బన్నీ సిక్సర్‌ కొట్టాడు..

Mon,January 13, 2020 11:05 PM

‘సరదాగా, నిజాయితీతో సినిమా చేస్తే ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని నమ్మాం. అదే నిజమైంది. త్రివిక్రమ్‌తో నా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ ఇది. మా ప్రయాణంలో ఈ విజయం ఓ కామా మాత్రమే’ అని అన్నారు అల్లు అర్జున్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం థాంక్స్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘మాపై ప్రేమ, వాత్సల్యంతో బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు. ఆరు బ్లాక్‌బస్టర్‌ సాంగ్స్‌ ఇచ్చి విడుదల ముందే హిట్టయిన ఫీలింగ్‌ కలిగించి మా పనిని సగం తగ్గించాడు తమన్‌. మీరు కల కనండి మేము నిజం చేస్తాం అని నిర్మాతలు అరవింద్‌, రాధాకృష్ణ మాకు పూర్తిస్వేచ్ఛనిచ్చారు. ఈ సినిమాకు ఆది, అంతం బన్నీనే. సినిమాల్ని నిరంతరం ప్రేమిస్తాడు. బన్నీలోని గొప్ప నటుడిని ఆవిష్కరించిన సినిమా ఇది. గర్వంతో కాకుండా ఆనందంతో ఈ మాట చెబుతున్నాను. సచిన్‌కు ఫుల్‌టాస్‌ వేసినా, బన్నీకి ఇలాంటి సినిమా వచ్చినా అది సిక్సర్‌గానే ఉంటుంది’ అని అన్నారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో నాకో పెద్ద బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.


ఏడాదిన్నర క్రితం మంచి సినిమా చేస్తానని మాటిచ్చాను. అది ఈ సినిమాతో నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. హీరోగా నా స్థాయిని పెంచే సినిమాలు చేశారు రాధాకృష్ణ. ఈ సినిమాతో మా నాన్నకు డబ్బులు బాగా రావాలి, లాభాల్లో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కొత్త ఇళ్లు కట్టుకుంటున్నాను. నా భార్యా పిల్లలతో కలిసి డ్రామా ఆడైనా నాన్న నుంచి డబ్బులు లాగేస్తాను (నవ్వుతూ). ‘నా పేరు సూర్య’ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన పెద్ద సినిమా చేయాలనుకున్నాను. ఆ సినిమాకు ఏ దర్శకుడైతే న్యాయం చేయగలడని అనుకున్నప్పుడు త్రివిక్రమ్‌ గుర్తొచ్చారు. ఈ సినిమాతో మరోమారు మా అందరికి లైఫ్‌ ఇచ్చారాయన. బంధుప్రీతి గురించి చాలా మంది విమర్శిస్తున్నారు. పూజారితో పాటు అతడి తర్వాతి తరాలు గుడిలోని దేవుడికి తమ జీవితాన్ని అంకితం ఇస్తారు. అలాగే ప్రేక్షకదేవుళ్లకు వినోదాన్ని పంచడానికి మా కుటుంబం అంకితమైంది. తాతయ్య, నాన్న, ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను. దీనిని బంధుప్రీతి అనుకున్నా బాధపడను’ అని చెప్పారు. ‘డీజే’తో బన్నీకి అభిమానిగా మారిపోతే ఈ సినిమాతో త్రివిక్రమ్‌కు ఫ్యాన్‌ అయ్యానని పూజా హెగ్డే చెప్పింది. ‘కళామతల్లి పాదాల వద్ద సేద తీర్చుకుంటున్న కుటుంబం మాది. బన్నీ, త్రివిక్రమ్‌ కెరీర్‌లోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో అది పెద్ద విజయాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకముంది’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

637

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles