దొరసాని నన్ను సూత్తాంది!


Thu,June 6, 2019 11:17 PM

Anand Devarakonda Dorasani Movie Teaser Release

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం దొరసాని. కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. చిన్న దొరసాని గడీల నుంచి బయటకే రాదు. దొరసానిలు ఎప్పుడైనా బయటకొత్తార్రా అంటూ నలుగురు యువకుల సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. నేను దొరసానిని ప్రేమిస్తున్నాన్రా... దొరసాని కూడా నన్ను సూత్తాంది అని కథానాయకుడు రాజు తన మిత్రుడితో అనడం, చివరగా మీరు నా దొరసాని అంటూ రాజు కథానాయిక శివాత్మికతో చెప్పే భావోద్వేగభరిత డైలాగ్‌తో టీజర్ ఆకట్టుకుంది. దొరసాని దేవకి పాత్రలో శివాత్మిక చక్కటి హావభావాలతో మెప్పించింది. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ అందమైన ప్రేమకథ ఇది. నాలుగు కాలాల పాటు గుర్తుండిపోతుంది అన్నారు. స్వచ్ఛమైన, ఆర్ధ్రత కలబోసిన ప్రేమకథాంశమిది. సంభాషణలన్నీ తెలంగాణ మాండలికంలో సహజంగా ఉంటాయి. హృదయాల్ని స్పృశించే ఉద్వేగాలుంటాయి అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం కొత్త దర్శకులకు రిఫరెన్స్‌లా ఉంటుంది. మహేంద్ర తన ఆలోచనల్ని వందశాతం తెరమీదకు తీసుకొచ్చాడు. ఈ సినిమా విషయంలో సురేష్‌బాబుగారు మాకు మద్దతుగా నిలిచారు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 80వ దశకం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ కిషోర్, వినయ్ వర్మ, శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, ఆర్ట్: జెకె మూర్తి, ఎడిటర్: నవీన్ నూలి, సమర్పణ: సురేష్‌బాబు, సంగీతం: ప్రశాంత్ విహారి, రచన-దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.

2083

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles