయాల్ని చూపించాలి. మిగతా సినిమాలతో పోలిస్తే నా చిత్రానికి కేటాయించిన థియేటర్ల సంఖ్యను చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంది. థియేటర్లు, బిజినెస్ లెక్కల గురించి పట్టించుకోకుండా రిస్క్ తీసుకొని సొంతంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాను అన్నారు. సినిమా కళకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవని రజనీకాంత్ నిరూపించారు. చరిత్రను సృష్టించారు.

సినిమా బాగుంటే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని ప్రసన్నకుమార్ చెప్పారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు మాట్లాడుతూ మా అందరికి కలల సినిమా ఇది. కుటుంబ బంధాలతో ముడిపడి శక్తివంతంగా సాగుతుంది. రజనీకాంత్ అభిమానులకు పండుగలా ఉంటుంది అని తెలిపారు. రజనీకాంత్ అభిమానుల్ని అలరించేలా కార్తిక్ సుబ్బరాజు జనరంజకంగా ఈ సినిమాను తెరకెక్కించారని సంగీత దర్శకుడు అనిరుధ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబికాకృష్ణ, రామజోగయ్యశాస్త్రి, బాబీసింహా, మేఘా ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

2090

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles