ఒప్పించాలంటే..మెప్పించాలి!


Sun,February 11, 2018 11:20 PM

Anushka in Bhaagamathie Nayanthara in Viswasam How South film actresses are redefining heroine s role

మన చిత్రసీమ మొత్తం కథానాయకుల చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. పారితోషికాలుమొదలుకొని వసూళ్ల వరకు వాణిజ్య లెక్కలన్నీ వారి చుట్టూనే కేంద్రీకృతమై ఉంటాయి. అయితేఇటీవలకాలంలో దక్షిణాది చిత్రసీమలో గణనీయమైన మార్పులొస్తున్నాయి. హీరోలతో సమానంగా నాయిక ప్రధాన చిత్రాల రూపకల్పన జరుగుతున్నది. కమర్షియల్ సినిమాల్లో కూడా కథానాయికల కోసం బలమైన పాత్రల్ని సృష్టిస్తున్నారు. దీంతో చక్కటి పతిభాసంపత్తులు కలిగిన నాయికల డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.

రెమ్యునరేషన్‌లు, నిర్మాణ సంస్థల పేరుప్రతిష్టలకు అతీతంగా సదరు నాయికలు కథాంశాల్లోని నవ్యతకు, తమ పాత్ర చిత్రణలోని వైవిధ్యానికే ప్రాధాన్యతనిస్తూ సినిమాల్ని ఎంపికచేసుకుంటారు. ప్రయోగాలు కొన్ని సందర్భాల్లో జనాదరణ పొందలేకపోయినా తమలోని నట జిజ్ఞాసను సంతృప్తిపరచుకునేందుకు వినూత్న కథలకే సై అంటున్నారు. ఈ కథానాయికల్ని ఒప్పించాలంటే మంచి కథతో వారి మనసుల్ని గెలవాల్సిందే . అలా సాధారణ సినీ సమీకరణాలకు అతీతంగా తమ కెరీర్‌లో దూసుకుపోతున్న నాయికల మీద ప్రత్యేక కథనం..

Anushka
అనుష్క: ఈ బెంగళూరు సోయగం తొలుత గ్లామర్ నాయికగానే ప్రేక్షకులకు చేరువైంది. అరుంధతి ఆమె సినీ గమనాన్నే మార్చివేసింది. జేజమ్మగా తిరుగులేని అభినయంతో సినీ ప్రియులహృదయాల్ని గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి కథాంశాల ఎంపికలో అనుష్క ప్రాధామ్యాలు పూర్తిగా మారిపోయాయి. ఓ వైపు వాణిజ్య చిత్రాలు చేస్తూనే వేదం నాగవల్లి వంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రల్లో అలరించింది. బాహుబలి సిరీస్ చిత్రాలు అనుష్కను జాతీయస్థాయి తారగా నిలబెట్టాయి. దేవసేనగా ఆమె అసమాన అభినయం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. రుద్రమదేవి చిత్రంలో కాకతీయసామ్రాజ్ఞిగా అత్యంత శక్తివంతమైన పాత్రలో రాణించింది. సైజ్ జీరో చిత్రం నటిగా అనుష్కలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా వచ్చిన కీర్తిప్రతిష్టల్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్న అనుష్క సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇటీవలే విడుదలైన భాగమతి చిత్రం యాభైకోట్ల వసూళ్లను సాధించి అనుష్క కమర్షియల్ స్టామినా ఏమిటో నిరూపించింది. ఓ కథానాయిక చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే ప్రథమమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అనుష్కతో సినిమా అంటే ఓ అగ్ర కథానాయకుడితో సినిమా చేసినట్టేననే భావన దక్షిణాది పరిశ్రమలో నెలకొంది. భాగమతి తర్వాత మరే చిత్రానికి అంగీకరించలేదు అనుష్క. ఆమె ఇమేజ్‌కు అనుగుణమైన కథలతో దర్శకనిర్మాతలు సంప్రదిస్తేనే సినిమాల గురించి ఆలోచిస్తాననే భావనలో అనుష్క వుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
nayanatara
నయనతార: ప్రస్తుతం దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు నయనతారే. గత కొన్నేళ్లుగా ప్రధాన స్రవంతి కథానాయిక చిత్రాలకు దూరంగా వుంటోందామె. కేవలం నాయిక ప్రధాన చిత్రాలకే ఓకే చెబుతున్నది. తమిళంలో మాయ అరమ్ డోరా..మలయాళంలో పుథియ నియమం, తెలుగులో అనామిక వంటి చిత్రాలు నయనతార ప్రతిభకు అద్దంపట్టాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో కొలైయుథిర్ కాలమ్ కొలమావు కోకిల వంటి మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నది. తెలుగులో సైరాలో చిరంజీవి సరసన కనిపించనుంది. పలు కమర్షియల్ చిత్రాల్లో నాయికగా నయనతారను సంప్రదించినప్పటికీ కథాంశాల్లో కొత్తదనం లేకపోవడంతో ఆమె తిరస్కరించిందని చెబుతారు.

samantha
సమంత: మనం చిత్రాన్ని సమంత కెరీర్‌లో మేలిమలుపుగా అభివర్ణించవొచ్చు. అంతకుముందు చక్కటి ప్రేమకథా చిత్రాల్లోఅభినయప్రధాన చిత్రాల్లో నటించినప్పటికీ మనం నటిగా ఆమెకు కొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సమంత చక్కటి ప్రమాణాల్ని పాటిస్తున్నది. ముఖ్యంగా వివాహానంతరం ఆమె ప్రయారిటీస్ పూర్తిగా మారిపోయాయి. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్‌లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పాత్రలపరంగా సమంత దృక్పథంలో వచ్చిన మార్పుకు ఇదేనిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగులో మహానటి చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తమిళంలో సూపర్‌డీలక్స్ అనే ప్రయోగాత్మక చిత్రంలో కనిపిస్తున్నది. ఇందులో ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుందని తెలుస్తున్నది. కన్నడ చిత్రం యూ టర్న్ తెలుగు, తమిళ రీమేక్‌లో సమంతా నటించనుంది. కథలో ఏదో ఒక ఎక్సైటింగ్ ఎలిమెంట్ లేనిదే సమంత సినిమాలకు అంగీకరించడం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు.
nitya-menon
నిత్యామీనన్: కెరీర్ ఆరంభం నుంచి నిత్యామీనన్‌ది విభిన్న ప్రయాణమే. అలా మొదలైంది ఇష్క్ మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు రుద్రమదేవి ఓకే బంగారం చిత్రాలు ఆమె ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. తెలుగులో ఎక్కువగా ప్రధాన స్రవంతి చిత్రాల్లో నటించిన ఆమె తమిళం, మలయాళంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రయోగాలకే మొగ్గు చూపింది. ప్రస్తుతం నిత్యామీనన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రాణ అనే పేరుతో రూపొందుతున్నఓ చిత్రంలో నటిస్తున్నది. హిల్‌స్టేషన్ నేపథ్యంలో సాగే విభిన్న థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ రచయిత్రి పాత్రలో కనిపించనుంది.

ప్రస్తుతం ఆమె తెలుగులో ఆ! చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నది. కమర్షియల్ చిత్రాలకు దూరంగా నిత్యామీనన్ ప్రయోగాత్మక కాన్సెప్ట్స్ వైపు మొగ్గుచూపుతున్నదని, ముఖ్యంగా సోలో నాయిక చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే ఉద్దేశంతో వుందని చెబుతున్నారు. ఇదే పంథాలో యువ కథానాయిక సాయిపల్లవి సైతం వినూత్న కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నది. ఫిదా ఎంసీఏ చిత్రాలతో యువ ప్రేక్షకులహృదయాల్ని గెలుచుకున్న ఈ తమిళ సోయగం ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నది.

సాయిపల్లవి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కణం చిత్రం కోసం దక్షిణాది పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ సినిమాలో సాయిపల్లవి అమ్మ పాత్రలో కనిపిస్తుందని తెలిసింది.సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్న ఈ కథానాయికల కోసం దర్శకనిర్మాతలు సరికొత్త కథల్ని సృజించే పనిలో ఉన్నారు. కేవలం ఇతివృత్తాలో నవ్యత వుంటేనే వారిని ఒప్పించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమకాలీన చిత్ర పరిశ్రమకు ఇదొక శుభపరిణామని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

2110

More News

VIRAL NEWS