నా వయసు పాతికేళ్లే!


Mon,September 24, 2018 11:54 PM

Akkineni Nagarjuna Interview About Devdas Movie

రామానాయుడు స్టూడియో..సోమవారం ఉదయం 10.30 నిమిషాలు.. ఓ బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ కారులో నుంచి బ్లాక్ టీషర్ట్, బ్లాక్ స్పోర్ట్స్ ప్యాంట్‌తో ైస్టెలిష్ గాగుల్స్ ధరించి ఓ నవయువకుడు దిగాడు. చూడగానే హీరో నాగార్జునలా అనిపించారు. ఒక్కసారి పరికించి చూస్తే నిజంగా ఆయన అక్కినేని నాగార్జునే. అరవై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఐదేళ్ల నవయువకుడిలా కనిపిస్తారాయన. సాధారణంగా వయసు శరీరానికి సంబంధించినది కాదు. మనసుకు సంబంధించినది అంటుంటారు. నాగార్జునను చూస్తుంటే వయసు అనేది శరీరానికి కూడా సంబంధించినది కాదేమో అనిపిస్తుంది. అందుకే అభిమానులు ఆయన్ని అభినవ మన్మథుడు అని పిలుచుకుంటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం దేవదాస్‌ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగ్ మీడియాతో ముచ్చటించారు.

చాలా రోజుల తర్వాత మళ్లీ డాన్ పాత్రలో నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

రెగ్యులర్ డాన్ సినిమాల్లో కనిపించే సెటప్‌లు, సెటిల్‌మెంట్లు ఇందులో ఉండవు. దేవ, దాస్ అనే ఇద్దరు స్నేహితుల కథ ఇది. వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? స్నేహితులంటూ ఎవరూ లేని దేవా జీవితంలోకి దాస్ ఎలా వచ్చాడన్నదే చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది.

దేవదాస్ నేపథ్యమేమిటి? నాన్నగారి దేవదాసుతో ఈ సినిమాకు ఎలాంటి పోలికలు ఉంటాయి?

నాన్నగారు నటించిన దేవదాసు ట్రాజెడీ లవ్‌స్టోరీ అయితే మా సినిమా ఆద్యంతం నవ్విస్తుంది. మందు బాటిల్ ఒక్కటే రెండు సినిమాల్లో కామన్ పాయింట్. దర్శకుడు రాజుహిరాణీ సినిమాల శైలిలో సున్నితమైన సందేశంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. తొందరగా ప్రేక్షకులకు చేరువ అవ్వాలనే ఈ టైటిల్ పెట్టాం. సందేశాలు కాకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఎలాంటి సమస్యనైనా నవ్వుతూ ఎదురించే దేవా అనే డాన్‌గా కనిపిస్తాను. కాలేజీ రోజుల నుంచి మొదలుకొని డాన్‌గా మారిన తర్వాత అతడి జీవితంలో జరిగే పరిణామాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

సోలో సినిమాలతో పోలిస్తే మల్టీస్టారర్ సినిమాల విషయంలో హీరోలపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని అనుకోవచ్చా?

మల్టీస్టారర్ సినిమా ఫలితంలో ఏదైనా తేడా వస్తే ఇద్దరు హీరోలు కలిసి చేసినా కూడా హిట్టు కొట్టలేకపోయారని విమర్శిస్తారు. స్టార్ హీరోలు కలిసి పనిచేస్తే అంచనాలు ఎక్కువవుతాయి. అభిమానులు హీరోల నుంచి కొత్తదనాన్ని ఆశిస్తారు. ఆ ఆంచనాల్ని చేరుకోవాలనే ఒత్తిడి ఉంటుంది. ఆ భారాన్ని ఇద్దరూ హీరోలు పంచుకోవాల్సి వస్తుంది.

హాలీవుడ్, బాలీవుడ్‌లలో సమ వయసున్న హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేస్తుంటారు. అలాంటి సినిమాలు చేసే ఆలోచన మీకు ఉందా?

నాని, నేను ఒకే వయసువాళ్లం (నవ్వుతూ). ఒకే వయస్సు ఉన్న హీరోలతో కూడిన మల్టీస్టారర్ కథలను దర్శకులెవరూ నా దగ్గరకు తీసుకురాలేదు. ఒకే వయసువారు సినిమాలు చేస్తే బోర్‌గా ఉంటుంది. ఇద్దరు ముసలివాళ్లు కలిసి చేశారని అందరూ విమర్శిస్తుంటారు.

తండ్రి పాత్రలతో కూడిన కథల్లో నటించే ఆలోచన ఉందా?

నాకు పిల్లలు లేరు. చైతూ, అఖిల్ నాకు సోదరులు మాత్రమే(నవ్వుతూ). ఇప్పుడు నా వయసు 59 ఏళ్లు. కానీ మానసికంగా ఇరవై ఐదేళ్ల దగ్గరే ఆగిపోయాను. నిరంతరం ఆ భావనతోనే జీవిస్తుంటాను. ఇప్పటికీ నేను పాతికేళ్ల కుర్రాడిగానే ఆలోచిస్తుంటానని నా భార్య అమలు ఎప్పుడూ చెబుతుంటుంది. నా ఆలోచన విధానం అలా ఉంది కాబట్టే చైతూ, అఖిల్‌లతో కలిసిపోగలుగుతున్నాను. వారికి సలహాలు ఇచ్చే సమయంలో మాత్రమే పెద్దవాడిగా మారిపోతాను.

అశ్వినీదత్‌తో ఆఖరిపోరాటం సినిమాతో మీ ప్రయాణం ప్రారంభమైంది. ఆయనతో ఐదవ సినిమా చేస్తుండటం ఎలా ఉంది?

ఆఖరిపోరాటం అంగీకరించే సమయంలో శ్రీదేవి నటించిన బాలీవుడ్ చిత్రం మిస్టర్ ఇండియా విడుదలైంది. ఆ సినిమాతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆమె పక్కన నటిస్తే నాకు ఎలాంటి ఉపయోగం ఉండదని అనుకున్నాను. నాన్న ద్వారా ఒప్పించి నాతో ఆ సినిమా చేయించారు అశ్వినీదత్. శ్రీదేవి లాంటి పాపులర్ స్టార్‌తో చేస్తే నాకు మంచి పేరొస్తుందని నాన్న చెప్పడంతో చివరకు అంగీకరించాను. శివ, గీతాంజలి తర్వాతే నాకు స్టార్‌డమ్ వచ్చింది. అంతకుముందు డైలాగ్‌లు చెప్పడం రాదు, సన్నగా ఉంటాడనే విమర్శలు నాపై చాలా వచ్చాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆఖరిపోరాటం చేయడానికి ఆలోచించాను. ఆ తర్వాత అశ్వినీదత్‌తో మళ్లీ నాలుగు సినిమాలు చేశాను. దేవదాస్ సినిమా నిర్మాతగా ఆయనకు మంచి కమ్‌బ్యాక్ సినిమా కావాలని, తన కోసం సినిమా చేయాలని అశ్వినీదత్ అడగటంతో సొంత సినిమాలా భావించి నటించాను.

నాని ఎక్కువగా ఫోన్ వాడుతూనే కనిపిస్తుంటాడని ట్విట్టర్ ద్వారా అతడిని ఆటపట్టించారు?

ఫోన్ లేకుండా ఎప్పుడూ నాని కనిపించడు. నిద్ర పోతున్నప్పుడు కూడా ఫోన్ అతడి పక్కనే ఉంటుంది. అతడి స్థానంలో వేరే వాళ్లు అలా కనిపిస్తే ఫోన్‌ను విరగొట్టేవాణ్ణి. నాని హీరో కాబట్టి సెట్స్‌లో ఎవరూ ఏమీ అనడం లేదు. అతిగా ఫోన్ వాడటం కూడా ఓ వ్యాధే. చాలా మందిలో ఆ అలవాటు కనిపిస్తుంది. తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండాఫోన్‌లో మునిగిపోతుంటారు.

కరణ్‌జోహార్ సినిమాతో అఖిల్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి?

అఖిల్, కరణ్‌జోహార్ మధ్య మంచి స్నేహం ఉంది. రెండేళ్ల క్రితమే అఖిల్‌ను హిందీ చిత్రసీమకు పరిచయం చేస్తానని కరణ్ నాతో అన్నాడు. గతంలో అఖిల్ తొందరపడ్డాడు. మళ్లీ అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అఖిల్ నటుడిగా నిరూపించుకున్న తర్వాత హిందీ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

బంగార్రాజుతో పాటు రాహుల్ రవీంద్రన్ సినిమాకు సంబంధించి కథలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఏది ముందు సెట్స్‌పైకి వస్తుందో నిర్ణయించుకోలేదు. మన్మథుడు-2 అనే టైటిల్‌ను అన్నపూర్ణ సంస్థలో రిజిస్టర్ చేయించాం. నాతో పాటు చైతూ, అఖిల్‌లో ఎవరికో ఒకరికి ఈ టైటిల్ బాగుంటుందనుకున్నాం. బాలీవుడ్‌లో నేను నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించి లండన్ షెడ్యూల్ ఇంకా మిగిలి ఉంది. అలాగే తమిళ నటుడు ధనుష్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ పిరియాడిక్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాను. 600 ఏళ్ల క్రితం నాటి పాత్రలో నేను కనిపించబోతున్నాను.

ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోనే ఎక్కువ భాగం ఉంటుంది.

ఎన్టీఆర్ సినిమాలో నాన్న పాత్రలో సుమంత్‌ను చూడగానే తొలుత గుర్తుపట్టలేకపోయాను. అంతలా ఒదిగిపోయాడు. సుమంత్‌లో నాన్న పోలికలు ఎక్కువ ఉంటాయి. చిన్నతనం నుంచి సుమంత్ నాన్న దగ్గరే పెరగడం వల్ల మాట్లాడేతీరు, నడవడిక అన్ని ఆయనవి వచ్చాయి.

భారత రాజ్యాంగ రచనలో సర్దార్ వల్లభాయ్‌పటేల్‌కు సెక్రెటరీగా పనిచేసిన ఓ ప్రముఖ వ్యక్తి జీవితకథతో వెబ్‌సిరీస్ చేసే అవకాశం వచ్చింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంలో నటించలేకపోయాను.

మల్టీస్టారర్ సినిమాలు సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారా?

మల్టీస్టారర్ సేఫ్ అని ఏ పుస్తకంలో లేదు. ఆ కథలు పరాజయం పాలైన దాఖలాలున్నాయి. మల్టీస్టారర్‌చిత్రాల్లో పాత్రలు చాలా ఉంటాయి. కథను ఆసక్తికరంగా రాసుకోవడానికి దర్శకుడికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.

5282

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles