అప్పుడే దర్శకుడికి లైఫ్!


Sat,September 8, 2018 11:56 PM

Anu Emmanuel pins hopes on Shailaja Reddy Alludu

మారుతి సినిమా అంటే వినోదానికి లోటుండదు. కెరీర్ ఆరంభంలో యువతను లక్ష్యంగా చేసుకొని సినిమాల్ని రూపొందించిన ఆయన అనంతరం పంథా మార్చారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో మంచి విజయాల్ని దక్కించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. కథలో నూతనత్వానికే నేను ప్రాధాన్యతనిస్తాను. విభిన్న ఇతివృత్తాలతో సినిమాలు చేయాలనే లక్ష్యంతో కెరీర్‌లో ముందుకుసాగుతున్నాను అని అంటున్నారాయన. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా మారుతి పాత్రికేయులతో సంభాషించారు.ప్రస్తుతమున్న డిజిటల్ యుగంలో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే ట్రైలర్‌లోనే మిరాకిల్ చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమా తప్పకుండా చూడాలని ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్‌పోస్టర్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాకు వెళ్లాలా? వొద్దా? అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు సినిమా ఆడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి.ఓ దర్శకుడిగా డిఫరెంట్ జోనర్స్ సినిమాలు చేయాలి. అప్పుడే లైఫ్ ఉంటుంది. నేను చూసిందే ప్రపంచం అనుకోకూడదు. నా ప్రపంచాన్ని వదిలి బయటికొస్తేనే కొత్త కథల్ని ఆవిష్కరించగలుగుతాను.

మీ కెరీర్‌లో ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏమిటి?

-ఇప్పటివరకు నేను యువతరం ప్రేమకథలు, వినోదాత్మక చిత్రాలు, ఓ హారర్ సినిమా చేశాను. కానీ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రాన్ని చేయలేదు. శైలజారెడ్డి అల్లుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫస్ట్‌కాపీ చూసి చాలా సంతృప్తిచెందాను.

ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది? ట్రైలర్ చూసినవారు అల్లరి అల్లుడు సినిమాలో నాగార్జునగారి మేనరిజమ్స్ కనిపించాయని అంటున్నారు?

-ఈ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్‌లో చైతూని చూస్తే నాగార్జునగారిని చూసినట్లే అనిపించింది. తెలియకుండానే చైతూ క్యారెక్టర్‌లో నాగార్జున ఛాయలు కనిపించాయి. ఈ సినిమాలో చైతన్య ఉల్లాసం, ఉత్సాహం కలబోసిన యువకుడిగా కనిపిస్తాడు. తనదైన శైలిలో సెటిల్డ్‌గా ఫర్‌ఫార్మ్ చేశాడు.

ఇంతకి శైలజారెడ్డి తన అల్లుడితో ఎందుకు తగాదా పడుతుంది?

-అందరూ అనుకుంటున్నట్లుగా అత్త, అల్లుడు మధ్య సవాళ్లతో నడిచే కథ కాదిది. ఆ తరహా కథల్ని ఇదివరకే చూశాం. ఇద్దరు ఇగోయిస్ట్‌లైన(అహంభావులు) తల్లీకూతుళ్ల మధ్య ఓ యువకుడు ఎలాంటి సంఘర్షణకులోనయ్యాడు? పరిణితితో వ్యవహరించి చివరకు తన ప్రేమను ఎలా సుఖాంతం చేసుకున్నాడు? శైలజారెడ్డి అల్లుడిగా ఎలా అంగీకారం పొందాడు? అన్నదే చిత్ర కథ.

ఈ తరహా పాత్ర నాగచైతన్యకు కొత్త కదా? క్యారెక్టర్ డిజైన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

-ఇద్దరు ఇగోయిస్ట్‌ల మధ్య ఓ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి ఉంటే ఎలా వుంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. చైతన్య శారీరక భాషకు చక్కగా సరిపోయిన కథ ఇది. వ్యక్తిగత జీవితంలో చైతన్య చాలా కూల్‌గా ఎప్పుడూ పాజిటివ్‌గా కనిపిస్తాడు. అతనికి ఓపిక చాలా ఎక్కువ. తన పాత్రకు చైతన్య వందశాతం న్యాయం చేశాడు. ఎంత టార్చర్ చేసినా సరే తనకు కావాల్సింది రాబట్టుకునే ఆశావహ దృక్పథం ఉన్న యువకుడిగా చైతన్య పాత్ర సాగుతుంది. సాధారణంగా రమ్యకృష్ణవంటి సీనియర్ నటి ముందు పర్‌ఫార్మెన్స్ చేయడం మామూలు విషయం కాదు. నాగచైతన్య మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా నటించాడు.

నాగచైతన్యను దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేసుకున్నారా?

- చైతన్యతో సినిమా చేయాలనుకున్నప్పుడు కుటుంబ కథనే చేయాలని ఫిక్సైపోయాను. ఎందుకంటే అక్కినేని హీరోలకు లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ కథలు బాగా సూటవుతాయి. ఈ సినిమాలో కూడా ప్రథమార్థమంతా ప్రేమకథ నడుస్తుంది. ద్వితీయార్థం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. చివరి అర్ధగంటలో నేను చెప్పదలచుకునే అంశాన్ని ఆవిష్కరించాను.

మీ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో మానసిక డిజార్డర్స్‌ను (రుగ్మతలు) కథా వస్తువులుగా తీసుకున్నారు. ఇందులో అలాంటి అంశమేమైనా ఉందా?

-ఈ సినిమాలో అలాంటి పాయింట్ ఉండదు. ఇగో చుట్టూ కథ నడుస్తుంది. మనందరికి ఎంతోకొంత ఇగో ఉంటుంది. అది మనతో పాటే పెరుగుతుంటుంది. మరీ ఎక్కువైనప్పుడే సమస్యలొస్తాయి. అపజయాల్ని అంగీకరించే నైజం కోల్పోతాం. అలాంటి లక్షణాలు మంచివి కావని, జీవితంలో ఎదగాలంటే ఇగోకు దూరంగా ఉండాలని ఈ సినిమాలో చూపించాం.

టైటిల్ పాత్ర చిత్రాల్ని స్ఫురించేలా ఉందంటున్నారు?

-80,90దశకాల్లో ఈ తరహా టైటిల్స్‌తో సినిమాలొచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో టైటిలొక్కటే పాతది. కథంతా కొత్తదే. రిలీజైన తర్వాత దీనిని అందరూ అంగీకరిస్తారు. ఏదో ఒక టైటిల్ పెట్టి అందులో రమ్యకృష్ణగారిది ఓ పాత్ర అంటే బాగుండదు. అందుకే ఆమె పేరు స్ఫురించేలా ఈ టైటిల్ పెట్టాం.

అను ఇమ్మాన్యుయెల్ పాత్ర ఎలా ఉంటుంది?

-ఈ సినిమా కథ చెప్పినప్పుడు అనుఇమ్మాన్యుయెల్ నాతో కొంచె ఇది నా క్యారెక్టరే సర్ అని చెప్పింది. సినిమా కాబట్టి కొంచెం డోస్ పెంచి ఆమె పాత్రను డిజైన్ చేస్తాం. ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయెల్ ఇగోయిస్ట్‌గా కనిపిస్తుంది. ఏ విషయంలోనై మెట్టు దిగదు. నేను రాసుకున్న కథకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది.

తదుపరి చిత్రాల గురించి?

-ప్రస్తుతం యు.వి., గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత మంజుల (మహేష్‌బాబు సోదరి) నిర్మాతగా ఓ సినిమా చేయాలి. విజయ్ దేవరకొండతో కూఆ ఓ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. నా దర్శకత్వంలో సినిమా చేయాలనుందని విజయ్ ఒక సందర్భంలో నాతో చెప్పాడు.

2476

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles