ఆ భయం నాకు ఎప్పుడూ లేదు!


Sun,January 6, 2019 11:27 PM

ANR role is honestly dignifiedly portrayed Sumanth

చిన్నతనం నుంచి నేను తాతగారిలా కనిపిస్తానని, నాలో ఆయన పోలికలు వున్నాయని అంతా అనేవారు. దాన్ని ప్రదర్శించడానికి నాకు ఇన్నాళ్లుగా ఎలాంటి వేదిక దొరకలేదు. అలాంటి అవకాశం ఎన్‌టిఆర్ బయోపిక్‌తో లభించింది. క్రిష్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే సినిమాలో మా తాతగారి పాత్ర చాలా నిజాయితీగా ఉంటుందని అర్థమైంది అన్నారు సుమంత్. ఆయన అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన తాజా చిత్రం ఎన్‌టిఆర్. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఎన్‌టిఆర్ బయోపిక్‌లో తాతగారి పాత్రలో నటించాను. ఇందులో ఆయనది సహాయపాత్ర మాత్రమే. ఎన్‌టిఆర్, ఏఎన్నార్‌ల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. నన్ను తాతగారి పాత్రలో అభిమానులు అంగీకరిస్తారా? అంగీకరించరా? అనే భయం నాకు ఎప్పుడూ లేదు. సినిమాలో ఐదు రకాల గెటప్‌లలో కనిపిస్తాను.

ఇందులో నటనాపరంగా ఏ గెటప్ విషయంలోనూ నేను కష్టపడలేదు కానీ మేకప్ విషయంలో మాత్రం కొంత శ్రమించాల్సి వచ్చింది. సినిమా రంగంలో తాతగారికి, ఎన్టీఆర్‌గారికి మధ్య మంచి పోటీ వుండేది. తాతగారి పాత్రకు నన్ను ఎంచుకుంటారని ఊహించలేదు. ఒక రోజు బాలకృష్ణ ఫోన్‌చేసి తాతగారి పాత్రకు నిన్నే అనుకుంటున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత క్రిష్ కథ వినిపించాడు. క్రిష్, బాలకృష్ణ కాకుండా ఈ చిత్రాన్ని మరొకరు చేసుంటే ఖచ్చింతగా నటించే వాడిని కాదు. వాళ్లిద్దరి వల్లే ఈ బయోపిక్‌లో నటించాను. తాతగారి బయోపిక్ చేయాలని నేనే కాదు మా కుటుంబ సభ్యులెవరూ అనుకోలేదు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం చిన మావయ్య(నాగార్జున)కే వుంది. ఈ సినిమాలో నాకు బాలకృష్ణ గెటప్ తరువాత బాగా నచ్చిన గెటప్ రానాదే. తనని తొలిసారి సెట్‌లో చూసినప్పుడు వీడేనా అనుకున్నాను. అంతగా రానా మారిపోయి నటించాడు. ఇటీవల నేను నటించిన ఇదం జగత్ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దానికి సరైన ప్రచారం లేకపోవడమే కారణం. మళ్లీ రావా విడుదలకు ముందు అంగీకరించిన చిత్రమది. జనవరిలో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను అన్నారు.

2279
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles