నా విషయంలో అవి శత్రువులు!

Wed,January 23, 2019 11:24 PM

అక్కినేని నటవారసుడిగా అఖిల్ చిత్రంతో తెరంగేట్రం చేశారు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. తొలి సినిమా పరాజయంతో చాలా నేర్చుకున్నానని, ఎంత ఫ్యామిలీ నేపథ్యం వున్నా ప్రేక్షకులు తనని నమ్మి థియేటర్‌కు రావాలంటే కొంత సమయం పడుతుందని, తాజా చిత్రం విషయంలో మంచి నమ్మకంతో వున్నానని చెబుతున్నారాయన. అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం మిస్టర్‌మజ్ను. వెంకీ అట్లూరి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హీరో అఖిల్ అక్కినేని పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

సినిమా విడుదలవుతోందంటే ఒత్తిడి ఏమైనా ఫీలవుతున్నారా?

-గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో చాలా ఒత్తిడిగానే ఫీలవుతున్నాను. అయితే ఈ సారి మాత్రం ఫ్యాన్స్ గట్టిగా కొట్టాలని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

వెంకీ మూడేళ్ల క్రితం కథ చెప్పారన్నారు. కథ నచ్చితే ఇంత కాలం ఎందుకు ఆగాల్సి వచ్చింది?

-అప్పటికే వి.వి.వినాయక్‌తో ఓ సినిమా అంగీకరించి వున్నాను. ఆ సినిమా తరువాత మా సొంత సంస్థలో మా నాన్న ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ రెండూ పూర్తి కావాలంటే మూడేళ్లు పడుతుంది. ఈ విషయం వెంకీతో అప్పుడే చెప్పాను. ఇద్దరం ఫ్రీ అయిన తరువాతే ఈ సినిమా చేద్దామన్నాడు. ఆ కారణంగానే నాతో వెంకీ సినిమా చేయడానికి ఇన్నేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.

గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మీకు ఏ విషయంలో ఛాలెంజింగ్‌గా అనిపించింది?

-సినిమా తొలి భాగం మొత్తం నా పాత్ర ఆధారంగానే సాగుతుంది. ఇదొక ప్యూర్ లవ్‌స్టోరి. అయినా తొలి 30 నిమిషాల తరువాతే ప్రేమకథ మొదలవుతుంది. నా గత చిత్రాలతో పోలిస్తే అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా. కుటుంబ భావోద్వేగాల్ని కథలో మిళితం చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాల్లో నేను పోషించిన పాత్రలకు చాలా భిన్నంగా కొత్త పంథాలో సాగే పాత్రలో నటించాను. సినిమాలో ప్లేబాయ్ విక్కీగా కనిపిస్తాను. ఆ పాత్రను తెరపైకి మరింత ప్రభావవంతంగా తీసుకురావడానికి చాలానే శ్రమించాను. నటుడిగా నాకు ఓ ఛాలెంజ్‌గా భావించి చేశాను.

మూడవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాలనే అంచనాలు ఏర్పడ్డాయి? కదా?

-మితి మీరిన అంచనాలు, ఒత్తిడి అనేవి నా విషయంలో శత్రువులు. అంచనాల కోసం కాకుండా నా వంతు బెస్ట్ ఏం ఇవ్వాలో దాని గురించే ఎక్కువగా ఆలోచించాలనుకున్నాను. కెరీర్ ప్రారంభం నుంచి భారీ హిట్ కొట్టాలనే హైప్ ఎందుకు క్రియేట్ అయ్యిందో...ఎలా వచ్చిందో కానీ మొత్తానికైతే నా సినిమా అంటే భారీ స్థాయిలోనే వుంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అది నా పొరపాటో ఏమో తెలియడం లేదు.

గత చిత్రాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని మీలో ఏమైనా మార్పులొచ్చాయా?

-అనుభవాన్ని బట్టే మనలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. నేను నటించిన తొలి సినిమా అఖిల్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. దాని నుంచి బయటికి వచ్చి హలో చేయడానికి చాలా సమయం పట్టింది. రెండవ సినిమా ఫలితంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా విజయం ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే ధైర్యాన్నిచ్చింది.

హలో మీరు ఆశించిన స్థాయిలోనే విజయం సాధించిందని అనుకుంటున్నారా?

-హలో ఓ రేంజ్‌లో హిట్ అవుతుందని ఆశించాం కానీ ఆ స్థాయి విజయాన్ని సాధించని మాట నిజమే. నాకు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ వున్నా, స్టార్ హీరో కుమారుడిని అయినా నన్ను నమ్మి ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కొంత వరకే పనిచేస్తుంది. అయితే ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించడానికి మాత్రం కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది.

ఈ సినిమా విషయంలో గట్టి నమ్మకంతో వున్నారా?

-ఇదొక ఎంటర్‌టైనర్. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంటర్‌టైన్ చేసే చిత్రాలనే కోరుకుంటున్నారు. హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్ వున్న చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇవే అంశాలతో ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 విజేతగా నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశిస్తూ థియేటర్‌కు ఎవరైతే ప్రేక్షకులు వస్తున్నారో వారిని సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో చేసిన సినిమా మిస్టర్ మజ్ను.

సినిమాలో మీ పాత్ర చిత్రణ ఎలా వుంటుంది?

-దర్శకుడు వెంకీ అట్లూరి ఓ క్లాసిక్ చిత్రాన్ని తీసుకుని తన పంథాలో ఆవిష్కరించారు. నాన్న నటించిన నిన్నే పెళ్లాడుతా, మన్మథుడు, త్రివిక్రమ్‌గారి చిత్రాల స్ఫూర్తితోనే వెంకీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అలా అని ఏ సన్నివేశాన్ని కాపీ చేయలేదు కానీ స్ఫూర్తిగా మాత్రం తీసుకున్నాడు. ఈ సినిమాకు ముందు వెంకీ మామూలుగా తెలుసు. అయితే ఈ సినిమాతో మాత్రం నాకు మంచి మిత్రుడయ్యాడు.

ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారని చెప్పడానికి కారణం?

-ఎన్టీఆర్ సాధారణంగా ఎవరిని పొగడరు. తను చెప్పినట్టు నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకుంటా. తప్పుల నుంచి చాలా నేర్చుకునే ప్రయత్నం చేస్తా. తొలి సినిమా ఫలితంతో చాలా నేర్చుకున్నాను. స్టార్ హీరోలకు ఫ్లాప్ వస్తే అందులోంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే నేను స్టార్ హీరోను కాదు కాబట్టి త్వరగానే కోలుకున్నాను. తొలి సినిమా ఫ్లాప్ రావడం వల్ల నేను కొంచెం మానసికంగా దృఢంగా తయారయ్యాను. రెండవ సినిమా చేసేటప్పుడు నాలో ఆత్మ విశ్వాసం మరింత ఎక్కువైంది.

ఈ మధ్య మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ వైపు అడుగులు వేసే ఆలోచన వుందా?

-తప్పకుండా. నాక్కూడా అలాంటి చిత్రాల్లో నటించాలని వుంది. అయితే ఇద్దరు ముగ్గురు హీరోలతో కాకుంగా ఓ ఆరుగురు హీరోలతో కలిసి నటించాలని వుంది. అలా అందరితో కలిసి నటిస్తే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం వుంటుంది.

తదుపరి సినిమా గురించి?

-రెండు మూడు కథలు విన్నాను. అందులో ఓ కథ చేయబోతున్నాను. అది ఎవరితో చేస్తాను అన్నది ఫిబ్రవరి చివరి వారంలో ప్రకటిస్తా. ఇకపై ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఆ విషయంలో స్పీడు పెంచుతా.

2649

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles