ఆంక్షల్ని విధించుకోను..


Fri,March 15, 2019 11:17 PM

alia bhat to make telugu debut with ss rajamouli rrr

దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ కల ఆర్‌ఆర్‌ఆర్ రూపంలో నిజమవ్వడం సంతోషంగా ఉంది అని తెలిపింది అలియాభట్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది అలియాభట్. రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించబోతున్నది. ఫెమినా మహారాష్ట్ర అచీవర్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ సినిమా గురించి చెబుతూ దక్షిణాదిలో తొలిసారిగా నేను నటిస్తున్న సినిమా ఇది. ఉత్సుకతతో పాటు ఉద్వేగంగా ఉంది. ప్రస్తుతం నా పాత్ర కోసం సన్నద్ధమవుతున్నాను. అంతకుమించి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. గొప్ప చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉంది అని తెలిపింది. అలాగే ఓ సినిమాను అంగీకరించేముందు నా పాత్ర తీరుతెన్నులతో పాటు అందులో దానికున్న ప్రాధాన్యత ఏమిటి? ఆ సినిమాకు దర్శకుడు ఎవరనే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నిజాయితీగా దర్శకుడు నాకు అప్పగించిన పాత్రకు న్యాయం చేయడానికి శ్రమిస్తాను. అంతే తప్ప నా ఇమేజ్‌కు సరితూగే కథాంశమా? కాదా? అని ఎప్పుడూ ఆలోచించను. ఓ నటిగా అలాంటి ఆంక్షల్ని విధించుకోను అని తెలిపింది. ఆమె నటించిన గల్లీబాయ్ చిత్రం ఇటీవలే విడుదలైన చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అలియాభట్ బాలీవుడ్‌లో కలంక్, బ్రహ్మాస్త్ర సినిమాలు చేస్తున్నది.

894

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles